సర్కార్‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది: కోమటిరెడ్డి
ABN , First Publish Date - 2021-01-20T22:29:00+05:30 IST
ఎల్‌ఆర్ఎస్‌పై సర్కార్‌కు కోర్టులో ఎదురుదెబ్బ తగిలిందని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ

హైదరాబాద్: ఎల్‌ఆర్ఎస్‌పై సర్కార్‌కు కోర్టులో ఎదురుదెబ్బ తగిలిందని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎల్‌ఆర్ఎస్‌పై ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించిందని తెలిపారు. ఇకనైనా సీఎం కేసీఆర్ బుద్ధి తెచ్చుకుని ఎల్‌ఆర్ఎస్‌ను రద్దు చేయాలని కోమటి వెంకటరెడ్డి డిమాండ్ చేశారు.
తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైన విషయం తెలిసిందే. బీఆర్ఎస్‌లపై స్టే యధావిధిగా కొనసాగించాలని హైకోర్టు ఆదేశించింది. ఇదే అంశం సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉందని, సుప్రీంకోర్టు ఉత్తర్వుల తర్వాతే విచారణ చేపడతామని హైకోర్టు పేర్కొంది. అప్పటి వరకు అర్జీదారులను ఇబ్బందులకు గురిచేయొద్దని న్యాయస్థానం సూచించింది. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన ఆర్డర్ కాపీలను ఇవ్వాలని ప్రభుత్వానికి ఆదేశించింది. ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్‌లపై ఇప్పటికే 3 రాష్ట్రాలను సుప్రీంకోర్టు ఇంప్లీడ్ చేసిందని, సుప్రీంకోర్టు తుది ఆదేశాల తర్వాత పిటిషన్‌ను విచారిస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. ఎల్ఆర్ఎస్ అంశంలో ప్రభుత్వం తెచ్చిన జీవోపై ఎలాంటి చర్యలు తీసుకోబోమని హైకోర్టుకు ఏజీ తెలిపారు.