ఉస్మానియాపై ఎన్నాళ్లు నాన్చుడు?

ABN , First Publish Date - 2021-07-08T08:13:54+05:30 IST

ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణంపై ఎందుకు నిర్ణయం తీసుకోవడం లేదు? నాన్చుడు ధోరణి ఇంకెంతకాలం కొనసాగిస్తారు? అంటూ రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం..

ఉస్మానియాపై ఎన్నాళ్లు నాన్చుడు?

ఆస్పత్రిని కూల్చి కడతారా? ఖాళీ స్థలంలో నిర్మిస్తారా? 

6 వారాల్లో చెప్పండి.. లేదంటే మేమే నిర్ణయిస్తాం: హైకోర్టు


హైదరాబాద్‌, జూలై 7(ఆంధ్రజ్యోతి): ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణంపై ఎందుకు నిర్ణయం తీసుకోవడం లేదు? నాన్చుడు ధోరణి ఇంకెంతకాలం కొనసాగిస్తారు? అంటూ రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆస్పత్రి ప్రాంతానికి సంబంధించిన గూగుల్‌ మ్యాప్‌, ఆస్పత్రి బ్లూప్రింట్‌ తమ ముందుంచాలని గతంలోనే ఆదేశించినా ఎందుకు అందించలేదని ప్రశ్నించింది. ఉస్మానియా ఆస్పత్రి ప్రమాదకరంగా ఉందని, దానిని కూల్చి కొత్త భవనం నిర్మించాలని కొందరు.. ఇప్పుడున్న భవనం ఘనమైన చరిత్రకు ప్రతీక అని, వారసత్వ భవనంగా ఇప్పటికే గుర్తించడంతో కూల్చొద్దని మరికొందరు వేర్వేరుగా హైకోర్టులో వ్యాజ్యాలు దాఖలు చేశారు. ఈ కేసులపై బుధవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హిమాకోహ్లీ, జస్టిస్‌ బి.విజయసేన్‌ రెడ్డిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌ వాదనలు వినిపించారు. కొత్తగా నిర్మించాలా లేదంటే మరమ్మతులు చేయా లా? అన్న విషయాలను పరిశీలిస్తున్నామని, నిర్ణయం తీసుకునేందుకు మరింత గడువు కావాలని కోరారు. దీనిపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది.


గతంలోనూ ఇలాగే చెప్పారని, నిర్ణయాన్ని ఇంకా ఎప్పుడు తీసుకుంటారని ప్రశ్నించింది. కోర్టు ఉత్తర్వులను తేలిగ్గా తీసుకుంటున్నారని, దీనిపై కోర్టు ధిక్కరణ కింద నోటీసులు ఎందుకు జారీచేయరాదో చెప్పాలని నిలదీసింది. ఆస్పత్రి వద్ద ఖాళీ స్థలం ఎంత ఉంది అని, ఆ స్థలాన్ని గుర్తిస్తే వారసత్వ కట్టడాన్ని అలా వదిలి కొత్తగా మరో బ్లాక్‌ ఎందుకు నిర్మించకూడదని ధర్మాసనం ప్రశ్నించింది. కొత్త భవనం కోసం ఉన్న భవనాన్ని కూలుస్తున్నారా లేదంటే ఖాళీ స్థలంలో నిర్మిస్తారా? అన్న విషయంపై ఆరు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. ప్రభుత్వ నిర్ణయం తీసుకోలేని పక్షంలో తామే ఆదేశాలు జారీచేస్తామని పేర్కొంది. 

Updated Date - 2021-07-08T08:13:54+05:30 IST