కరోనా మరణ మృదంగం

ABN , First Publish Date - 2021-05-05T05:33:09+05:30 IST

కరోనా వైరస్‌ మరణమృదంగం మోగిస్తోంది... రోజు రోజుకూ మృతుల సంఖ్య పెరుగుతోంది.. సామాన్యులకు పెద్ద దిక్కుగా పేరుపొందిన వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రిలో ప్రతీ రోజూ కరోనా మరణాలు 10 నుంచి 20 వరకు ఉంటున్నాయి. అయితే అధికారులు వీటిని అధికారికంగా ప్రకటించడం లేదు.

కరోనా మరణ మృదంగం
ఎంజీఎంలో కరోనా రోగులతో బారులు తీరిన అంబులెన్స్‌లు

ఎంజీఎంలో రోజుకు 15 నుంచి 20 మంది మృతి?
సకాలంలో వైద్యం అందక ప్రాణాలు కోల్పోతున్న బాధితులు
ఆస్పత్రిలో అడ్మిట్‌ కావడానికి నానా అవస్థలు
సక్రమంగా అందని ఆక్సిజన్‌.. కొనసాగుతున్న ఇంజక్షన్ల కొరత
ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ ఆగని మరణాలు
రికార్డులకెక్కని వాస్తవ సంఖ్యలు
పట్టించుకోని అధికార యంత్రాంగం
భయాందోళనల్లో సామాన్య ప్రజానీకం


హన్మకొండ, మే 4 (ఆంధ్రజ్యోతి): కరోనా వైరస్‌ మరణమృదంగం మోగిస్తోంది... రోజు రోజుకూ మృతుల సంఖ్య పెరుగుతోంది.. సామాన్యులకు పెద్ద దిక్కుగా పేరుపొందిన వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రిలో ప్రతీ రోజూ కరోనా మరణాలు 10 నుంచి 20 వరకు ఉంటున్నాయి. అయితే అధికారులు వీటిని అధికారికంగా ప్రకటించడం లేదు. కరోనాబారిన పడిన పేదలు, మఽధ్య తరగతి వర్గాల వారు ఎంజీఎంకు వస్తుండగా  ఇక్కడ సకాలంలో సమర్ధవంతమైన చికిత్స అందక విలవిలలాడుతున్నారు. ఇదే అవకాశంగా తీసుకొని ప్రైవేటు ఆస్పత్రులు తమ వద్దకు వచ్చిన కరోనా రోగులను  పీల్చి పిప్పిచేస్తున్నాయి. లక్షల రూపాయలు వసూలు చేస్తున్నాయి. ప్రాణాపాయ స్థితికి చేరుకున్న తర్వాత చివరి నిమిషంలో ఎంజీఎంకు పంపిస్తున్నారు.

రోజుకు 250 మంది..
కరోనా బారిన బడిన రోగులు రోజుకు 200 నుంచి 250 మంది ఎంజీఎం ఆస్పత్రికి వస్తున్నారు. ఆస్పత్రిలోని కరోనా వార్డులో ఒకటే కౌంటర్‌ను పెట్టారు. అక్కడ చాంతాడంతా క్యూలో రోగులు  నిలబడలేక పోతున్నారు. ఆస్పత్రిలో ప్రవేశానికి చిట్టీలు రాయించుకునే సరికి పరిస్థితి   విషమిస్తోంది. కొందరు రోగులు కుర్చున్నవారు కూర్చునట్టే ప్రాణాలు వదులుతున్నారు.  

కోవిడ్‌ రోగుల రద్దీ దృష్ట్యా కనీసం అయిదు కౌంటర్లనైనా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నది. ఆస్పత్రిలో రిసెప్షన్‌ కౌంటర్‌గానీ, హెల్ప్‌ డెస్క్‌గానీ లేదు. ఆస్పత్రిలో బెడ్స్‌ ఖాళీ లేవని అనేక మందిని తిప్పిపంపుతున్నారు. ఆస్పత్రికి వస్తున్న రోగుల్లో 100 మంది ఇలా నిరాశగా తిరిగి వెళుతున్నారు. అదృష్టం బాగుండి బెడ్‌ దొరికినా ఆక్సిజన్‌ అందుబాటులో ఉండడం లేదు. ఆక్సిజన్‌ కొరత వల్ల కూడా రోజుకు అయిదారుగురు రోగులు ప్రాణాలు వదులుతున్నారు. ఆక్సిజన్‌ ఉన్నా వాటికి ఆక్సిజన్‌ ఫ్లో మీటర్లు చాలినన్ని ఉండడం లేదు. వీటిని రోగులనే కొనుక్కొని రమ్మని చెబుతున్నారు. ఒక్కొక్కటి రూ. 3500 చొప్పున రోగులు బయట కొనుగోలు చేసి అమర్చుకోవలసి వస్తోంది.

మంత్రి, అర్బన్‌ జిల్లా కలెక్టర్‌ ఎంజీఎం పరిస్థితిని సందర్శించినప్పుడు అన్నీ బాగున్నాయనీ అధికారులు చెబుతున్నారు. ఆక్సిజన్‌ కూడా చాలినంత ఉందనీ, బెడ్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయనీ, కరోనా రోగులకు మెరుగైన వైద్యం అందుతోందని మాయమాటలు చెప్పి మభ్య పెడుతున్నారు. కానీ వాస్తవ పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా ఉన్నది. ఎంజీఎంలో పని చేసే కొందరు వైద్యాధికారుల్లో పలువురికి ప్రైవేటు ఆస్పత్రులు ఉన్నాయి. ఇదే అవకాశంగా తీసుకొని  ఆక్సిజన్‌, రెమిడివిసిర్‌ ఇంజక్షన్లను తమ ఆస్పత్రులకు తరలిస్తున్నారు. తమ ఆస్పత్రిలో చేర్చుకున్న కరోనా రోగుల నుండి రూ. 2లక్షల నుంచి 3 లక్షల వరకు పిండి ఇక బతకడని తేలిన రోగులను ఎంజీఎంకు తరలిస్తున్నారు.

విధిలేక...
ఎంజీఎంకు వెళ్ళాలంటే రోగులు భయపడాల్సిన దుస్థితి ప్రస్తుతం నెలకొని ఉన్నది. డాక్టర్లు, సిబ్బంది కొరత, పరికరాల లేమి ఒక వైపు, వైద్యాధికారుల ధనదాహం, నిర్లక్ష్యం మరోవైపు కరోనా రోగుల ప్రాణాలను తీస్తున్నాయి.  కేఎంసీలో కొత్తగా నిర్మించిన సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రిని జనరల్‌ ఆస్పత్రిగా మార్చి ఎంజీఎంను పూర్తి కరోనా ఆస్పత్రిగా మార్చినట్టు చెబుతున్నా ఆచరణలో అది కనిపించడం లేదు. కేఎంసీ ఆస్పత్రిలో పూర్తి స్థాయిలో వైద్య సేవలు ఇంకా అందుబాటులోకి రాలేదు. . కరోనా ఆస్పత్రి అని చెప్పి  ఎంజీఎంలో కరోనా రోగులతో పాటు ఇతర రోగులకూ వైద్యం అందించడం లేదు. కోవిడ్‌ వార్డులో కనీస సౌకర్యాలు లేవు. ప్రాణాధార మందుల  కొరత తీవ్రంగా ఉంది. ఆక్సిజన్‌ సరఫరా లేదు. రోగులకు సరైన  తిండి, తాగేందుకు నీళ్ళు అందడం లేదు. పాజిటివ్‌ రోగులకు ఇచ్చే డైట్‌లో అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. కరోనా వార్డు అపరిశుభ్ర వాతావరణంతో కంపుకొడుతోంది. పలువురు డాక్టర్లు, వైద్య సిబ్బంది కరోనా బారిన పడుతున్నారు. దీంతో మిగతా డాక్టర్లు, పారామెడికల్‌ సిబ్బంది, ఇతర ఉద్యోగులు భయంతో ఆస్పత్రికి రావడం మానేసారు.

ఇదిలావుండగా, ఎంజీఎంలో మరణాల సంఖ్యను  అధికారులు కొట్టి పారవేస్తున్నారు. రోగుల సంఖ్యను, మరణాలను తక్కువ చూపిస్తున్నారు. ఎంజీఎం సూపరింటెండెంట్‌ ఇచ్చిన అధికారిక సమాచారం ప్రకారం ఎంజీఎం కోవిడ్‌ వార్డులో 800 పడకలు ఉన్నాయి. మొత్తం 534 మంది రోగులు ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. వీరిలో కోవిడ్‌ రోగులు 431 మందికాగా  ఎస్‌ఏఆర్‌ఐ రోగులు 103 మంది. 266 బెడ్స్‌ ఖాళీగా ఉన్నాయి. మంగళవారం 133 మంది కోవిడ్‌ రోగులు ఆస్పత్రిలో చేరారు. చికిత్స అనంతరం కోలుకొని 61 మంది డిస్‌చార్జి అయ్యారు.

శ్మశానాల్లో రద్దీ
కరోనా మొదటి వేవ్‌ ఉదృతంగా ఉన్నప్పుడే వరంగల్‌లో రోజుకు 60 నుంచి 80 కేసులు నమోదు అయ్యేవి. మరణాల సంఖ్య చాలా తక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు రోజుకు 450 నుంచి 500 కేసులు నమోదవుతున్నాయి. రోజుకు 15 నుంచి 20 మంది వరకు చనిపోతున్నారు. ఈ సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉండొచ్చు. ఒక్క ఆస్పత్రిలో ఇన్ని మరణాలు ఉంటే ఆస్పత్రికి రాకుండానే పరిస్థితి విషమించి  మరణిస్తున్నవారు అనేక మంది ఉన్నారు. వీరికి అంత్యక్రియలు చేయడం కష్టమవుతోంది. శ్మశానాల్లో చోటు దొరకని పరిస్థితి. కొన్ని చోట్ల సామూహిక దహనాలు చేస్తున్నారు.

Updated Date - 2021-05-05T05:33:09+05:30 IST