యమా హీట్‌ ‘హుజూర్‌’

ABN , First Publish Date - 2021-10-31T08:24:42+05:30 IST

ఎన్నికల్లో కొన్ని హోరాహోరీగా సాగుతాయి. హాట్‌ టాపిక్‌ అవుతాయి. హుజూరాబాద్‌ ఉప ఎన్నిక మాత్రం అంతకుమించి ప్రత్యేకం. ...

యమా హీట్‌ ‘హుజూర్‌’

సుదీర్ఘ కాలం సాగిన ప్రచార పర్వం 

సర్వశక్తులొడ్డిన అధికార పార్టీ 

ప్రభుత్వ, పార్టీ యంత్రాంగం మోహరింపు

హరీశ్‌ సహా పలువురు నేతలు అక్కడే

దళితబంధు, కొత్త పింఛన్లు, 

కొత్త రేషన్‌ కార్డులు అక్కడే మొదలు

చివరి 4 ఎన్నికల్లో కన్నా ఎక్కువ పోలింగ్‌ 

‘దుబ్బాక, హుజూర్‌నగర్‌’కు మించి నమోదు


హైదరాబాద్‌, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): ఎన్నికల్లో కొన్ని హోరాహోరీగా సాగుతాయి. హాట్‌ టాపిక్‌ అవుతాయి. హుజూరాబాద్‌ ఉప ఎన్నిక మాత్రం అంతకుమించి ప్రత్యేకం. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఓ ఉప ఎన్నికను ఇంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నది ఎప్పుడూ లేదు. టీఆర్‌ఎస్‌ కీలక నేతల్లో ఒకరిగా ఎదిగిన ఈటల, ఆ పార్టీ నుంచి బయటకొచ్చి బీజేపీ అభ్యర్థిగా మళ్లీ బరిలోకి దిగడంతో జాతీయ స్థాయిలోనూ ఈ ఉప ఎన్నిక చర్చనీయాంశమైంది. పైగా  ఎమ్మెల్యే పదవికి ఈటల రాజీనామా వెంటనే.. టీఆర్‌ఎ్‌స-బీజేపీ ప్రజల్లోకి వెళ్లడంతో సుదీర్ఘంగా నాలుగున్నర నెలల పాటు ప్రచారం సాగడమూ ఎన్నికను అటు టీఆర్‌ఎస్‌, ఇటు ఈటల ఏ స్థాయిలో పరిగణించారో అర్థమవుతుంది. కాలికి బలపం కట్టుకున్నట్లుగా ఈటల ఇంటింటికి తిరిగి తన బాధను చెప్పుకొని.. గెలిపించాల్సిందిగా అభ్యర్థించారు. మంత్రి వర్గం నుంచి ఈటలను బర్తరఫ్‌ చేయడం ద్వారా లుకలుకలను బద్ధలు కొట్టిన టీఆర్‌ఎస్‌, ఆయన్ను ఎలాగైనా ఓడించాలనే పట్టుదలతో సర్వశక్తులు ఒడ్డింది. హరీశ్‌తో పాటు మరో ఇద్దరు మంత్రులు గంగుల కమలాకర్‌, కొప్పుల ఈశ్వర్‌.. పార్టీకి చెందిన మిగతా నేతలు సభలు, ర్యాలీలతో హోరెత్తించారు. సీఎం కేసీఆర్‌ ఈ ఎన్నికను ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. నాయకులకు ఎప్పటికప్పుడూ దిశగా నిర్దేశం చేశారు.


కొన్ని కీలక ప్రథకాలను ప్రకటించి వ్యూహాత్మకంగా హుజూరాబాద్‌ నుంచే ప్రారంభించారు. రాష్ట్రంలో దళిత కుటుంబాలకు రూ.10లక్షల చొప్పున ఇస్తామంటూ సర్కారు ప్రకటించిన దళితబంధు పథకాన్ని హుజూరాబాద్‌లోనే ప్రారంభించారు. వృద్ధాప్య పింఛన్ల అర్హత వయసును 65 ఏళ్ల నుంచి 57 ఏళ్లకు ప్రభుత్వం తగ్గించింది.  అర్హులైనవారి నుంచి దరఖాస్తులను ఆహ్వానించే కార్యక్రమాన్ని కూడా హుజురాబాద్‌లోనే శ్రీకారం చుట్టారు. రేషన్‌ కార్డులు లేని వారికి కొత్త కార్డులిచ్చే కార్యక్రమాన్ని కూడా అక్కడే మొదలు పెట్టారు. ఈ  ఉప ఎన్నికను టీఆర్‌ఎస్‌ ఎన్నడూ లేనంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో అక్కడ ఆ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ అయినా పరిస్థితి కేసీఆర్‌ వర్సెస్‌ ఈటలగా మారింది. ఉపఎన్నికపై ప్రజల్లో ఆసక్తి భారీ పోలింగ్‌ రూపంలో వ్యక్తమైంది. ఈసారి చివరి నాలుగు ఎన్నికల పోలింగ్‌కు మించి అత్యధిక శాతం పోలింగ్‌ శాతం నమోదైంది. 2009లో 71.75 శాతం, 2014లో 77.54 శాతం, 2018లో 84.40 పోలింగ్‌ శాతం నమోదైతే ఈసారి ఏకంగా 86.33 శాతం నమోదవ్వడం విశేషం. ఇది దుబ్బాక (82.61శాతం), హుజూర్‌నగర్‌ (84.75శాతం) ఉపఎన్నికలకు మించి కావడం.. నాగార్జున సాగర్‌ ఉప ఎన్నిక  (88శాతం) దరిదాపుల్లో నిలవడం విశేషం.

Updated Date - 2021-10-31T08:24:42+05:30 IST