కొనుగోలు కేంద్రం వద్ద రైతుకు గుండెపోటు

ABN , First Publish Date - 2021-12-03T08:27:37+05:30 IST

ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద గుండెపోటుతో కుప్పకూలాడు ఓ రైతు. ఆయనను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం బద్దిపడగలో

కొనుగోలు కేంద్రం వద్ద రైతుకు గుండెపోటు

ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి


నంగునూరు: ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద గుండెపోటుతో కుప్పకూలాడు ఓ రైతు. ఆయనను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం బద్దిపడగలో గురువారం ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామస్థులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. బద్దిపడగ గ్రామానికి చెందిన వడ్లూరి రాములు(42) అదే గ్రామంలో మరో వ్యక్తికి చెందిన ఎకరం పొలాన్ని కౌలుకు తీసుకుని వరి సాగు చేశాడు. గ్రామంలో పాలమాకుల సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రానికి 10 రోజుల క్రితం ధాన్యాన్ని తీసుకువచ్చాడు. ధాన్యంలో తేమ శాతం రావడం కోసం రోజూ ఆరబెడుతూ అక్కడే ఉండిపోయాడు. గురువారం సాయంత్రం అతడి సీరియల్‌ నంబర్‌ రావడంతో కొనుగోలు కేంద్రం నిర్వాహకులు అతనికి బార్దాన్‌ సంచులు ఇచ్చి ధాన్యం నింపాలని చెప్పారు. ఆరబోసిన ధాన్యాన్ని దగ్గరికి చేసి నింపుతున్న క్రమంలో రాములుకు చాతీలో నొప్పి వచ్చింది. కొద్దిసేపటికి తేరుకుని మళ్లీ పనుల్లో నిమగ్నం కాగా గుండెపోటు వచ్చింది. వెంటనే 108 అంబులెన్స్‌లో రాములును చికిత్సకోసం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. రాములుకు భార్య లతతో పాటు నలుగురు కుమార్తెలు ఉన్నారు.

Updated Date - 2021-12-03T08:27:37+05:30 IST