ఆత్మహత్యాయత్నాన్ని అడ్డుకోబోతే ప్రాణం తీశాడు!

ABN , First Publish Date - 2021-12-09T07:42:27+05:30 IST

పక్కంట్లో వ్యక్తి ఆత్మహత్యాయత్నాన్ని అడ్డుకోబోతే ఆమె ప్రాణామే

ఆత్మహత్యాయత్నాన్ని అడ్డుకోబోతే ప్రాణం తీశాడు!

  •  మద్యం మత్తులో కత్తితో వ్యక్తి పొడుచుకునే యత్నం
  •  అడ్డుకున్న మహిళ.. అదే కత్తితో ఆమె ఛాతీలో పొడిచి హత్య
  •  నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లిలో దారుణం


కొండమల్లేపల్లి, డిసెంబరు 8: పక్కంట్లో వ్యక్తి ఆత్మహత్యాయత్నాన్ని అడ్డుకోబోతే ఆమె ప్రాణామే పోయింది. ‘ఎందుకు చస్తావురా నాయనా’ అంటూ మద్యం మత్తులో కత్తితో మెడకోసుకోబోయిన వ్యక్తిని అడ్డుకోవడమే ఆ మహిళ చేసిన పాపమైంది. ఉన్మాదిగా మారిన అతడు అదే కత్తితో ఆమెను ఛాతీలో పొడిచి చంపేశాడు! నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి మండలంలోని చింతచెట్టు తండా గ్రామపంచాయతీ పరిధిలోని జేత్యతండాలో బుధవారం ఈ ఘటన జరిగింది.


ఎస్సై భాస్కర్‌రెడ్డి, స్థానికుల వివరాల ప్రకారం.. తండాకు చెందిన ఇస్లావత్‌ బంగారి (60)కి భర్త చాందియా, కుమారుడు, కుమార్తె ఉన్నారు. పిల్లల పెళ్లిళ్లు కాగా, బతుకుదెరువు కోసం కుమారుడు, కోడలు హైదరాబాద్‌కు వలసవెళ్లారు. వృద్ధురాలు బంగారి పక్కింట్లో ముడావత్‌ రవి ఉంటున్నాడు. అతడికి భార్య విజయ, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. విజయను గతంలో రాయితో తలపై కొట్టడంతో పిల్లలను తీసుకొని ఆమె తన తల్లిగారింటికి వెళ్లిపోయింది. అప్పటి నుంచి రవి మద్యం తాగుతూ జులాయిగా తిరుగుతున్నాడు. గత 15 రోజులుగానైతే మద్యం మత్తులో ఉన్మాదిలా ప్రవర్తిస్తున్నాడు. బుధవారం ఉదయం 10 గంటల సమయంలో రవి కత్తితో తన ఇంటి ఎదుట ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించాడు. గమనించిన  బంగారి, వారిస్తూ అతడి చేతిలోంచి కత్తిని తీసుకోబోయింది.  తీవ్ర ఆగ్రహానికి గురైన రవి ఆ కత్తితోనే బంగారి ఛాతీపై పొడిచాడు. తీవ్ర గాయం కావడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. అనంతరం రవి అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించగా గ్రామస్థులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు.


బంగారి కుటుంబానికి న్యాయం చేయాలని రవి ఇంటి ఎదుట మృతదేహాన్ని ఉంచి కుటుంబ సభ్యులు ఆందోళన చేస్తున్నారు. తండాలో అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు.  భర్త చాందియా ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ భాస్కర్‌రెడ్డి తెలిపారు. 


Updated Date - 2021-12-09T07:42:27+05:30 IST