దళిత యువతిని పెళ్లాడినందుకు.. ఉద్యోగం నుంచి తొలగింపు

ABN , First Publish Date - 2021-11-23T17:45:28+05:30 IST

దళిత యువతిని పెళ్లి చేసుకున్నాడనే కారణంతో.. దేవాలయంలో 14 ఏళ్లుగా పనిచేస్తున్న వ్యక్తిని ఉద్యోగంలోంచి తొలగించిన ఉదంతమిది. ఈ సంఘటన వనస్థలిపురం....

దళిత యువతిని పెళ్లాడినందుకు.. ఉద్యోగం నుంచి తొలగింపు

హైదరాబాద్‌ సిటీ(ఆంధ్రజ్యోతి): దళిత యువతిని పెళ్లి చేసుకున్నాడనే కారణంతో.. దేవాలయంలో 14 ఏళ్లుగా పనిచేస్తున్న వ్యక్తిని ఉద్యోగంలోంచి తొలగించిన ఉదంతమిది. ఈ సంఘటన వనస్థలిపురం పోలీ స్‌స్టేషన్‌ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితుల కథనం ప్రకారం.. నక్కా యాదగిరి గౌడ్‌ అనే వ్యక్తి 14 సంవత్సరాలుగా వనస్థలిపురంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలోని ప్రసాదం కౌంటర్‌లో పనిచేస్తున్నారు. ఆయన ఆలయంలోని ఓ గదిలో ఉంటున్నారు. రెండు నెలల క్రితం ఆయన ప్రేమలత అనే దళిత యువతిని ప్రేమించి, పెళ్లి చేసుకున్నారు.


విషయం తెలుసుకున్న ఆలయ కమిటీ చైర్మన్‌ లక్ష్మయ్య, నిర్వాహకులు యాదగిరిని ఉద్యోగంలోంచి తీసేశారు. తన భర్తను విధుల్లోంచి తొలగించవద్దంటూ ప్రేమలత శనివారం లక్ష్మయ్య ఇంటికి వెళ్లి కోరగా.. కులం పేరుతో దూషించాడని బాధితురాలు పేర్కొన్నారు. ఆలయ కమిటీ సభ్యులు సత్యనారాయణ, చిరంజీవి, మేనేజర్‌ శ్రీహరి తమ అనుచరులతో కలిసి ఆలయంలో యాదగిరి ఉంటున్న ఇంటి తాళాలు బద్ధలు కొట్టి, సామాన్లు బయట పడేశారని వివరించారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదుకు నిరాకరించారని, విషయం బయటకు పొక్కడంతో నిందితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు పెట్టారని బాధితులు తెలిపారు.

Updated Date - 2021-11-23T17:45:28+05:30 IST