రేపే జీడబ్ల్యూఎంసీ మేయర్‌ ఎన్నిక

ABN , First Publish Date - 2021-05-06T05:04:36+05:30 IST

రేపే జీడబ్ల్యూఎంసీ మేయర్‌ ఎన్నిక

రేపే జీడబ్ల్యూఎంసీ మేయర్‌ ఎన్నిక
ఏర్పాట్లపై అధికారులతో చర్చిస్తున్న కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హన్మంతు

నోటిఫికేషన్‌ జారీ చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం 

పరిశీలకులుగా మంత్రులు గంగుల కమలాకర్‌, ఇంద్రకరణ్‌రెడ్డి

గుండు సుధారాణి పేరును ఖరారు చేసిన అధిష్ఠానం?

జీడబ్ల్యూఎంసీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాట్లు

డిప్యూటీ మేయర్‌ రేసులో  పలువురు ఆశావహులు


 వరంగల్‌ సిటీ, మే 5 : గ్రేటర్‌ వరంగల్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నికకు ముహుర్తం ఖరారైంది. ఈ నెల 7వ తేదీన ఎన్నిక జరగనుంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ బుధవారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. శుక్రవారం ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులు కార్పొరేటర్లుగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం మేయర్‌, డిప్యూటీ మేయర్‌ల ఎన్నిక ప్రక్రియ ప్రారంభం అవుతుంది.  ఈ ఎన్నికలో కార్పొరేటర్లతోపాటు ఎక్స్‌ఆఫీషియో సభ్యులు కూడా పాల్గొంటారు. అనంతరం మేయర్‌, డిప్యూటీ మేయర్‌లుగా ఎవరు ఎన్నికయ్యారో అధికారులు అధికారికంగా ప్రకటిస్తారు.  జీడబ్ల్యూఎంసీ ప్రధాన కార్యాలయం వెనకాల గల ఇండోర్‌ స్టేడియం ప్రాంగణంలో సాయంత్రం 3.30 గంటలకు ప్రమాణా స్వీకారవేడుక జరుగనుంది. ఈ పరిణామాల తదుపరి 66 మందితో కొత్త పాలకవర్గం కొలువుదీరుతుంది. 


ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్‌ 

కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారోత్సవం, మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నికకు సంబంధించి ఏర్పాట్లపై అధికారగణం దృష్టి సారించింది. గురువారం ఒక్క రోజే సమయం ఉండడంతో ఈ మేరకు అధికారిక చర్యలను వేగవంతం చేసింది. కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హన్మంతు బుధవారం సాయంత్రం ఇండోర్‌ స్టేడియం ప్రాంగణాన్ని పరిశీలించారు. ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన కొవిడ్‌-19 మార్గదర్శకాల మేరకు ఏర్పాట్లు జరగాలని ఆదేశించారు. ఎక్స్‌ ఆఫీషియో సభ్యులు, గెలిచిన 66 మంది అభ్యర్థులు మాత్రమే కార్యక్రమంలో పాల్గొంటారని స్పష్టం చేశారు. ఇతరులను అనుమతించవద్దని ఆదేశించారు. ఈ మేరకు ప్రవేశాలు, బారికేడ్లు, ప్రత్యేక జోన్లను ఏర్పాటు చేయాలన్నారు. సామాజిక దూరం పాటించేలా సిట్టింగ్‌ ఏర్పాట్లు ఉండాలన్నారు. ఫేస్‌ షీల్డ్‌, గ్లౌజ్‌లు, మాస్క్‌లు, శానిటైజర్‌లు అందచేయాలని ఆదేశించారు. 


మేయర్‌ ఎన్నికపై ఉత్కంఠ 

మేయర్‌ ఎన్నికపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మెజారిటీ సీట్లను టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకోవడంతో 29వ డివిజన్‌ నుంచి గెలిచిన గుండు సుధారాణి పేరే  ఫైనల్‌ అనే బలమైన వాదనలు ఉన్నాయి. అధిష్ఠానం నుంచి పక్కా హామీ తీసుకునే ఎన్నికల బరిలో సుధారాణి నిలిచారనే అభిప్రాయాలు తొలి నుంచీ వ్యక్తమవుతున్నాయి. సుధారాణి మేయర్‌గా ఎన్నికైతే పశ్చిమ నియోజకవర్గ పరిధిలో ఈ పదవి దక్కినట్లు అవుతుంది. సుధారాణి పోటీ చేసిన 29వ డివిజన్‌ పశ్చిమ పరిధిలోనే ఉంది. గతంలో పని చేసిన నన్నపునేని నరేందర్‌, గుండా ప్రకాశ్‌రావు ఇరువురు తూర్పు నియోజకవర్గంలోని వారే. ఈ సారి మాత్రం పశ్చిమకు మేయర్‌ పదవి దక్కబోతుంది. 


డిప్యూటీ మేయర్‌ రేసులో..

డిప్యూటీ మేయర్‌ ఎవరనేది కూడా ఆసక్తిగా మారింది. మేయర్‌ పదవి పశ్చిమ నియోజకవర్గం నుంచి అయితే,  డిప్యూటీ మేయర్‌ పదవి వరంగల్‌ తూర్పు, వర్థన్నపేట నియోజకవర్గాల నుంచి ఉంటుందా అనే ప్రశ్నలు నెలకొన్నాయి. గతంలో వరంగల్‌ పశ్చిమకు చెందిన  ఖాజా సిరాజొద్దిన్‌ డిప్యూటీ మేయర్‌గా పనిచేశారు. ఈసారి వర్ధన్నపేట పరిధిలో డిప్యూటీ మేయర్‌ ఉండాలనే వాదనలు కూడా నెలకొన్నాయి. డిప్యూటీ మేయర్‌ రేసులో ఇండ్ల నాగేశ్వర్‌రావు, బోయినపల్లి రంజిత్‌రావు, దిడ్డి కుమారస్వామి, సురే్‌షజోషి, ఆవాల రాధికరెడ్డి, రిజ్వానా షమీమ్‌ తదితరులు ఉన్నట్టు తెలుస్తోంది. సీల్డ్‌ కవర్‌లో మేయర్‌, డిప్యూటీ మేయర్ల పేర్లు నగరానికి చేరనున్నాయి.


పరిశీలకులుగా మంత్రులు

మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నిక పరిశీలకులుగా అధిష్ఠానం మంత్రులు గంగుల కమలాకర్‌, ఇంద్రకరణ్‌రెడ్డిలను నియమించింది. గురువారం వీరు వరంగల్‌ నగరానికి చేరుకుంటారు. జిల్లా మంత్రి దయాకర్‌రావు, ఎమ్మెల్యేలు, ఎన్నికైన పార్టీ అభ్యర్థులతో మంత్రులు సమావేశమై ఎన్నిక, ప్రమాణ స్వీకారోత్సవం అంశాలను చర్చిస్తారు. అఽధిష్ఠాన నిర్ణయమే శిరోధార్యంగా భావించి మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నికపై ఏకాభిప్రాయం వ్యక్తం చేయాలని కార్యోపదేశం చేస్తారు.  



ఎన్నిక విధానం ఇలా...

మేయర్‌, డిప్యూటీ మేయర్‌ అభ్యర్థిని ఆయా పార్టీలు ప్రకటిస్తాయి. ఈ మేరకు మేయర్‌, డిప్యూటీ మేయర్‌ పేరు ఓటు హక్కు కలిగిన ఉన్న ఒక సభ్యుడు ప్రతిపాదిస్తారు.. మరొకరు బలపరుస్తారు. ఎన్నిక ప్రిసైడింగ్‌ ఆఫీసర్‌ అదనపు కలెక్టర్‌ సంధ్య ప్రతిపాదిత పేర్లను ప్రకటిస్తారు. పరోక్ష విధానంలో ఎన్నిక విధానం ఉంటుంది. ఈ మేరకు కార్పొరేటర్లు తమ చేయి ఎత్తి అంగీకారాన్ని తెలుపుతారు. ఒకే అభ్యర్థి పోటీలో ఉన్న క్రమంలో ఏకగ్రీకంగా ఎన్నికైనట్లు ప్రకటిస్తారు. గుర్తింపు పొంది రాజకీయ పార్టీలు పార్టీ తరపున విప్‌ను నియమించి ప్రిసైడింగ్‌ అఽధికారికి ఎన్నిక ముందు రోజు తెలియపరచాలి. 

కొవిడ్‌ వచ్చి క్వారెంటైన్‌లో ఉన్న  అభ్యర్థులు ఎన్నిక వేదికకు వద్దకు రావాల్సిన అవసరం లేదు. వీడియోకాల్‌ ద్వారానే సభ్యుడిగా ప్రమాణస్వీకారం చేయవచ్చు. ఈ మేరకు ప్రిసైడింగ్‌ అధికారి ఫోన్‌లో రికార్డింగ్‌ చేస్తారు. కొవిడ్‌ నెగెటివ్‌ ఉన్న వారు మాత్రమే ప్రమాణ స్వీకారం, ఎన్నిక కార్యక్రమంలో పాల్గొనాలి. గెలిచిన అభ్యర్థుల ప్రమాణ స్వీకారం చేసిన తదుపరి కార్పొరేటర్లుగా పరిగణిస్తారు. కార్పొరేటర్లు వారిగా విభజన వరసలో అసీనులవుతారు. ప్రమాణ స్వీకారం అనంతరం ర్యాలీలు, సంబురాలు, ఊరేగింపులు నిషేధం. సన్మానాలు, పూలదండలు, పుష్పగుచ్ఛాల ఇవ్వడం పూర్తిగా నిషేధం. ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటారు.

Updated Date - 2021-05-06T05:04:36+05:30 IST