కేసీఆర్, కేటీఆర్ నిర్ణయమే అంతిమం
ABN , First Publish Date - 2021-05-06T05:02:27+05:30 IST
గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్..

మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
నూతనంగా ఎన్నికైన కార్పొరేటర్లతో భేటీ
హన్మకొండ టౌన్: గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ నిర్ణయమే అంతిమమని, వారి నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు స్పష్టం చేశారు. జీడబ్ల్యూఎంసీ ఎన్నికల్లో గెలుపొందిన టీఆర్‌ఎస్ కార్పొరేటర్లతో బుధవారం హన్మకొండలోని హరిత హోటల్‌లో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. రెండు రోజుల్లో జరిగే మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక కోసం పార్టీ పరిశీలకులుగా మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, గంగుల కమలాకర్ గురువారం నగరానికి వస్తారని పేర్కొన్నారు. శుక్రవారం జరిగే సమావేశంలో మేయర్, డిప్యూటీ మేయర్ ఎంపికపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు. పార్టీ లేకుంటే ఎవరూ లేరని, పార్టీ నిర్ణయాలకు అందరూ కట్టుబడి ఉండాలని ఆయన సూచించారు. వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుని ప్రజలకు సేవ చేయాలని కార్పొరేటర్‌లకు పిలుపునిచ్చారు.
సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ వరంగల్ నగరాభివృద్ధికి అధిక ప్రాధాన్యమిస్తున్నారని తెలిపారు. ఇప్పటికే వివిధ శాఖల ద్వారా రూ.4126కోట్ల నిధులతో అభివృద్ధి పనులు చేసినట్లు పేర్కొన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధికి అందరూ సహకరించాలని కోరారు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరవేసే వారథులుగా నిలవాలని కార్పొరేటర్లకు మంత్రి ఎర్రబెల్లి పిలుపునిచ్చారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీల నెరవేర్చేందుకు కార్పొరేటర్లు కృషి చేయాలన్నారు. కార్పొరేటర్ టికెట్ దక్కని పార్టీ సభ్యులను కలుపుకుపోవాలని మంత్రి పిలుపునిచ్చారు. ప్రభుత్వ చీఫ్‌విప్ దాస్యం వినయ్‌భాస్కర్ మాట్లాడుతూ.. కేసీఆర్, కేటీఆర్‌పై నమ్మకంతో గ్రేటర్ వరంగల్ ఎన్నికల్లో టీఆర్‌ఎ్‌సకు ప్రజలు భారీ విజయాన్ని అందించారని అన్నారు. నూతనంగా ఎన్నికైన కార్పొరేటర్లు ప్రజలతో మమేకమై వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. అవకాశాలు దక్కని వారిని, అపజయం చెందిన వారిని పార్టీ కాపాడుకుంటుందని భరోసా ఇచ్చారు.
కడియం క్లాస్
నూతనంగా ఎన్నికైన కార్పొరేటర్లకు మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి క్లాస్ ఇచ్చారు. వచ్చిన సదవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సాధ్యమైన మేరకు ప్రజలకు సేవ చేయాలన్నారు. భూ కబ్జాలకు పాల్పడొద్దని, గొడవల్లో తలదూర్చవద్దని సూచించారు. రౌడీయిజానికి దూరంగా ఉండాలని, డబ్బు సంపాదన కోసం చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడొద్దని హితబోధ చేశారు. పదవి ఉందని ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తే రాజకీయ భవిష్యత్ ఉండదని హెచ్చరించారు. కార్పొరేటర్ పదవి మొదటి మెట్టు అని ఈ అవకాశాన్ని వినియోగించుకుని ప్రజలకు సేవ చేసి మరిన్ని రాజకీయ అవకాశాలు అందిపుచ్చుకోవాలని శ్రీహరి పిలుపునిచ్చారు. కాగా, మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక నిర్ణయాధికారం ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు ఇస్తూ సమావేశంలో తీర్మానం చేశారు. ఈ సమావేశంలో ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్యేలు అరూరి రమేశ్, డాక్టర్ రాజయ్య, చల్లా ధర్మారెడ్డి, ‘కుడా’ చైర్మన్ మర్రి యాదవరెడ్డి, రైతు రుణ విముక్తి కమిషన్ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు, నేతలు జన్ను జఖార్య, సుందర్‌రాజ్, జనార్దన్‌గౌడ్ పాల్గొన్నారు.