‘గుమిగూడితే’ గండమే!

ABN , First Publish Date - 2021-11-28T09:11:45+05:30 IST

ఆంక్షలు పూర్తిగా తొలగిపోవడం.. వివాహాలు, వేడుకలు, ఇతర కార్యక్రమాలు జోరందుకోవడంతో మళ్లీ జనం ఒకచోట చేరడం ప్రారంభమైంది. అయితే, ఇదే సమయంలో కరోనా పూర్తిగా పోయిందన్న భ్రమనో..

‘గుమిగూడితే’ గండమే!

  • వేడుకలు, ఇతర కార్యక్రమాల్లో భారీగా జనం
  • మాస్క్‌ ధారణ సహా కొవిడ్‌ జాగ్రత్తలు గాలికి
  • సెకండ్‌ వేవ్‌ అనుభవాన్ని విస్మరించి ప్రవర్తన
  • టీకా పూర్తిగా పొందినవారూ కరోనా బారిన
  • కర్ణాటకలో ఇద్దరు దక్షిణాఫ్రికన్లకు పాజిటివ్‌
  • ఒమైక్రాన్‌ వేరియంట్‌ నేపథ్యంలో ఆందోళన..
  • రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్‌.. నేడు హరీశ్‌ సమీక్ష
  • శంషాబాద్‌ విమానాశ్రయ వర్గాలకు ఆదేశాలు


ఒడిసాలోని విమ్సార్‌ వైద్య కళాశాల వార్షికోత్సవంలో విద్యార్థులంతా మాస్క్‌లు ధరించకుండా పాల్గొన్నారు. ఫలితం.. మూడు రోజుల్లో 54 మందికి కరోనా నిర్ధారణ అయింది. కర్ణాటక ధార్వాడలోని వైద్య కళాశాలలో అయితే ఏకంగా 280 మందికి పాజిటివ్‌ వచ్చింది. ఇండోర్‌లోని ఐఐఎంలో ప్రత్యేక కోర్సు చదివేందుకు వచ్చిన సైనిక అధికారులు 14 మందికి వైరస్‌ సోకింది. 


తెలంగాణలో ఇటీవల ఓ వివాహ వేడుకలో పెద్ద సంఖ్యలో ప్రజా ప్రతినిధులు, ఇతర అధికారులు హాజరయ్యారు. రెండ్రోజుల తర్వాత వివాహంలో పాల్గొన్న వ్యక్తికి పాజిటివ్‌ వచ్చింది. ఈయనా టీకా పూర్తిగా పొందినవారే. హైదరాబాద్‌ శివారులోని టెక్‌ మహీంద్రా వర్సిటీలో పాజిటివ్‌ నిర్ధారణ అయిన 25 మంది విద్యార్థులు కూడా వ్యాక్సిన్‌ రెండు డోసులు వేయించుకున్నవారే. 


రాష్ట్రంలోని విద్యా సంస్థలు, పాఠశాలల్లో వరుసగా పదుల సంఖ్యలో కరోనా కేసులు వస్తున్నాయి. అయితే, బాధితులు ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి గుట్టుగా వైద్యం పొంది వస్తున్నారు.


ఇవీ.. దేశంలో, రాష్ట్రంలో బయటపడిన ఉదంతాలుహైదరాబాద్‌, సెంట్రల్‌ డెస్క్‌, నవంబరు 27(ఆంధ్రజ్యోతి): ఆంక్షలు పూర్తిగా తొలగిపోవడం.. వివాహాలు, వేడుకలు, ఇతర కార్యక్రమాలు జోరందుకోవడంతో మళ్లీ జనం ఒకచోట చేరడం ప్రారంభమైంది. అయితే, ఇదే సమయంలో కరోనా పూర్తిగా పోయిందన్న భ్రమనో.. టీకా రెండు డోసులు తీసుకున్నామన్న ధీమానో ఏమో కాని.. గుమిగూడుతూ, బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు లేకుండా తిరుగుతూ.. శానిటైజర్లు కూడా వాడకుండా.. జాగ్రత్తలను పూర్తిగా విస్మరిస్తున్నారు. మహమ్మారి ఎక్కడికీ పోలేదని.. అప్రమత్తంగా ఉండాలన్న సంగతిని పట్టించుకోవడం లేదు. దీంతో చాపకింద నీరులా వైరస్‌ విస్తరిస్తోంది. కరోనాతో రెండుసార్లు తీవ్రంగా దెబ్బతిన్న పరిస్థితుల్లో.. థర్డ్‌ వేవ్‌ వస్తే పరిణామాలు ఏస్థాయిలో ఉంటాయో ఊహించకుండా ప్రవర్తిస్తున్న తీరు ఆందోళన రేకెత్తిస్తోంది.


టీకా తీసుకున్నవారూ..

తాజా ఉదంతాలను చూస్తుంటే టీకా పొందినవారూ వైరస్‌ బారినపడినట్లు స్పష్టమవుతోంది. కాబట్టి.. టీకా తీసుకున్నామన్న అతి ధీమా ఎంతమాత్రం తగదని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టం చేస్తోంది. ‘‘వ్యాక్సిన్‌ పొందినా సరే.. మీరు వైరస్‌ బారినపడకుండా, మీద్వారా ఇతరులకు సోకి వారి ప్రాణాలకు ముప్పు వాటిల్లకుండా ఉండాలంటే జాగ్రత్తలు తీసుకోండి. మాస్క్‌ ధరించండి. గుంపులకు దూరంగా ఉండండి. అవసరం లేకుంటే.. ఇతరులను కలవడాన్ని మానేయండి’’ అని సూచిస్తోంది. వ్యాక్సిన్‌ ప్రాణాలు రక్షిస్తుందని.. వ్యాధి తీవ్రతను తగ్గించి ఆస్పత్రి పాలుకాకుండా చూస్తుందని, అంతేకాని వైరస్‌ వ్యాప్తిని అరికట్టదని పేర్కొంటోంది. మరోవైపు తాజా వేరియంట్‌ నేపథ్యంలో భౌతిక దూరం పాటించడం చాలా కీలకమని నిపుణులు సూచిస్తున్నారు. ఇప్పటివరకు వచ్చిన కేసులన్నీ కూడా విందు వినోదాల్లో పాల్గొనడం, విద్యా, ఐటీ సంస్థల్లో జరిగిన సభలు, సమావేశాల కారణంగా నే నమోదు కావడాన్ని గుర్తు చేస్తున్నారు. మరోవైపు వ్యక్తుల్లో దీర్ఘకాల వ్యాధులను బట్టి కరోనా తీవ్రత అన్నది మరువొద్దు. ఆరోగ్యవంతులు తక్కువ ఇబ్బందితో బయటపడే అవకాశం ఉంటుంది. ఇదే సమయంలో వారి ద్వారా.. దీర్ఘకాల వ్యాధులున్న ఇంట్లోని పెద్దలకో, వృద్ధులకో సోకితే ప్రమాదం ఉంటుందన్న విషయం గుర్తుంచుకోవాలి.


ఒమైక్రాన్‌ రూపంలో.. 

‘‘డెల్టాను మించిన వేరియంట్‌ వస్తేనే దేశంలో థర్డ్‌ వేవ్‌ ఉంటుంది’’ అని నిన్నటివరకు శాస్త్రవేత్తలు  చెప్పారు. ఒమైక్రాన్‌ రూపంలో అలాంటిది వచ్చిందనే ఆందోళన కనిపిస్తోంది. ఈ నెల 11న ఒమైక్రాన్‌ను గుర్తించారు. 15 రోజుల వ్యవధిలోనే.. చాలా ప్రమాదకారి రకంగా డబ్ల్యూహెచ్‌వో ప్రకటించింది. కొవిడ్‌ వేరియంట్‌లలో దేన్నీ ఇంత తక్కువ కాలంలో అలా పేర్కొనలేదు. కేవలం వారం వ్యవధిలో ఒమైక్రాన్‌ వ్యాప్తి 1 నుంచి 30 శాతానికి పెరిగింది.  కాబట్టే.. ప్రపంచ దేశాలు గడగడలాడుతున్నాయి. మన దేశంలో  సెకండ్‌ వేవ్‌లో డెల్టా కారణంగానే 2.5 కోట్ల కేసులు నమోదై, 2 లక్షలపైగా మరణాలు సంభవించాయి. ఒమైక్రాన్‌ వ్యాపిస్తే ముప్పు మరింత ఎక్కువని ఆందోళన వ్యక్తమవుతోంది. డబ్ల్యూహెచ్‌వో అత్యవసర సమావేశం, విమాన సర్వీసులపై దేశాలు ఆంక్షలు విధిస్తుండడం బట్టి పరిస్థితి తీవ్రంగా ఉందని తెలిసిపోతోంది. మరోవైపు గత పరిస్థితులను బేరీజు వేసి ఒమైక్రాన్‌ ప్రభావం మనపైనా ఉంటుందని.. ఫిబ్రవరి, మార్చి నాటికి థర్డ్‌ వేవ్‌ వచ్చే అవకాశం ఉందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అంచనా వేస్తోంది.  


రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం.. 

ఒమైక్రాన్‌ కలకలం నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇతర రాష్ట్రాల అధికారులతో మాట్లాడాలని ఆరోగ్య మంత్రి హరీశ్‌రావు శనివారం వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు సూచించారు. ఒమైక్రాన్‌ ప్రభావం ఉన్న దేశాల నుంచి వచ్చే ప్రయాణికుల విషయంలో తీసుకుంటున్న చర్యల గురించి ఇతర రాష్ట్రాల అధికారులు, కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ నుంచి వివరాలు తెలుసుకోవాలని ఆదేశించారు. ఇక గురువారం సాయంత్రం నుంచే శంషాబాద్‌ విమానాశ్రయంలో వైద్య సిబ్బందిని అప్రమత్తం చేశారు. కొత్త వేరియంట్‌ వ్యాప్తి ఉన్న దేశాల నుంచి వచ్చేవారిని గుర్తించాలని, నమూనాలను సేకరించాలని వైద్య శాఖ స్పష్టం చేసింది. కాగా, ఆదివారం ఉన్నతాధికారులతో మంత్రి హరీశ్‌ సమీక్ష నిర్వహించనున్నారు. ఒమైక్రాన్‌ తో పాటు, డిసెంబరు చివరికి  రెండు డోసుల టీకా పంపిణీ పూర్తి లక్ష్యంగా ఈ సమీక్ష జరుగనున్నట్లు తెలిసింది. అలాగే, ఒమైక్రాన్‌ వ్యాప్తి ఉన్న దేశాల నుంచి వచ్చే ప్రయాణికులను ఎలా గుర్తించాలన్నదానిపైనా ప్రభుత్వం దృష్టిపెట్టింది.


తెలంగాణలో ఆంక్షల అమలేది?

తెలంగాణలో టీకా తీసుకోనివారి పట్ల ప్రభుత్వం అలసత్వంగా ఉంటోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సెకండ్‌ డోసు విషయంలో మన దగ్గర తీవ్ర నిర్లక్ష్యం కనిపిస్తోంది. ఇప్పటివరకు 2.46 కోట్ల మంది తొలి డోసు పొందితే.. 1.23 కోట్ల మందే రెండో డోసు వేయించుకున్నారు. ఇతర రాష్ట్రాల్లో టీకా పొందనివారిపట్ల ప్రభుత్వాలు కఠినంగా ఉంటున్నాయి. మహారాష్ట్ర, కేరళ, తమిళనాడుల్లో బహిరంగ ప్రదేశాల్లో తిరిగేందుకు కొవిడ్‌ టీకా ధ్రువపత్రం ఉండాలి. సమూహాలుగా చేరడంపై తమిళనాడులో ఆంక్షలున్నాయి. కేరళలో కొవిడ్‌ నెగెటివ్‌ ధ్రువపత్రం ఉండా లి. దక్షిణ కర్ణాటకలో మాల్స్‌, సినిమా హాళ్లలో ప్రవేశానికి టీకా సర్టిఫికెట్‌ కచ్చితం. కాగా, తెలంగాణలో ఇవేవీ లేవు. మిగతా రాష్ట్రాలను చూసై నా తప్పనిసరి చేయాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.


జన్యు విశ్లేషణకు ఎక్కువ నమూనాలు పంపాలి

అంతర్జాతీయ ప్రయాణికుల నుంచి సేకరించిన వాటిలో వీలైనన్ని ఎక్కువ నమూనాలను జన్యు విశ్లేషణకు పంపితే.. తీవ్రతను అంచనా వేయొచ్చు. రాష్ట్రంలో వీలైనంత త్వరగా అందరికీ రెండో డోసు ఇవ్వాలి. వ్యాక్సిన్లు ప్రాణాపాయాన్ని నివారిస్తాయి. వైరస్‌ వ్యాప్తిని ఆపలేవు. కొత్త వేరియంట్‌ నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. నిబంధనలను కచ్చితంగా పాటించాలి.

- డాక్టర్‌ మాదల కిరణ్‌, హెచ్‌వోడీ, క్రిటికల్‌ కేర్‌, నిజామాబాద్‌ వైద్య కళాశాల

Updated Date - 2021-11-28T09:11:45+05:30 IST