గులాల్‌.. డబుల్‌

ABN , First Publish Date - 2021-03-21T08:04:25+05:30 IST

రాష్ట్రంలోని ఆరు ఉమ్మడి జిల్లాల పరిధిలో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు అధికార టీఆర్‌ఎ్‌సకి డబుల్‌ ధమాకాను అందించాయి.

గులాల్‌.. డబుల్‌

  • మండలి ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ హవా.. 
  • నల్లగొండ, హైదరాబాద్‌ రెండింటా విజయం
  • రెండో ప్రాధాన్యంతో నెగ్గిన పల్లా, వాణీదేవి
  • పల్లాకు 12,806, వాణీకి 11,703 ఓట్ల మెజార్టీ
  • బీజేపీ సిటింగ్‌ స్థానంలోనూ టీఆర్‌ఎస్‌ పాగా
  • దుబ్బాక ఓటమికి అధికారపక్షం ప్రతీకారం
  • ‘జీహెచ్‌ఎంసీ’ జోరును నిలబెట్టుకోలేని కమలం
  • నెలాఖరుకు మండలిలో ప్రాతినిధ్యం కరువు
  • ఓటమికి చిరునామాగా మారిన కాంగ్రెస్‌
  • కలిసి కదిలినా వామపక్షాలకు మొండిచేయి
  • కోదండరాం ఓటమితో టీజేఎస్‌ భవిత ప్రశ్నార్థకం
  • ఓడినా కొత్త కెరటంగా తీన్మార్‌ మల్లన్నకు గుర్తింపు
  • సాగర్‌ ఉప ఎన్నికలపై ఈ ఫలితాల ప్రభావం?


ఖుషీ ఖుషీగా సీఎం..

పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలు రెండింటిలోనూ టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు గెలవడంతో సీఎం కేసీఆర్‌ ఖుషీ ఖుషీగా కనిపించారు. ఎమ్మెల్సీగా ఎన్నికైన వాణీదేవి తనను ప్రగతి భవన్‌లో కలిసినప్పుడు మంత్రులు, పార్టీ నేతలతో నవ్వుతూ మాట్లాడారు. మంత్రి  శ్రీనివా్‌సగౌడ్‌ తెలంగాణ ఉద్యమంలో బాగా పనిచేశారంటూ వాణీదేవికి వివరించారు. అందరితో గ్రూప్‌ ఫొటోలు దిగుతూ కేసీఆర్‌ ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉన్నారు. 


హైదరాబాద్‌/సిటీ/నల్లగొండ, మార్చి 20 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ఆరు ఉమ్మడి జిల్లాల పరిధిలో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు అధికార టీఆర్‌ఎ్‌సకి డబుల్‌ ధమాకాను అందించాయి. టీఆర్‌ఎస్‌ తరఫున ‘నల్లగొండ’ నుంచి సిటింగ్‌ ఎమ్మెల్సీగా తిరిగి పోటీ చేసిన పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ‘హైదరాబాద్‌’ బరిలో దిగిన సురభి వాణీదేవి విజయం సాధించారు. ఇద్దరూ ద్వితీయ ప్రాధాన్య ఓట్లతోనే గెలిచారు. టీఆర్‌ఎస్‌ ఈ ఎన్నికల్లో తమ సిటింగ్‌ సీటును నిలబెట్టుకోవటంతోపాటు, బీజేపీ సిటింగ్‌ సీటును కూడా కైవసం చేసుకుంది. వరంగల్‌- ఖమ్మం- నల్లగొండ, మహబూబ్‌నగర్‌- రంగారెడ్డి- హైదరాబాద్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో అధికార పార్టీ పూర్తి స్థాయి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఈ ఎన్నికల ముందు వరకు ‘నల్గొండ’ స్థానం ఒక్కటే ‘గులాబీ’ ఖాతాలో ఉండేది. ‘హైదరాబాద్‌’ బీజేపీ ఆధీనంలో ఉంది. తాజాగా రెండింటికి రెండు స్థానాలను టీఆర్‌ఎస్‌ గెలుచుకోవటం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ‘హైదరాబాద్‌’ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో ఆ పార్టీ గెలుపొందటం ఇదే మొదటిసారి. ప్రత్యేకించి నాగార్జునసాగర్‌ అసెంబ్లీ స్థానం ఉప ఎన్నికల ముందు వెలువడ్డ ఈ ఫలితాలు అధికార టీఆర్‌ఎ్‌సకు ఎంతో ఊరటనిచ్చాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల దుబ్బాక అసెంబ్లీ స్థానం ఉప ఎన్నికల్లో సిటింగ్‌ సీటును అధికార టీఆర్‌ఎస్‌ కోల్పోవటం, ఆ స్థానాన్ని బీజేపీ చేజిక్కించుకోవటం, గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల్లో ‘గులాబీ’ ఆధిక్యత తగ్గి, మునుపటికన్నా ‘కమలం’ ఎక్కువ వికసించిన నేపథ్యంలో తెలంగాణ అంతటా రాష్ట్ర ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగిందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. వేర్వేరు కారణాల వల్ల ఉద్యోగులు, నిరుద్యోగులు సర్కారుపై గుర్రుగా ఉన్నారనే వార్తలు వచ్చాయి. 


ఇదే క్రమంలో రాష్ట్రంలోని సగానికిపైగా ఉమ్మడి జిల్లాల్లో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు టీఆర్‌ఎ్‌సకి పరీక్షగా మారాయి. ఇందులో ఆ పార్టీ సర్వశక్తులూ ఒడ్డి నెగ్గింది. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీని వెనక్కి నెట్టివేసి, తమకు ప్రత్యామ్నాయం అని చెప్పుకుంటూ దూకుడుగా వెళ్తున్న బీజేపీ సిటింగ్‌ స్థానంలోనే ఆ పార్టీని మట్టి కరిపించటం టీఆర్‌ఎస్‌ శ్రేణులకు ఎక్కువ సంతోషాన్ని కలిగిస్తోంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీని ఓడించటం ద్వారా ఇటీవల ‘దుబ్బాక’ అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన పరాజయానికి ప్రతీకారం తీర్చుకున్నట్లు అయిందని అంటున్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో రాణించిన ప్రాంతంలోనే బీజేపీ, పట్టభద్రుల ఎన్నికల్లో చతికిలపడటం చర్చనీయాంశమైంది. మరోవైపు టీఆర్‌ఎ్‌సకి దీటుగా ఎదుగుతున్నామని చెప్పుకుంటున్న బీజేపీకి, శాసన మండలిలో ప్రాతినిధ్యం లేకుండా పోతోంది. ఆ పార్టీ సిటింగ్‌ ఎమ్మెల్సీ రాంచందర్‌రావు పదవీ కాలం ఈనెల 29వ తేదీతో ముగుస్తోంది.  ఇక తెలంగాణ ఇచ్చిన పార్టీగా చెప్పుకుంటున్న విపక్ష కాంగ్రెస్‌ ఈ ఎన్నికల ఫలితాలతో ఓటమికి కేరాఫ్‌ అడ్ర్‌సగా మారిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. 


2014 అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు మొదలు, ఈమధ్య దుబ్బాక ఉప ఎన్నికలు, జీహెచ్‌ఎంసీ ఎన్నికల వరకు ఆ పార్టీని పరాజయాలే ఎక్కువ పలుకరిస్తున్నాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ కొంత పరవాలేదనిపించినప్పటికీ, ఆ పార్టీ పరిస్థితి రాష్ట్రంలో నానాటికీ తీసికట్టుగా మారుతోంది. రెండింటికి రెండు ఎమ్మెల్సీ స్థానాల్లోనూ కాంగ్రెస్‌ అభ్యర్థులు గట్టి పోటీ కూడా ఇవ్వలేకపోవటం ఆ పార్టీ శ్రేణులను నిస్తేజానికి గురిచేస్తున్నాయి. ‘సాగర్‌’ ఉప ఎన్నికల ముందు ఈ దారుణ ఓటమి కాంగ్రె్‌సకు శరాఘాతంగా పరిణమించింది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కలిసికట్టుగా ముందుకు సాగిన ఉభయ కమ్యూనిస్టులకు మొండిచేయ్యే ఎదురైంది. ‘నల్గొండ’లో సీపీఐ అభ్యర్థిని నిలబెట్టి, సీపీఎం మద్దతు తెలిపినా, ‘హైదరాబాద్‌’లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌కు సీపీఐ, సీపీఎం అండగా నిలిచినా, ఎక్కడా విజయం దరిదాపుల్లోకి రాలేదు. మొదటిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలో నిలిచిన తెలంగాణ జన సమితి (టీజేఎస్‌) రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్‌ ఎం.కోదండరాంకు చేదు అనుభవం తప్పలేదు. ‘నల్గొండ’ నుంచి పోటీ చేసిన ఆయన మూడవ స్థానానికే పరిమితమయ్యారు. అన్నింటికంటే మించి తెలంగాణ ఉద్యమ నేపథ్యం దండిగా కలిగిన కోదండరాంపై ‘నల్గొండ’ స్థానంలో స్వతంత్ర అభ్యర్థి తీన్మార్‌ మల్లన్న (చింతపండు నవీన్‌కుమార్‌) ఎక్కువ ఓట్లు సాధించారు. 


దీంతో కోదండరాం పార్టీ టీజేఎస్‌ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీ ఆవిర్భావం తర్వాత చెప్పుకోదగ్గ ఒక్క విజయమూ ఇప్పటివరకు సాధించకపోవటం, స్వయంగా కోదండరాం పోటీ చేసినప్పటికీ, ఓడిపోవటంతో ఆయన ఇకపై రాజకీయాల్లో కొనసాగుతారా ? లేదా ? ఒకవేళ కొనసాగితే కోదండరాంతోపాటు, ఆయన పార్టీ అడుగులు ఎటు వైపు అనే చర్చ కూడా నడుస్తోంది. ‘నల్గొండ’లో గట్టి పోటీ ఇచ్చి ఓడిపోయినప్పటికీ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనే తీన్మార్‌ మల్లన్న కొత్తగా దూసుకొచ్చిన కెరటంగా గుర్తింపు పొందారు. రాష్ట్ర రాజకీయాల దృష్టిని ఆక్షరించారు. ఈ ఎన్నికల్లో పట్టభద్రులు ఆసక్తికరంగా ఇచ్చిన తీర్పు, త్వరలో జరిగే నాగార్జునసాగర్‌ అసెంబ్లీ స్థానం ఉప ఎన్నికలపై పడే అవకాశాలు ఉన్నాయి.


నల్లగొండ రెండో ప్రాధాన్యంలో కోదండరామ్‌కే మొగ్గు

రెండో ప్రాధాన్య ఓట్ల బదలాయింపు సరళిని చూస్తే కోదంరామ్‌కు కొంత అధికంగా ఓట్లు నమోదు కాగా, పల్లా రాజేశ్వరరెడ్డి, తీన్మార్‌ మల్లన్నకు ఇంచుమించు సమానంగా ఓట్ల బదిలీ జరిగింది. యువతెలంగాణ అభ్యర్థి రాణి రుద్రమ ఓట్లలో అధికంగా కోదండరామ్‌కు, చెరుకు సుధాకర్‌ ఓట్లు తీన్మార్‌ మల్లన్నకు, జయసారధి ఓట్లు సగభాగం కోదండరామ్‌కు, కాంగ్రెస్‌ అభ్యర్థి రాములునాయక్‌ ఓట్లు అధికంగా పల్లా రాజేశ్వర్‌రెడ్డికి, బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి ఓట్లు అధికంగా కోదండరామ్‌కు బదిలీ అయ్యాయి.


పల్లా ఉత్కంఠ విజయం

12 జిల్లాల పరిధిలో విస్తరించిన నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గంలో 5,05,565 మంది ఓటర్లు ఉండగా 3,87,969 ఓట్లు పోలయ్యాయి, ఇందులో 3,66,333 ఓట్లు చెల్లుబాటయ్యాయి. ఈ నెల 17వ తేదీ ఉదయం 8గంటలకు కౌంటింగ్‌ ప్రారంభం కాగా తొలి ప్రాధాన్యంలో గెలుపు కోటా అయిన 1,83,167 ఓట్లు ఎవరికీ రాకపోవడంతో శుక్రవారం ఉదయం ఏడు గంటల నుంచి రెండో ప్రాధాన్య ఓట్లను లెక్కించడం మొదలు పెట్టగా శనివారం రాత్రి 11 గంటలకు ముగింపు దొరికింది. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి తన సమీప ప్రత్యర్థి తీన్మార్‌ మల్లన్నపై 12,806 ఓట్ల ఆధిక్యంతో విజయం సాఽధించారు. రెండో ప్రాధాన్య లెక్కింపు క్రమంలో చివరి రోజు కాంగ్రెస్‌ అభ్యర్థి రాములు నాయక్‌ను; ఆ తర్వాత బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డిని, తెలంగాణ జనసమితి అభ్యరి కోదండరామ్‌ను ఎలిమినేట్‌ చేసి ఓట్లను పైవారికి బదలాయించారు. చివరకు తీన్మార్‌ మల్లన్న, పల్లా రాజేశ్వర్‌రెడ్డిలు బరిలో ఉన్నారు. 


చివరి రోజు టెన్షన్‌

పల్లాకు మొదటి ప్రాధాన్యంతో కలిపి 1,11,812 ఓట్లు రాగా మల్లన్నకు 84,118, కోదండరాంకు 71,126 రాగా; పల్లా 27,685 ఆధిక్యంలో ఉన్నారు. ఉదయ 11.15 గంటల కల్లా 67వ అభ్యర్థి రాములునాయక్‌ను ఎలిమినేట్‌ చేయగా పల్లాకు 1,22,638 ఓట్లు, మల్లన్నకు 99,210 ఓట్లు, కోదండరాంకు 89,409 ఓట్లు వచ్చాయి దీంతో పలాక్లు 4వేల ఓట్లు తగ్గి ఆధిక్యం 23,428కి పడిపోయింది. 68వ అభ్యర్థి బీజేపీ నాయకుడు ప్రేమేందర్‌రెడ్డి ఎలిమినేషన్‌ తరువాత పల్లా రాజేశ్వరరెడ్డి ఓట్లు 1,32,921కి చేరుకోగా మల్లన్నవి 1,08,250, కోదండరామ్‌కు 1,03,030 నమోదై పల్లా ఆధిక్యం 24,671కి పెరిగింది. సాయంత్రం 4 గంటలకు కోదండరామ్‌ ఎలిమినేషన్‌ ప్రారంభం కాగా మూడో స్థానంలో ఉండటంతో కోదండరామ్‌ కౌంటింగ్‌ హాల్‌ నుంచి వెళ్లిపోయారు. కోదండరాం ఓట్లను పై వారికి బదలాయించినప్పటికీ ఆధిక్యంలో ఉన్న పల్లాకు కోటా ఓట్లు దక్కకపోవడంతో రెండో స్థానంలో ఉన్న తీన్మార్‌ మల్లన్న ఓట్లను పల్లాకు బదలాయించారు. 

Updated Date - 2021-03-21T08:04:25+05:30 IST