గుడుంబాపై దృష్టి సారించని ఎక్సైజ్‌శాఖ
ABN , First Publish Date - 2021-12-30T17:54:48+05:30 IST
గూడూరు ఏజెన్సీ మండలంలో మారుమూల తండాలు, గిరిజన గూడాల్లో మళ్లీ గుండుంబా గుప్పుమంటుందని, నిరోధించాల్సిన సంబంధిత ఎక్సైజ్ అధికారులు..

అధికారులపై ప్రజాప్రతినిధుల ఆగ్రహం
గరంగరంగా సర్వసభ్య సమావేశం
గూడూరురూరల్, డిసెంబరు 29: గూడూరు ఏజెన్సీ మండలంలో మారుమూల తండాలు, గిరిజన గూడాల్లో మళ్లీ గుండుంబా గుప్పుమంటుందని, నిరోధించాల్సిన సంబంధిత ఎక్సైజ్ అధికారులు మూలాలపై దృష్టి పెట్టకుండా అడపదడపా దాడులు చేస్తూ అమ్మకందారులకు అడ్డుకట్ట వేయలేక పోతున్నారని జడ్పీ కోఆప్షన్ సభ్యుడు మహ్మద్ ఖాసీం, ఎంపీపీ బానోత్ సుజాత మోతీలాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గూడూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయం లో సర్వసభ్య సమావేశం బుధవారం నిర్వహించారు. పలు గ్రామాల సర్పంచులు గుడుంబాపై ఎక్సైజ్ అధికారులు దృష్టిసారించడం లేదని ఆరోపించగా జడ్పీ కోఆప్షన్ సభ్యుడు ఖాసీం, ఎంపీ పీ సుజాత మోతీలాల్ కలుగ చేసుకుని ఎక్సైజ్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సంబంధిత ఎక్సైజ్ శాఖ సీఐ మండల సభకు గైర్హాజరు పట్ల అసహానం వ్యక్తం చేశారు. కొన్నెళ్లుగా స్తబ్దతగా ఉన్న నాటుసారా తయారీ మళ్లీ పుంజుకుంటుందని, కొంద రు గుడుంబా కాయడమే వృత్తిగా పెట్టుకుని దందా కొనసాగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎర్రకుంటతండ, గుండెంగ, సీతానగరం, వెంగంపేట, చిన్నెళ్లపురం, మచ్చర్ల, భూపతిపేట, అప్పరాజుపల్లి, బొద్దుగొండ గ్రామాల్లో గుడుంబా విచ్చల విడి గా తయారు చేస్తున్నట్లు అధికారులు అడపదడపా దాడులు చేస్తూ కాలం వెల్లదీస్తున్నారని అన్నారు. గ్రామాల్లో బెల్లంతో పాటు గుడుంబా ను నియంత్రించాలని అధికారులకు సూచించా రు. గొలుసుకట్టు బెల్టుషాపులపై కొరడ ఝులిపించాలని స్పష్టం చేశారు. అదే విధంగా మిషన్ భగీరథ, కల్యాణలక్ష్మి, వైద్యం, సంబంధిత అంశాలపై ప్రధానంగా చర్చించారు. సమావేశం లో ఎంపీడీవో విజయలక్ష్మి, పలు శాఖల అధికారులు, ఎంపీటీసీలు, సర్పంచులు పాల్గొన్నారు.
మృతురాలి కుటుంబానికి పరామర్శ
గూడూరులో మంజు హోటల్ యాజమాని వేమిశెట్టి కన్నాంబ అనారోగ్యంతో మృతి చెందగా బుధవారం ఎంపీపీ బానోత్ సుజాతమోతీలాల్ వారి కుమారులు శ్రీధర్, రాజులను పరామర్శించారు. ఎంపీటీసీ బి.కిషన్, బాలు, దేవేందర్‌నాయక్ ఉన్నారు.