గుడ్డుకు గడ్డుకాలం

ABN , First Publish Date - 2021-12-08T05:44:47+05:30 IST

గుడ్డుకు గడ్డుకాలం

గుడ్డుకు గడ్డుకాలం

పెరిగిన కోడిగుడ్డు ధర

మధ్యాహ్న భోజనంలో అందించలేకపోతున్న ఏజెన్సీలు

మూడు నెలలుగా అందని మెస్‌ బిల్లులు

బిల్లులివ్వకుంటే సమ్మె చేస్తామంటున్న నిర్వాహకులు

వరంగల్‌, హనుమకొండ జిల్లాలో విద్యార్థులకు తిప్పలు


వరంగల్‌ సిటీ, డిసెంబరు 7: పాఠశాలల్లో ఏర్పాటు చేస్తున్న మధ్యాహ్న భోజనంలో కోడిగుడ్డు భారంగా మారుతోంది. ఽగుడ్డు ధర పెరగడంతో వంట ఏజేన్సీలు వారంలో మూడుసార్లు అందించేందుకు బెంబేలెత్తిపోతున్నారు. నిత్యావసరాలు పెరగడం.. ప్రభుత్వం ఇచ్చే బిల్లులు తక్కువగా ఉండడంతో తో అప్పుల పాలు అవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీటికితోడు మూడు నెలలుగా మెస్‌ బిల్లులు రావడం లేదని, దీంతో మధ్యాహ్న భోజనం మరింత భారంగా మారుతోందని వాపోతున్నారు. వరంగల్‌ జిల్లాలో 48,437 మంది విద్యార్థులు, హనుమకొండ జిల్లాలో 40,371 విద్యార్థులు మధ్యాహ్న భోజన లబ్ధి పొందుతున్నారు. ప్రభుత్వం స్పందించి వెంటనే బిల్లులు చెల్లించకపోతే నిరవధిక సమ్మెకు దిగుతామని, మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని నిలిపివేస్తామని మధ్యాహ్న భోజన కార్మిక సంఘాల నాయకులు అల్టిమేటం జారీ చేశారు. 


గుడ్డుకు రూపాయి నష్టం..

నిబంధనల ప్రకారం మధ్యాహ్న భోజన మెనూలో వారంలో మూడుసార్లు విద్యార్థులకు ఉడకబెట్టిన గుడ్డు అందిస్తున్నారు. గుడ్డు ధర మార్కెట్లో రూ. 5 నడుస్తుంటే ప్రభుత్వం మాత్రం వంట ఏజెన్సీ వారికి రూ. 4 చెల్లిస్తోంది. మార్కెట్‌ ధర చెల్లిస్తేనే గుడ్డును విద్యార్థులకు అందించే పరిస్థితి నెలకొని ఉందని వారు చెబుతున్నారు. 


ఏజెన్సీకి ధరాఘాతం...

నిత్యావసర సరుకుల ధరలు రోజురోజుకూ పెరుగుతుండడంతో నిర్వాహకులకు తలనొప్పిగామారింది. నూనె, పప్పు, టమాట, కూరగాయల ధరలు పెరగడంతో మెనూ ప్రకారం భోజనం అందించలేకపోతున్నామని వారు ఆందోళన చెందుతున్నారు. మరోపక్క గ్యాస్‌ ధర సైతం పెరగడం, వంట చెరకు ధరలు మండిపోతుండటంతో మధ్యాహ్న భోజన పథకం భారంగా మారుతోందని వారు అంటున్నారు. 


జిల్లాల వారీగా లబ్ధి పొందుతున్న విద్యార్థులు

వరంగల్‌ జిల్లాలో 318 ప్రాథమిక పాఠశాలల్లో 16,353 మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందుతోంది. 73 ప్రాథమికోన్నత పాఠశాలల్లో 4,737 మంది, 144 ఉన్నత పాఠశాలల్లో 19,281 మంది మొత్తంగా జిల్లా వ్యాప్తంగా రోజుకు 40,371 మంది విద్యార్థులకు భోజనం అందుతోంది. అలాగే హనుమకొండ జిల్లాలో 466 ప్రాథమిక పాఠశాలల్లో 25,285 మంది విద్యార్థులకు, 73 ప్రాథమికోన్నత పాఠశాలల్లో 13,735 మంది, 146 ఉన్నత పాఠశాలల్లో 9,417 మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందుతోంది. మొత్తంగా జిల్లాలో 48,437 మంది విద్యార్థులు లబ్ధి పొందుతున్నారు. 


మధ్యాహ్న భోజన కార్మికుల డిమాండ్లివే...

మధ్యాహ్న భోజన కార్మికులకు రావాల్సిన పెండిగ్‌లో ఉన్న మూడు నెలల బిల్లులు వెంటనే విడుదల చేయాలని కోరుతున్నారు. గుడ్డు ధరను రూ. 4 నుంచి రూ. 6కు పెంచాలని, గౌరవవేతనం రూ.1000 కాకుండా కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. నిత్యావసర సరుకులు, కూరగాయల ధరలు పెరగడంతో ఇచ్చే బిల్లుల్లో ధరలు  పెంచి ఇవ్వాలంటున్నారు. వారానికి ఒక గ్యాస్‌ సిలింగర్‌ చొప్పున ప్రభుత్వమే సరఫరా చేయాలని స్పష్టం చేస్తున్నారు.


అధికారులకు అల్టిమేటం...

మధ్యాహ్న భోజన ఏజెన్సీ, వంట కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే వెంటనే సమ్మెలోకి దిగి మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని నిరవధికంగా నిలిపివేస్తామని తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల మధ్యాహ్న భోజన వంట కార్మికుల సంఘం నేతలు సోమవారం వరంగల్‌ డీఈవోకు వినతి పత్రం అందజేశారు. గుడ్డు ధరను పెంచాలని, మూడు నెలలుగా పెండింగ్‌లో ఉన్న బిల్లులను సత్వరమే చెల్లించాలని వారు డిమాండ్‌ చేశారు. లేకపోతే రెండు మూడు రోజుల్లో వంటను నిలిపి వేస్తామని హెచ్చరించారు. 


సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి : పోలెపాక లక్ష్మి, తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల మధ్యాహ్న భోజన వంట కార్మికుల సంఘం జిల్లా అధ్యక్షురాలు

మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి. పెరిగిన ధరలకు అనుగుణంగా బిల్లులు చెల్లించాలి. కనీస వేతనాలు అందించాలి. గ్యాస్‌ సిలిండర్లను ప్రభుత్వమే సరఫరా చేయాలి. అప్పులు చేసి వంట చేస్తున్నాము. ప్రభుత్వం ఆలోచించి ఆదుకోవాలి.


బిల్లులు వెంటనే చెల్లించాలి : గట్టు రజిత, మధ్యాహ్న భోజన కార్మికురాలు

మూడు నెలలుగా మెస్‌ బిల్లులు రావడం లేదు. అప్పుల చేసి మధ్యాహ్న భోజనం పిల్లలకు అందిస్తున్నాము. ధరలు అధికంగా పెరగడంతో భోజనం తయారు చేయడం కష్టంగా ఉంది. గౌరవ వేతనం రూ. 1000 కూడా సరిపోవడం లేదు.  కనీస వేతనం అందించేందుకు ప్రభుత్వం చొరవ చూపాలి. 

Updated Date - 2021-12-08T05:44:47+05:30 IST