ప్రజల సమస్యలను పరిష్కరించండి
ABN , First Publish Date - 2021-10-26T05:08:45+05:30 IST
ప్రజల సమస్యలను పరిష్కరించండి

కలెక్టర్ బి.గోపి
ప్రజావాణిలో వినతుల వెల్లువ
వరంగల్ కలెక్టరేట్, అక్టోబరు 25: ప్రజలు దరఖాస్తు చేసుకున్న ప్రతీ సమస్యను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ బి.గోపి అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో గ్రీవెన్స్ నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారి వినతి పత్రాలను కలెక్టర్ స్వీకరించారు. కలెక్టర్ మాట్లాడుతూ గ్రీవెన్స్‌లో ప్రజలు అందజేసిన వినతి పత్రాలను వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. శాఖల వారీగా పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను అడిగి తెలుసుకున్నారు. గ్రీవెన్స్‌లో సోమవారం 43 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బి. హరిసింగ్, డీఆర్డీవో పీడీ సంపత్‌రావు, సీఈవో రాజారావు, ఆర్డీవో మహేందర్‌జీ పాల్గొన్నారు.
ఖాళీగా ఉన్న చౌక దుకాణాలను భర్తీ చేయండి
జిల్లా వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 39 చౌక దుకాణాలకు నోటిఫికేషన్ జారీ చేసి వెంటనే భర్తీ చేయాలని కలెక్టర్ గోపి పౌరసరఫరాల శాఖ అధికారి లక్ష్మిభవానిని ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన మండల స్థాయిలో విజిలెన్స్ కమిటీ సమావేశంలలో మాట్లాడుతూ విజిలెన్స్ కమిటీ తరచుగా రేషన్ షాపుల పనితీరును పరిశీలించాలన్నారు.
వినియోగదారుల నుంచి గ్యాస్ సిలెండర్లకు అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నారని, పలు రాజకీయ సంఘ నాయకులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా గ్యాస్ ఏజెన్సీ దారులందరిపై విచారణ జరపాలని డీఎ్సవోకు తెలిపారు. జిల్లాలో 2021 జూలైలో 7,172 కొత్త ఫుడ్ సెక్యూరిటీ కార్డులను అందించడం జరిగిందన్నారు. అర్హతలేని 1031 కార్డులను రద్దు చేయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ హరిసింగ్, డీఆర్డీవో డీఎం మార్కెటింగ్ భాస్కర్‌రావు, సీఈవో రాజారావు, విజిలెన్స్ కమిటీ సభ్యులు, రేషన్ డీలర్లు తదితరులు పాల్గొన్నారు.