వెంటనే ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలి

ABN , First Publish Date - 2021-11-23T08:45:37+05:30 IST

ధాన్యం కొనుగోళ్లలో జాప్యంపై కాంగ్రెస్‌ పిలుపుమేరకు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఆ పార్టీ నాయకులు సోమవారం నిరసన కార్యక్రమాలు నిర్వహించారు.

వెంటనే ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలి

  • ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అఖిలపక్షం, కాంగ్రెస్‌ నేతల నిరసన
  • యాదాద్రి భువనగిరిలో రాస్తారోకో 
  • మిల్లర్ల కొర్రీలపై జగిత్యాల రూరల్‌, ఎల్లారెడ్డిపేట రైతుల ఆందోళన

నల్లగొండ/జగిత్యాల రూరల్‌/రాయికల్‌/ఎల్లారెడ్డిపేట, నవంబరు 22 : ధాన్యం కొనుగోళ్లలో జాప్యంపై కాంగ్రెస్‌ పిలుపుమేరకు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఆ పార్టీ నాయకులు సోమవారం నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి పెద్దసంఖ్యలో రైతులు, కాంగ్రెస్‌ కా ర్యకర్తలు ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లతో ర్యాలీగా కలెక్టరేట్‌కు చేరుకొని ధర్నాకు దిగారు. అక్కడి నుంచి ఒక్కసారిగా జాతీయ రహదారిపైకి చేరుకొని రాస్తారోకో చేపట్టారు.  పోలీసులు రోడ్డుపై బైఠాయించిన వారిని అరెస్టు చేసేందుకు యత్నించారు. దీంతో ఆందోళనకారులు, పోలీసుల మధ్య తోపులాట, వాగ్వాదం చోటుచేసుకుంది. రోడ్డుపై బైఠాయించిన వారిని పోలీసులు చెదరగొట్టారు. పలువురు రైతులను, కాంగ్రెస్‌ నాయకులను అరెస్టు చేశారు. సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం కుడకుడలో అఖిలపక్షం ఆధ్వర్యంలో దంతాలపల్లి-సూర్యాపేట రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. అర్వపల్లి మండలం రామన్నగూడెం ధాన్యం కొనుగోలు కేం ద్రం సమీపంలోని సూర్యాపేట-జనగామ రహదారిపై రైతులు రాస్తారోకో చేశారు. 


సంచికి 3 కిలోల కోత విధిస్తున్నారంటూ..  

రైస్‌ మిల్లర్లు అనేక కొర్రీలు పెట్టి ధాన్యం కొనడం లేదంటూ జగిత్యాల రూరల్‌, తాటిపల్లి, రాయికల్‌ల పరిధిలోని హైవేపై రైతులు ఆందోళనకు దిగారు. ధాన్యం రంగు మారిందనే సాకుతో మిల్లరు సంచికి మూడు కిలోల కోత విధిస్తున్నారంటూ రాజన్న సిరిసి ల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట రైతులు ఆందోళనకు దిగారు.  రాజు అనే రైతు పెట్రోల్‌ బాటిల్‌ వెంట తెచ్చుకొని ఒం టిపై పోసుకునేందుకు యత్నించాడు. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం మంతన్‌దేవునిపల్లి ప్రధాన రహదారిపై రైతులు దర్నా చేశారు.  


కలెక్టర్లు, తహసీల్దార్లకు కాంగ్రెస్‌ వినతిపత్రాలు

హైదరాబాద్‌: ఏఐసీసీ ఆదేశాల మేరకు టీపీసీసీ తలపెట్టిన ప్రజా చైతన్య యాత్రల్లో భాగంగా ధాన్యం కొనుగోళ్లు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక వి ధానాలు, స్థానిక అంశాలపై కలెక్టర్లు, తహసీల్దారులకు వినతిపత్రాలను సమర్పించే కార్యక్రమాన్ని టీపీసీసీ చేపట్టింది. 24న తహసీల్దార్లకు, 25న అన్ని కలెక్టర్లకు వినతిపత్రాలు ఇస్తారు. కాగా, కాంగ్రెస్‌ సీనియర్లు  ఐక్యంగా లేకపోతే కార్యకర్తలు తన్నడం ఖాయమని  వీ.హన్మంతరావు వ్యాఖ్యానించారు.  ప్రభుత్వం మిల్లర్ల మేలు కోసమే పని చేస్తోందన్నారు. 


కల్లాల్లోనే మొలకలు

యాదాద్రి : ఆరుగాలం కష్టపడి పండించిన పంటను కొనే నాథుడు దొరకక రైతులు తీవ్ర ఆవేదనకు లోనవుతున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం పగిడిపల్లి, అనంతారం గ్రామాల రైతులు సర్వీసు రోడ్డుపై నిల్వచేసిన ధాన్యం రాశులు ఇటీవల కురిసిన వర్షం వల్ల తడిచాయి. వడ్లు తడిచి మొలకెత్తడంతో రైతుల ఆవేదనకు అంతులేకుండా పోయింది. 


కేంద్రం కిరికిరి పెట్టొద్దు : మంత్రి సత్యవతి 

మరిపెడ రూరల్‌: వడ్ల కొనుగోలుకు కిరికిరి పెట్టొద్దని  మంత్రి సత్యవతి రాథోడ్‌ కేంద్ర ప్రభుత్వానికి హితవు పలికారు. సోమవారం మరిపెడ మండలం తాళ్లూకల్‌లో మాట్లాడుతూ కేంద్ర సర్కారు రైతు వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చి అభాసుపాలైన విషయాన్ని గుర్తుచేశారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ రైతాంగానికి క్షమాపణలు చెప్పిన సంగతిని గుర్తెరిగి.. రాష్ట్ర బీజేపీ నేతలు మసులుకోవాలని సూచించారు. మొత్తం ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వమే కొనాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - 2021-11-23T08:45:37+05:30 IST