కోవిడ్ నిబంధనలు పాటించేలా ప్రజలను చైతన్యవంతం చేయాలి: గవర్నర్
ABN , First Publish Date - 2021-05-09T00:37:51+05:30 IST
కోవిడ్ నివారణ నిబంధనలు పాటించేలా ప్రజలను చైతన్యవంతం చేయడం, కోవిడ్ నివారణ లో అత్యంత కీలకమైన అంశం అని గవర్నర్ డాక్టర్ సౌందరరాజన్ అన్నారు.

హైదరాబాద్: కోవిడ్ నివారణ నిబంధనలు పాటించేలా ప్రజలను చైతన్యవంతం చేయడం, కోవిడ్ నివారణ లో అత్యంత కీలకమైన అంశం అని గవర్నర్ డాక్టర్ సౌందరరాజన్ అన్నారు. ప్రజలు అందరూ కోవిడ్ నివారణ పద్ధతులను సరిగ్గా అనుసరించినప్పుడే ఈ సంక్షోభం నుండి మనం బయట పడవచ్చు అని గవర్నర్ అన్నారు. ఈ దిశగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తెలంగాణ శాఖ మరింతగా కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు. ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు గవర్నర్ రెడ్ క్రాస్ రాష్ట్ర, జిల్లా ల ప్రతినిధులతో వర్చువల్ పద్ధతిలో చర్చించారు. సంక్షోభ సమయంలో రెడ్ క్రాస్ వాలంటీర్లు చేపడుతున్న సేవ సహాయ కార్యక్రమాలు అపూర్వ మన్నారు, వారిని అభినందించారు.కోవిడ్ రెండో దశ తీవ్రంగా ఉన్నందున మరింత ఎక్కువ మంది వాలంటీర్లతో సేవా కార్యక్రమాలు ఉధృతంగా చేపట్టి నిస్సహాయులకు అండగా నిలవాలని డాక్టర్ తమిళిసై పిలుపునిచ్చారు.
చైతన్యవంతమైన ప్రజల భాగస్వామ్యంతోనే మనం ఈ మహమ్మారి మరింత ప్రబలకుండా చూడగలమని గవర్నర్ వివరించారు.కోవిడ్ నివారణ నిబంధనలు పాటించడం, అందరూ వాక్సినేషన్ తీసుకోవడం, సంక్షోభం మరింత ముదరకుండా చూడడం మన తక్షణ కర్తవ్యం అని గవర్నర్ స్పష్టం చేశారు.ఈ సందర్భంగా రెడ్ క్రాస్ ప్రతినిధులకు, వాలంటీర్లకు ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. వారి సేవా కార్యక్రమాలను అభినందించారు. అందరూ గొప్ప సంకల్పంతో, సమిష్టితత్వం తో, మొక్కవోని దీక్షతో, సమన్వయంగా చైతన్య పరిచే కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేపట్టినప్పుడే ఈ కోవిడ్ సంక్షోభాన్ని మనంసమర్థవంతంగా ఎదుర్కోగల మని గవర్నర్ అభిప్రాయపడ్డారు. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్న డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ పుదుచ్చేరి రాజ్ నివాస్ నుండి ఈ దృశ్య మాధ్యమం ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.గవర్నర్ సెక్రెటరీ కె సురేంద్రమోహన్ హైదరాబాద్ రాజ్ భవన్ నుండి ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేశారు.