సర్కార్ ఆన్‌లైన్ సేవలు బంద్
ABN , First Publish Date - 2021-07-08T08:05:17+05:30 IST
ప్రభుత్వ ఆన్‌లైన్ సేవలు మూడురోజుల పాటు నిలిచిపోనున్నాయి. అలాగే ప్రభుత్వ వెబ్‌సైట్లు కూడా పనిచేయవు.
మూడు రోజులు ప్రభుత్వ ఆన్‌లైన్ సేవలు బంద్
రేపటి నుంచి 11 వరకు వెబ్‌సైట్లు పని చేయవు
అప్‌గ్రేడేషన్ పనుల వల్లే సేవలను నిలిపేస్తున్నామన్న ఐటీ శాఖ
హైదరాబాద్, జూలై 7 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఆన్‌లైన్ సేవలు మూడురోజుల పాటు నిలిచిపోనున్నాయి. అలాగే ప్రభుత్వ వెబ్‌సైట్లు కూడా పనిచేయవు. ఈనెల 9 నుంచి 11 వరకు ఈ సేవలు బంద్ కానున్నాయి. వెబ్‌సైట్లు, ఆన్‌లైన్ సేవలకు కేంద్ర బిందువైన స్టేట్ డేటా సెంటర్ (ఎస్‌డీసీ) లో కొత్త యూపీఎస్ సిస్టంను ఏర్పాటు చేయనున్న దృష్ట్యా వెబ్‌సైట్లు, ఆన్‌లైన్ సేవలను నిలిపివేస్తున్నామని ఐటీ శాఖ ప్రకటించింది. ప్రస్తుతం గచ్చిబౌలిలోని టీఎ్‌సఐఐసీ సెంటర్‌లో ఎస్‌డీసీ ఉంది. 2010లో ఏర్పాటు చేయబడిన ఈ ఎస్‌డీసీ.. 2011 నుంచి పనిచేస్తోంది. ఎస్‌డీసీకే ప్రభుత్వ శాఖలకు చెందిన వివిధ అప్లికేషన్లు అనుసంధానమై ఉన్నాయి. ఎస్‌డీసీలో చాలా కాలంగా పాత యూపీఎస్ ఉన్నందున పవర్ బ్యాక్‌పలో సాంకేతిక సమస్యలు తలెత్తి ఐటీ సేవలకు అంతరాయం కలుగుతోంది. ఈ నేపథ్యంలో దాని స్థానంలో కొత్త యూపీఎ్‌సను ఏర్పాటు చేయాలని (అప్‌గ్రెడేషన్) ఐటీ శాఖ నిర్ణయించింది.