‘లాపరోస్కోపిక్‌’ కథ సుఖాంతం

ABN , First Publish Date - 2021-03-24T06:02:52+05:30 IST

‘లాపరోస్కోపిక్‌’ కథ సుఖాంతం
సమావేశంలో యంత్రాన్ని చూపిస్తున్న సూపరింటెండెంట్‌ నిర్మలాకుమారి

థియేటర్‌ ఇన్‌చార్జి హెడ్‌నర్స్‌కు మెమో


గిర్మాజిపేట, మార్చి 23: వరంగల్‌ సీకేఎం ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో అదృశ్యమైన హర్మోనిక్‌ లాపరోస్కోపిక్‌ యంత్రం మంగళవారం ఆస్పత్రికి చేరుకుంది. మంగళవారం హైదరాబాద్‌ నుంచి ఫాబర్‌ సింధూరి సంస్థ ఉద్యోగులు లాపరోస్కోపిక్‌ యంత్రాన్ని ఆస్పత్రికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నిర్మలాకుమారి తన చాంబర్‌లో మీడియా సమావేశంలో యంత్రాన్ని చూపించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. లాపరోస్కోపిక్‌ యంత్రం కనిపించడంలేదనే విషయాన్ని హెడ్‌నర్సు 6 నెలల కిందట తన దృష్టికి తీసుకువచ్చిందన్నారు. థియేటర్‌ సిబ్బందిని విచారించగా మరమ్మతు కోసం పోయిందని చెప్పడంతో తాను పట్టించుకోలేదని చెప్పారు. అయితే యంత్రం కనిపించని విషయంపై డీఎంఈ నుంచి లేఖ రావడంతో ఆర్‌ఎంవో డాక్టర్‌ శ్యాంకుమార్‌తో విచారణ చేయించామన్నారు. విచారణలో భాగంగా ఫాబర్‌ సింధూరి సంస్థ వద్ద లాపరోస్కోపిక్‌ ఉందని తేలిందన్నారు. ఈ సంఘటనపై పోలీసు కేసు పెట్టాలని డీఎంఈ లేఖ రాసినప్పటికీ మరమ్మతు కోసం పోయినప్పుడు పోలీసు కేసు ఎందుకని పెట్టలేదని వివరించారు. మరమ్మతు కోసం ఫాబర్‌ సింధూరి సంస్థ తీసుకుపోయినట్లుగా ఆస్పత్రిలో ఎలాంటి రికార్డుల్లేవన్నారు. తాను సూపరింటెండెంట్‌గా లేని సమయంలో లాపరోస్కోపిక్‌ అదృశ్యమైందని తెలిపారు. ఈ సంఘటనలో థియేటర్‌ ఇన్‌చార్జి హెడ్‌నర్సుకు మోమో ఇస్తున్నామన్నారు. సమావేశంలో ఆర్‌ఎంవో డాక్టర్‌ శ్యాంకుమార్‌ పాల్లొన్నారు. 


Updated Date - 2021-03-24T06:02:52+05:30 IST