గుడ్ బై 2021
ABN , First Publish Date - 2021-12-31T09:25:21+05:30 IST
ఒకవైపు కరోనా ప్రపంచం మొత్తాన్నీ కమ్మేసినా.. శాస్త్రసాంకేతిక రంగాల్లో జిజ్ఞాస మనిషిని ముందుకే నడిపించింది. ఫలితంగా.. ఎన్నో గొప్ప ఆవిష్కరణలకు, అద్భుతాల సాధనకు 2021 ప్రత్యక్షసాక్షిగా నిలిచింది. ఉదాహరణకు..

విశ్వం పుట్టుకవైపు చూపు.. మనిషికి పంది కిడ్నీ..
ఒకవైపు కరోనా ప్రపంచం మొత్తాన్నీ కమ్మేసినా.. శాస్త్రసాంకేతిక రంగాల్లో జిజ్ఞాస మనిషిని ముందుకే నడిపించింది. ఫలితంగా.. ఎన్నో గొప్ప ఆవిష్కరణలకు, అద్భుతాల సాధనకు 2021 ప్రత్యక్షసాక్షిగా నిలిచింది. ఉదాహరణకు.. హబుల్ కంటే వంద రెట్లు శక్తిమంతమైన, విశ్వం పుట్టుక నాటి గెలాక్సీల వీక్షణ కోసం రూపొందించిన జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కో్‌పను ఈ ఏడాదే అంతరిక్షంలోకి నాసా పంపింది. అలాగే.. సూర్యుడి భగభగల గుట్టుమట్లను తెలుసుకోవడానికి నాసా చేపట్టిన ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు ‘పార్కర్ సోలార్ ప్రోబ్’ అద్భుతమైన విజయం సాధించింది. సూర్యుడికి అత్యంత సమీపానికి వెళ్లి కరోనా పొరలోకి ప్రవేశించి సత్తా చాటింది. అలాగే.. అంగారకుడిపైకి నాసా పంపిన పర్‌సర్వెన్స్ రోవర్‌లో.. ఇన్‌జెన్యుటీ అనే హెలికాప్టర్ కూడా ఉంది. అది కుజుడి ఉపరితలంపై తనంత తాను ఎగిరింది. కుజుడి ఉపరితలం నుంచి దాదాపు 9.8 అడుగుల ఎత్తులో 40 సెకన్లపాటు ఉన్నచోటే ఎగిరి ఆ తర్వాత సురక్షితంగా ల్యాండయింది. ఆ తర్వాత మరో 17సార్లు (మొత్తం 18 సార్లు) ఆ రోటాక్రాఫ్ట్ కుజుడి ఉపరితలంపై ఎగిరి రికార్డు సృష్టించింది. ఇవి మూడూ అంతరిక్ష రంగంలో సైన్స్ సాధించిన విజయాలైతే.. ఆరోగ్య రంగంలో సాధించిన గొప్ప విజయం.. పంది మూత్రపిండాలను మనిషికి అమర్చడం. న్యూయార్క్ యూనివర్సిటీలోని లాన్‌గోన్ హెల్త్ మెడికల్ సెంటర్ వైద్యులు ఈ అద్భుతాన్ని సాధించారు. పంది కిడ్నీని ఆ పేషెంట్ శరీరం తిరస్కరించకుండా.. దానికి కొన్ని జన్యుమార్పులు చేశారు.
నిన్న మొన్న కొత్త సంవత్సరం వచ్చినట్టుంది! అప్పుడే ఏడాది గడిచిపోయింది!! కళ్ల ముందే కాలం గిర్రున తిరిగిపోయింది. వ్యాక్సిన్ల కోసం ఎదురుచూసిన క్షణాలు.. డెల్టా విజృంభణ.. మళ్లీ లాక్‌డౌన్లు.. వేలాది మరణాలు.. ఒలింపిక్స్‌లో మనోళ్ల సత్తా.. 21 ఏళ్ల తర్వాత దేశానికి వచ్చిన విశ్వసుందరి కిరీటం.. మరో అంతర్జాతీయ టెక్ దిగ్గజ సంస్థకు సీఈవోగా మనోడు.. ఇలా తీపి, చేదుల కలబోతగా కాలం కరిగిపోయింది. వాటన్నింటినీ ఒకసారి గుర్తుచేసుకుంటే....

వేరియంట్స్ నామ సంవత్సరే..
2020 కరోనానామ సంవత్సరమైతే.. 2021ని వేరియంట్ నామ సంవత్సరంగా చెప్పొచ్చు! మొదటి ఏడాదంతా చైనా నుంచి ప్రబలిన వూహాన్ వైరస్ (ఒరిజినల్ సార్స్-కొవ్-2) రాజ్యమేలగా.. దానిలో వచ్చిన ఉత్పరివర్తనాల వల్ల తొలిసారిగా 2020 సెప్టెంబరులో యూకేలో ఆల్ఫా వేరియంట్ వెలుగు చూసింది. 2020 డిసెంబరు రెండోవారానికి యూకేలో భారీగా వ్యాపించడం మొదలైన ఆల్ఫా వేరియంట్ ఆ తర్వాత ప్రపంచంలోని పలుదేశాలకు విస్తరించింది. అలా 2020 చివర్లో మొదలైన వేరియంట్ల వెల్లువ.. దక్షిణాఫ్రికాలో బీటా వేరియంట్, బ్రెజిల్‌లో గామా వేరియంట్, భారత్‌లో డెల్టా వేరియంట్, మళ్లీ దక్షిణాఫ్రికాలో ఒమైక్రాన్ వేరియంట్‌గా రూపాలు మార్చుకుంటూ ఇన్‌స్టాల్‌మెంట్లలో మానవాళిపై పంజా విసురుతూనే ఉంది. 2020లో ఈ వేరియంట్ల గోల లేదు. కరోనా అంటే కరోనానే. 2020కి.. 2021కి మధ్య మరో పెద్ద తేడా.. వ్యాక్సిన్లు. 2020 అంతా.. ఈ మాయదారి కరోనాను మట్టుబెట్టే వ్యాక్సిన్ ఎప్పుడొస్తుందా అని అంతా ఎదురుచూశాం.
జనవరిలో ప్రపంచంలోనే అతి పెద్ద టీకా కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. ఆ తర్వాత.. మహా విలన్ థానో్‌సపై పోరాడే అవెంజర్లలా ఈ ఏడాదిలో 10కి పైగా టీకాలు అందుబాటులోకి వచ్చేశాయి. రెండు మందులు (మోల్నుపిరవిర్, పాక్స్‌లోవిడ్), మోనోక్లోనల్ యాంటీబాడీస్ చికిత్స వంటివీ వచ్చాయి. అన్నిటికీ మించి.. ఇప్పుడు ప్రబలుతున్న ఒమైక్రానే కరోనాపై ప్రకృతి ప్రయోగించిన సిసలైన టీకా అని కొందరు శాస్త్రజ్ఞులు అంటున్నారు. ఒకవేళ అదే నిజమైతే.. మళ్లీ 2019డిసెంబరుకు ముందులాగా ప్రపంచమంతా మామూలైపోతుంది! మాస్కులు, శానిటైజర్లు, ఆన్‌లైన్ క్లాసులు లేని పాత రోజులు మళ్లీ వచ్చేస్తాయి. అబ్బ.. తల్చుకుంటేనే ఆ ఊహ ఎంత బాగుందో కదా!! కొత్త సంవత్సరంలో ఆ ఊహ నిజం కావాలని కోరుకుందాం.

రైతు విజయం?
కొత్త సాగు చట్టాలపై దాదాపు ఏడాదిగా ఢిల్లీ సరిహద్దుల్లో అలుపెరగని ఆందోళన చేస్తున్న రైతుల దెబ్బకు మోదీ సర్కారు వెనక్కి తగ్గింది. ఎవరితోనూ సంప్రదింపులు జరపకుండా ఏకపక్షంగా చేసిన ఆ మూడు చట్టాలనూ ఉపసంహరించుకుంటున్నట్టు ప్రధాని నరేంద్రమోదీ నవంబరు 19న ప్రకటించారు. రైతు ఉత్పత్తుల వాణిజ్య, వర్తక (ప్రోత్సాహక, సులభతరం) చట్టం - 2020, రైతుల (సాధికారత, రక్షణ) ధరల హామీ, వ్యవసాయ సేవల చట్టం - 2020, నిత్యవసర సరుకుల సవరణ చట్టం - 2020ని గత ఏడాది సెప్టెంబరు నెలలో పార్లమెంటు ఆమోదించిన సంగతి తెలిసిందే. ఈ చట్టాలపై రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చినా తొలుత పట్టించుకోని మోదీ సర్కారు.. పంజాబ్, ఉత్తరప్రదేశ్ వంటి కీలక రాష్ట్రాల్లో వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో దిగొచ్చింది. ప్రధాని మోదీ.. దేశ ప్రజందరికీ క్షమాపణలు చెప్పి, ఈ చట్టాలను రద్దు చేయనున్నట్టు తెలపడంతో దేశమంతా దీన్ని రైతు విజయంగా కీర్తించింది.

అందేంత ఎత్తే తారాతీరం..
‘‘అందనంత ఎత్తా తారాతీరం.. సంగతేందో చూద్దాం రా..’’ అంటూ జెఫ్‌బెజోస్, ఈలన్ మస్క్ లాంటి అపరకుబేరులు అంతరిక్ష పర్యాటకంపై కన్ను వేయడంతో 2021లో స్పేస్ ట్రావెల్ కొత్త పుంతలు తొక్కింది. తొలిసారిగా వ్యోమగాములు కానివారు, సాధారణ పౌరులు.. అంతరిక్ష యానం చేసి చరిత్ర సృష్టించారు. భవిష్యత్తు అంతరిక్ష పర్యాటకానికి ఆకాశం కూడా హద్దు కాదు అని నిరూపించారు. జెఫ్ బెజోస్ బ్లూ ఆరిజిన్, ఈలన్ మస్క్ స్పేస్ ఎక్స్, రిచర్డ్ బ్రాన్సన్ వర్జిన్ గెలాక్టిక్ లాంటి సంస్థలు అంతరిక్ష పర్యాటకుల కలలను నిజం చేసే ప్రయత్నాల్లో ఈ ఏడాది తొలి అడుగులు వేశాయి. 2022లో అంతరిక్ష పర్యాటకం మరింత జోరందుకుంటుందని అంచనా.

దేశం గర్వించిన క్షణాలెన్నో..
- ప్రపంచ యవనికపై భారతదేశం, భారతీయులు అంతా తలెత్తుకునేలా చేసిన కొన్ని మధురఘట్టాలు 2021లో ఆవిష్కృతమయ్యాయి.
- ప్రపంచ దేశాల శాస్త్రజ్ఞులతో పోటీపడి మనదేశానికి.. అందునా తెలుగు రాష్ట్రాలకు చెందిన భారత్ బయోటెక్ సంస్థ కరోనాకు చెక్‌పెట్టే కొవ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
- టోక్యోలో జరిగిన ఒలింపిక్స్‌లో భారత బృందం అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చింది. ముఖ్యంగా.. జావెలిన్ క్రీడాకారుడు నీరజ్ చోప్రా బంగారు పతకాన్ని సాధించిన క్షణం.. అందరికీ అపురూపం. అలాగే.. హాకీలో సాధించినది కాంస్యపతకమే అయినా.. అది మన పాత వైభవాన్ని మళ్లీ తెచ్చినట్టయింది. 1980 మాస్కో ఒలింపిక్స్ తర్వాత మళ్లీ మనకు హాకీలో పతకం రావడం ఇదే. అలాగే.. టోక్యోలోనే జరిగిన పారాలింపిక్స్‌లో కూడా 5 పసిడి, 8 రజత, 6 కాంస్య పతకాలతో (మొత్తం 19 పతకాలు) మనోళ్లు సత్తా చాటిన సంవత్సరమిది.

- సెప్టెంబరు 17న ఒకేరోజు 2.5 కోట్ల మందికి టీకాలు వేయడం ద్వారా భారత్ రికార్డు సృష్టించింది. అలాగే.. 100 కోట్ల డోసుల కరోనా టీకాలు ఇచ్చిన తొలిదేశంగా కూడా నిలిచింది.
- ఇప్పటికే గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ టెక్ సంస్థలకు మనవాళ్లు నేతృత్వం వహిస్తుండగా.. ఆ లీగ్‌లో మరో భారతీయుడు ఈ ఏడాది చేరాడు. అతడే.. పరాగ్ అగర్వాల్ (37). ఇటీవలే అతడు ట్విటర్ సీఈవోగా బాధ్యతలు చేపట్టాడు.
- 21 ఏళ్ల ఎదురుచూపుల తర్వాత.. ‘విశ్వసుందరి’ కిరీటం మనదేశ మహిళకు వచ్చింది. పంజాబ్‌కు చెందిన హర్నాజ్ సంధు ఈ కిరీటాన్ని సాధించింది.
- ..కొవిడ్ విలయానికే కాదు, ఇలాంటి ఎన్నో అపురూపఘట్టాలకూ 2021 వేదికైంది. కొత్త ఏడాదైనా కొవిడ్ ముప్పు తొలగి, మరెన్నో మధుర ఘట్టాలు ఆవిష్కృతం కావాలని ఆశిద్దాం.

మారుతున్న రాజకీయ ముఖచిత్రం
కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా పార్టీ జెండా ఎగరేస్తుంటే.. జెండా కాస్త పైకెగరకుండా కిందికొచ్చి పార్టీ అధినేత్రి సోనియా చేతుల్లో పడింది! దేశాన్ని కొన్ని దశాబ్దాలపాటు ఏలిన కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత దుస్థితికి అద్దం పట్టే ఈ ఘటన 2021 సంవత్సరాంతంలో జరిగింది! కాంగ్రెస్ పార్టీ లేకుండానే ప్రాంతీయ పార్టీలను కూడగట్టి బీజేపీకి ఎదురొడ్డి పోరాడాలనే ఆలోచన దీదీకో, వ్యూహకర్త ప్రశాంత్‌కిశోర్‌కో వచ్చిందంటేనే.. అది ఆ శతాధిక వసంతాల పార్టీ ఎదుర్కొంటున్న గడ్డుకాలానికి నిదర్శనం. ఇక.. కాంగ్రెస్ లేని విపక్ష కూటమి కట్టేంత ధైర్యాన్ని మమతా బెనర్జీకి ఇచ్చింది మాత్రం ఈ ఏడాది బెంగాల్‌లో ఆమె సాధించిన అద్భుత విజయమే. అటు తమిళనాడులో సైతం కరుణానిధి, జయలలిత లేకుండా ఒక కొత్త వాతావరణంలో ఎన్నికలు జరిగాయి. అద్భుతమైన గెలుపుతో అధికార పగ్గాలు చేపట్టిన స్టాలిన్ వ్యవహరిస్తున్న తీరు తమిళనాడు ప్రజలకు పూర్తిగా కొత్త. రాజకీయ పగలు, ప్రతీకారాలకు అలవాటు పడిన తమిళులకు స్టాలిన్ కొత్త రాజకీయాన్ని రుచిచూపిస్తున్నారంటే అతిశయోక్తి కాదు.

కొత్త కరెన్సీ
2021లో భారతీయులకు బాగా పరిచయమైన కొత్త అంశం.. క్రిప్టో కరెన్సీ. ఇంతకు ముందు కూడా ఈ మాట వినపడినా.. భారతీయులు పెద్ద ఎత్తున క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెట్టడం ప్రారంభమైంది మాత్రం ఈ ఏడాదే. ప్రభుత్వం కూడా దీని గురించి ఆలోచించి, విధానాలు రూపొందించాల్సిన స్థాయిలో భారత్‌లో క్రిప్టోకరెన్సీ మార్కెట్ ఊపందుకోవడం 2021 విశేషం.

5జీ టెక్నాలజీ వైపు అడుగులు..
కీప్యాడ్ ఫోన్ల వాడకం తగ్గి స్మార్ట్‌ఫోన్ల వినియోగం పెరుగుతున్న వేళ వచ్చిన 4జీ టెక్నాలజీ దేశంలో సెల్‌ఫోన్ల విప్లవానికి కారణమైతే.. ఆ వేగాన్ని మరింత పెంచే 5జీ టెక్నాలజీ అందుబాటులోకి రావడానికి కావాల్సిన కీలక అడుగులు 2021లో పడ్డాయి ఫలితంగా 2022లో దేశంలో 5జీ టెక్నాలజీ అందుబాటులోకి రాబోతోంది. ముందుగా ఢిల్లీ, గుర్గావ్, ముంబై, పుణె, బెంగళూరు, చండీగఢ్, చెన్నై, హైదరాబాద్, కోల్‌కతా, జామ్‌నగర్, అహ్మదాబాద్, లఖ్‌నవూ, గాంధీనగర్ వంటి నగరాల్లో ఈ 5జీ సేవలు వచ్చే ఏడాది అందుబాటులోకి రానున్నాయి. .

న్యాయపీఠంపై తెలుగు తేజం
న్యాయరంగంలో ఈసారి ప్రత్యేకత.. మన తెలుగువాడు జస్టిస్ ఎన్వీ రమణ దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అయ్యారు. విలక్షణమైన తీర్పులు, విస్తృత నియామకాలతో ఆయన తనదైన ముద్ర వేయడం.. ఆయన తీసుకుంటున్న చర్యలను న్యాయనిపుణులంతా మెచ్చుకోవడం తెలుగువారందరికీ గర్వకారణం. అంతేకాదు.. ఈ ఏడాది పలు కీలకమైన అంశాల్లో న్యాయవ్యవస్థ సంచలన, చరిత్రాత్మక తీర్పులను ఇచ్చింది. ఉదాహరణకు.. దేశ రక్షణ పేరుతో కేంద్రం తప్పించుకోజూసినా పెగాస్‌సపై విచారణకు స్వతంత్ర కమిటీ వేయడం వంటి తీర్పులతో న్యాయవ్యవస్థపై ప్రజల గౌరవం మరింతగా ఇనుమడించింది.

ఈ-వాహనాల జోరు
ఆటోమొబైల్ రంగానికి సంబంధించినంతవరకూ 2021 విప్లవాత్మకమైన సంవత్సరంగా చెప్పొచ్చు. దశాబ్దాలుగా మామూలు వాహనాలు రాజ్యమేలుతున్న ఈ రంగంలో.. ఈ ఏడాది ఎలకా్ట్రనిక్ వాహనాలకు (ఈవీ) గిరాకీ బాగా పెరిగింది. మనదేశంలోనే కాదు.. ప్రపంచమంతటా ఇదే ట్రెండ్. గణాంకాల్లో చెప్పాలంటే.. 2020తో పోలిస్తే అంతర్జాతీయంగా ఈ ఏడాది ఈవీలకు గిరాకీ 160ు పెరిగింది. పభుత్వం ఎలకా్ట్రనిక్ వాహనాల వాడకాన్ని భారీగా ప్రోత్సహిస్తోంది. దీంతో కొత్త కొత్త కంపెనీలు ఇబ్బడిముబ్బడిగా మార్కెట్లోకి ఈవీలను విడుదల చేస్తున్నాయి. 2021 నవంబరులో దేశవ్యాప్తంగా 42,067 ఎలకా్ట్రనిక్ వాహనాలు అమ్ముడయ్యాయి. మనదేశంలో ఒక్క నెలలో 40 వేలకు పైగా ఎలకా్ట్రనిక్ వాహనాలు అమ్ముడు కావడం ఇదే మొదటిసారి. 2022లో ఎలకా్ట్రనిక్ కార్ల అమ్మకాలు, వాడకం కూడా భారీగానే పెరుగుతాయని ఆటోమొబైల్ రంగనిపుణులు అంచనా వేస్తున్నారు.

పెట్రో భగ్గు
అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు తగ్గినప్పుడు ఆ లాభం ప్రజలకు అందకుండా అడ్డగోలుగా ఎక్సైజ్ సుంకాలను పెంచేసిన కేంద్రం.. రేట్లు పెరిగినప్పుడు ఆ భారాన్ని ప్రజలపై మోపింది తప్ప పెంచిన సుంకాల భారాన్ని తగ్గించలేదు. కానీ, బెంగాల్ ఎన్నికల్లో ఓటమి, యూపీ, పంజాబ్ సహా పలు రాష్ట్రాల్లో వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికల నేపథ్యంలో ఈ సంవత్సరం చివర్లో (నవంబరు మొదటివారంలో) ఒకింత తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. పెట్రోలుపై లీటరుకు రూ.5, డీజిల్‌పై రూ.10 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించడంతో సామాన్యులకు కాస్తంత ఉపశమనం లభించినట్లయింది. కానీ, ఆ తర్వాత యథావిధిగా చమురు ధరలు మళ్లీ పెరుగుతూనే ఉన్నాయి.
