తెరపైకి గోదావరి-కావేరి లింక్!
ABN , First Publish Date - 2021-10-20T08:02:42+05:30 IST
గోదావరి-కావేరి నదుల అనుసంధానం మళ్లీ తెరమీదికి వచ్చింది. రూ.86 వేల కోట్ల వ్యయంతో గోదావరి నుంచి 247 టీఎంసీల నీటిని తరలించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ప్రతిపాదించింది.

ఐదేళ్లలో ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యం
28న 9 రాష్ట్రాల సీఎంలతో కేంద్ర మంత్రి వీడియో కాన్ఫరెన్స్
మర్నాడు హైదరాబాద్‌లో కేంద్ర, రాష్ట్ర అధికారుల సమావేశం
కేంద్రం రూపొందించిన సాధ్యాసాధ్యాల నివేదికపై చర్చ
హైదరాబాద్, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): గోదావరి-కావేరి నదుల అనుసంధానం మళ్లీ తెరమీదికి వచ్చింది. రూ.86 వేల కోట్ల వ్యయంతో గోదావరి నుంచి 247 టీఎంసీల నీటిని తరలించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ప్రతిపాదించింది. ఐదేళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రాజెక్టుకు సహకారం కోరుతూ ఈ నెల 28వ తేదీన 9 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర జల వనరుల శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. దీనికి భూపేష్ భాఘేల్ (ఛత్తీ్‌సగఢ్), ఉద్ధవ్ ఠాక్రే(మహారాష్ట్ర), కేసీఆర్(తెలంగాణ), జగన్(ఆంధ్రప్రదేశ్), నవీన్ పట్నాయక్(ఒడిసా), శివరాజ్‌సింగ్ చౌహాన్(మధ్యప్రదేశ్), స్టాలిన్(తమిళనాడు), బసవరాజ్ బొమ్మై(కర్ణాటక), విజయన్(కేరళ), రంగస్వామి(పుదుచ్చేరి) పాల్గొంటారు. ఇక 29వ తేదీన జాతీయ నీటి అభివృద్ధి సంస్థ డైరెక్టర్ జనరల్ భోపాల్‌సింగ్ హైదరాబాద్‌లో 9 రాష్ట్రాల నీటిపారుదల, జల వనరుల శాఖ కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులతో సమావేశం కానున్నారు. గోదావరి-కావేరీ అనుసంధానం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించనున్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్టు సమగ్ర నివేదికను సిద్ధం చేసి, తొమ్మిది రాష్ట్రాలకు అందించారు. తాజాగా సాధ్యాసాధ్యాల అధ్యయన నివేదికను కూడా పంపారు.
తమిళనాడు మినహా తెలంగాణ సహా ప్రభావిత రాష్ట్రాలన్నీ అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. ఛత్తీ్‌సగఢ్ వాడుకోని 247 టీఎంసీల ఆధారంగా ఈ ప్రాజెక్టును తలపెట్టారని, ప్రాజెక్టు నిర్మించనున్న ఇచ్చంపల్లి వద్ద 247 టీఎంసీల నీళ్లు లేవని తెలంగాణ స్పష్టం చేసింది. ఛత్తీ్‌సగఢ్ ప్రాజెక్టులు కట్టుకుంటే ఆ కొద్ది నీళ్లు కూడా ఉండవని అనుమానం వ్యక్తం చేసింది. మహానది-గోదావరి అనుసంధానంతో వచ్చే నీటిని మొత్తాన్ని తీసుకెళ్లినా తమకెలాంటి అభ్యంతరాల్లేవని, దీనికి ఎగువన, దిగువన ఉన్న ప్రాజెక్టులనీటి లభ్యతపై రక్షణ ఇవ్వాలని తెలంగాణ కోరుతోంది. తమతో సంప్రదించాకే కాలువల అలైన్‌మెంట్‌ను ప్రతిపాదించాలని స్పష్టం చేసింది. ఏపీ మాత్రం పోలవరం నీటి లభ్యతపై స్పష్టత కోరుతోంది. ప్రభావిత రాష్ట్రాలన్నీ ఆమోదం తెలిపిన తర్వాతే సాంకేతిక, ఆర్థిక, అటవీ, పర్యావరణ, గిరిజనుల పునరావాసం అనుమతి కోసం వెళ్లాల్సి ఉంటుంది. డీపీఆర్‌కు నీటి ఆయోగ్‌తో పాటు కేంద్ర జల వనరుల శాఖ అనుమతి ఇవ్వాలి. అనుసంధానంలో భాగంగా ఇచ్చంపల్లి నుంచి నాగార్జున సాగర్ దాకా, ఆ తర్వాత నాగార్జున సాగర్ నుంచి సోమశిల దాకా, పెన్నార్ నుం చి కావేరి దాకా అనుసంధాన నిర్మాణాలు ఏకకాలంలో చేపడతారు. 2018లో ప్రతిపాదించినపుడు రూ.73,466 కోట్ల వ్యయం అంచనా వేశారు. తాజాగా వ్య యం రూ.86 వేల కోట్లకు చేరిందని లెక్కలు చెబుతున్నాయి.
మూడు రాష్ట్రాలు... ఆరు జిల్లాలు
గోదావరి-కావేరీ అనుసంధానంతో ప్రధానంగా తమిళనాడులో తాగునీటి అవసరాలు తీరతాయి. తెలంగాణలో పూర్వ వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాలో 7,09,946 ఎకరాలకు సాగునీరు అందుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో 3,11,352 ఎకరాలకు, తమిళనాడులో 3,53,360 ఎకరాలకు సాగు ఇస్తారు. తమిళనాడులో కావేరీ బేసిన్లో తాగునీటి అవసరాలు కూడా తీరనున్నాయి. దేశవ్యాప్తంగా 20 నదుల అనుసంధానం చేపట్టాలని కేంద్రం ప్రతిపాదించగా... అందులో ప్రస్తుతం యూపీ-మధ్యప్రదేశ్‌ల మధ్య కెన్-బత్వా నదుల అనుసంధానం పనులు మాత్రమే జరుగుతున్నాయి. రాష్ట్రాలన్నీ ఆమోదిస్తే రెండో ప్రాజెక్టుగా గోదావరి-కావేరీ అనుసంధానం చేపడతారు.