పట్టభద్రుడికి మేకల యూనిట్
ABN , First Publish Date - 2021-07-24T07:50:04+05:30 IST
ఎస్టీ కార్పొరేషన్ రుణం కోసం దరఖాస్తు చేసుకున్న ఆ పట్టభద్రుడు కోటి ఆశలతో ఎదురు చూశాడు.

ఎస్టీ కార్పొరేషన్ కింద అధికారుల మంజూరు
ఇతర వ్యాపారం కోసం యువకుడి దరఖాస్తు
చదువుకుని.. కాపరిగా మారాలా అని ఆవేదన
మర్పల్లి, జూలై 23 : ఎస్టీ కార్పొరేషన్ రుణం కోసం దరఖాస్తు చేసుకున్న ఆ పట్టభద్రుడు కోటి ఆశలతో ఎదురు చూశాడు. ఎంచుకున్న వ్యాపారానికి రుణం వస్తే హాయిగా బతకొచ్చని ఆశపడ్డాడు. కానీ, మేకల యూనిట్ మంజూరుతో కంగుతిన్నాడు. డిగ్రీ చదివి, ప్రభుత్వ కొలువుకు సిద్ధమైన తాను మేకలు కాయాలా..? అని విస్తుపోయాడు. వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం నర్సాపూర్ తండాకు చెందిన ఎ.విశ్వనాథ్ ప్రభుత్వ ఉద్యోగానికి సిద్ధమై.. నోటిఫికేషన్ రాకపోవడంతో హైదరాబాద్ వెళ్లాడు. మూడేళ్లు ప్రైవేటు ఉద్యోగం చేశాడు. కరోనా నేపథ్యంలో ఉద్యోగం పోవడంతో స్వగ్రామానికి వచ్చాడు. ఎస్టీ కార్పొరేషన్ లోన్ ప్రకటన రావడంతో కిరాణా లేదా ఇతర వ్యాపారం చేసుకుందామని దరఖాస్తు చేశాడు. ప్రభుత్వం నుంచి మండలానికి 5 యూనిట్లు మాత్రమే మంజూరు కాగా, శుక్రవారం మండల పరిషత్‌లో లక్కీ డ్రా తీశారు.
అందులో 21 మేకల యూనిట్ (విలువ రూ.1.40 లక్షలు) మంజూరైంది. కాగా, ఏళ్ల తరబడి ఎదురుచూసి కార్పొరేషన్ రుణాల కోసం దరఖాస్తు చేసుకుంటే.. పనికి రాని 5 యూనిట్లు మాత్రమే ఎలా మంజూరు చేస్తారని ఎస్టీ కార్పొరేషన్ దరఖాస్తుదారులు ఎంపీడీవో కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. 2 యూనిట్ల మేకలు, 2 యూనిట్లు బోర్‌వెల్, ఒక యూనిట్ తైవాన్ పంపు మంజూరయ్యాయని, డ్రాలో పేరు వచ్చిన వారికి ఇస్తామని అధికారులు చెప్పడంతో మండిపడ్డారు. వ్యాపారం, ట్రాక్టర్, ఇతరాలకు దరఖాస్తు చేసుకుంటే డ్రా ఎలా తీస్తారని ఆందోళనకు దిగారు.