టీకాలకు గ్లోబల్ టెండర్లు
ABN , First Publish Date - 2021-05-20T08:13:24+05:30 IST
కొవిడ్ టీకాల కోసం తెలంగాణ ప్రభుత్వం గ్లోబల్ టెండర్లను ఆహ్వానించింది.

- 6 నెలల్లో కోటి డోసులివ్వాలని షరతు
- ప్రతి నెలా 15-20 లక్షల సరఫరా
- 2-8 డిగ్రీల ఉష్ణోగ్రతలో వ్యాక్సిన్ల నిల్వ
- టెండర్లు పిలిచిన రాష్ట్ర ప్రభుత్వం
హైదరాబాద్, మే 19 (ఆంధ్రజ్యోతి): కొవిడ్ టీకాల కోసం తెలంగాణ ప్రభుత్వం గ్లోబల్ టెండర్లను ఆహ్వానించింది. ఈ మేరకు బుధవారం తెలంగాణ రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీఎస్‌ఎంఎ్‌సఐడీసీ) షార్ట్ టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో భాగంగా మొత్తం కోటి డోసులు కొనుగోలు చేయనుంది. ఈ కోటి డోసులను కేవలం ఆరు నెలల వ్యవధిలోనే సరఫరా చేయాలని కంపెనీలకు షరతు విధించింది. ప్రతి నెలా 15-20 లక్షల డోసులు సరఫరా చేయాల్సి ఉంటుందని టెండరులో పేర్కొంది. గ్లోబల్ టెండర్లలో పాల్గొనే కంపెనీలు ఈ నెల 21 నుంచి ఆన్‌లైన్‌లో టెండర్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడంతో పాటు అప్‌లోడ్ చేసుకోవచ్చని సూచించింది. టెండర్ల ప్రక్రియలో పాల్గొనేందుకు జూన్ 4 సాయంత్రం ఆరు గంటల వరకూ అవకాశం ఇచ్చారు. అంటే 15 రోజుల వ్యవధి. గ్లోబల్ టెండర్లకు సంబంధించి ప్రీ బిడ్డింగ్ సమావేశం ఈ నెల 26న నిర్వహించనున్నట్లు టీఎ్‌సఎంఎ్‌సఐడీసీ వెల్లడించింది. కాగా ఫైనాన్షియల్ బిడ్స్‌ను ఎప్పుడు ఓపెన్ చేస్తారో తర్వాత తెలియజేస్తామని ఆ టెండరులో పేర్కొంది. కాగా తక్కువగా కోట్ చేసిన కంపెనీకి టీకా సరఫరా బాధ్యతలను అప్పగించనున్నారు.
ఇవీ షరతులు..
2-8 డిగ్రీల ఉష్ణోగ్రతలో నిల్వ చేసుకునే వీలున్న వ్యాక్సిన్ అయి ఉండాలి.
టెండరు ఓకే అయ్యాక టీకాలు 7 నుంచి 30 రోజుల్లో పంపాలి.
ప్రతి నెలా 15-20 లక్షల డోసుల చొప్పున ఆరు నెలల్లో కోటి డోసులు సరఫరా చేయాలి.
స్పందన ఉంటుందా?
వ్యాక్సిన్ కోసం ప్రభుత్వం గ్లోబల్ టెండర్లు పిలవడం బాగానే ఉంది. కానీ దీనికి ఎంతవరకు స్పందన వస్తుందనేది అనుమానంగా కనిపిస్తోంది. దేశంలో ప్రస్తుతం రెండే కంపెనీలు (సీరం, భారత్ బయోటెక్) టీకా ఉత్పత్తి చేస్తున్నాయి. వాటితో పాటు రష్యాకు చెందిన స్పుత్నిక్‌కు భారత ఔషధ నియంత్రణ మండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మూడు తప్ప మరో కంపెనీ గ్లోబల్ టెండర్లలో పాల్గొనే అవకాశం లేదు. ఎందుకంటే కేంద్రం అనుమతి పొందిన కంపెనీలు మాత్రమే టీకాలు సరఫరా చేయాల్సి ఉంటుంది. మోడర్నా, ఫైజర్, జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీలు కూడా ఇండియాకు టీకాలు ఇచ్చే అవకాశం ఉందని చెబుతున్నా అందుకు సమయం పట్టేలా కనిపిస్తోంది. ఆ కంపెనీల నుంచి టీకాలను దిగుమతి చేసుకునేందుకు వారితో చర్చలు జరుపుతున్నట్లు కేంద్రం మే 9న సుప్రీంకోర్టుకు ఇచ్చిన అఫిడవిట్‌లో పేర్కొంది. ఇక.. ప్రస్తుతం మనదగ్గర ఉత్పత్తి అవుతున్న కొవిషీల్డ్, కొవాగ్జిన్‌లలో సగం కేంద్రమే తీసుకుంటోంది.
మిగిలిన సగంలో 30 శాతం అన్ని రాష్ట్రాలకు, మిగిలిన 20 శాతం ప్రైవేటు ఆస్పత్రులకు కంపెనీలు విక్రయిస్తున్నాయి. రాష్ట్రాలకు కేటాయించిన 30 శాతంలో కూడా కేంద్రం ఆయా రాష్ట్రాలకు ఇన్నేసి డోసులని కేటాయిస్తోంది. ఆ ప్రకారమే రాష్ట్రాలు డబ్బులు చెల్లిస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో గ్లోబల్ టెండర్ల ద్వారా టీకాల సేకరణ ఏ మేరకు సాధ్యం అవుతుందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దేశంలో ఇప్పటికే ఐదారు రాష్ట్రాలు టీకా కోసం గ్లోబల్ టెండర్లకు వెళ్లాయి. కొద్దిరోజుల్లో ఆయా రాష్ట్రాలు పిలిచిన టెండర్లలో ఎన్ని కంపెనీలు పాల్గొన్నాయి? వాటి పరిస్థితి ఏంటనే విషయంపై ఒక స్పష్టత వస్తుంది. దాన్ని బట్టి తెలంగాణ సర్కారు పిలిచిన టెండర్లు కూడా ఏమవుతాయో తెలుస్తుంది.