అనాథలా హరిభూషణ్కు అంత్యక్రియలా?
ABN , First Publish Date - 2021-06-26T09:09:50+05:30 IST
దండకారణ్యంలో కరోనాతో మృతి చెందిన మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి హరిభూషణ్ అలియాస్ యాప నారాయణ మృత దేహాన్ని అప్పగించి ఉంటే బాగుండేదని ఆయన కుటుంబసభ్యులు పేర్కొన్నారు.
మావోయిస్టు పార్టీపై కుటుంబీకుల ఆగ్రహం
గంగారం, జూన్ 25: దండకారణ్యంలో కరోనాతో మృతి చెందిన మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి హరిభూషణ్ అలియాస్ యాప నారాయణ మృత దేహాన్ని అప్పగించి ఉంటే బాగుండేదని ఆయన కుటుంబసభ్యులు పేర్కొన్నారు. అనాథ శవానికి చేసినట్లుగా మావోయిస్టులు దహన సంస్కారాలు చేయడంపై మండిపడుతున్నారు. హరిభూషణ్ మృతి చెందినట్లుగా గురువారం మావోయిస్టులు జగన్ పేరుతో ప్రకటించడంతో ఆయన కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయారు. హరిభూషణ్ మరణ వార్తను ఇప్పటికీ నమ్మలేకపోతున్నామని వారు తెలిపారు. మావోయిస్టులు ప్రకటించిన లేఖలో భాష తేడా ఉందని, హరిభూషణ్ మృతదేహం ఫొటో చిరునవ్వుతో ఉందని అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.
ఆయన నిజంగా చనిపోయి ఉంటే మృతదేహాన్ని కుటుంబంలో ఏ ఒక్కరికైనా చూపించాలి లేదా మృతదేహాన్ని తమకు పంపించాలి కదా అని వారంటున్నారు. ఎంతో రహస్యంగా ఉండే మావోయిస్టు దళాల సమాచారం పోలీసులు ఎలా ముందే తెలుసుకొని హరిభూషణ్ మరణవార్త ప్రకటించారని కుటుంబీకులు ప్రశ్నిస్తున్నారు. ఇందులో ఏదో రహస్యం దాగి ఉందని అనుమానిస్తున్నారు. కడసారి చూపునకు కూడా నోచుకోకుండా మావోయిస్టులు అడవిలోనే దహనసంస్కారాలు చేయడం సరికాదని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. హరిభూషణ్ మరణ వార్త జీర్ణించుకోలేని సోదరి భారతి ఆయన ఫొటో ఎదుట గుండెలవిసేలా ఏడ్చి సొమ్మసిల్లి పడిపోయిన ఘటన పలువురిని కంటతడి పెట్టించింది.