పోరాట కెరటం ‘పడాల’

ABN , First Publish Date - 2021-08-26T05:16:17+05:30 IST

మహాత్మాగాంధీ పిలుపు మేరకు క్విట్‌ ఇండియా ఉద్యమంలో పాలు పంచుకొని, జైలు జీవితం గడిపాడు.. నిజాం నిరంకుశ పాలనపై తుపాకీ ఎక్కుపెట్టాడు.. ఏకంగా పోలీ్‌సస్టేషన్‌పైనే దాడిచేసి, తుపాకులు ఎత్తుకొచ్చాడు.. రజాకార్లతో పోరాటం చేసి సింహస్వప్నంగా నిలిచాడు... కాలులో తుపాకీ బుల్లెట్‌తోనే జీవితం గడిపాడు.. ఆయనే ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు పడాల చంద్రయ్య.

పోరాట కెరటం ‘పడాల’
దత్తాత్రేయ ఆవిష్కరించనున్న పడాల చంద్రయ్య విగ్రహం

నిజాం నిరంకుశత్వానికి ఎదురొడ్డిన యోధుడు

జీవిత పర్యంతం ప్రజల కోసమే తపన

నేడు ముల్కనూర్‌లో విగ్రహావిష్కరణ

హాజరుకానున్న హరియాణ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ


భీమదేవరపల్లి, ఆగస్టు 25 : మహాత్మాగాంధీ పిలుపు మేరకు క్విట్‌ ఇండియా ఉద్యమంలో పాలు పంచుకొని, జైలు జీవితం గడిపాడు.. నిజాం నిరంకుశ పాలనపై తుపాకీ ఎక్కుపెట్టాడు.. ఏకంగా పోలీ్‌సస్టేషన్‌పైనే దాడిచేసి, తుపాకులు ఎత్తుకొచ్చాడు.. రజాకార్లతో పోరాటం చేసి సింహస్వప్నంగా నిలిచాడు...  కాలులో తుపాకీ బుల్లెట్‌తోనే జీవితం గడిపాడు.. ఆయనే ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు పడాల చంద్రయ్య.  జీవిత పర్యంతం ప్రజల కోసమే తపించిన చంద్రయ్య ఎందరికో స్ఫూర్తి ప్రదాత. 2018 జూలై 25న కన్నుమూసిన ఆయన స్మృతిలో ముల్కనూర్‌లో విగ్రహం ఏర్పాటుచేశారు.  హర్యానా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ చేతులమీదుగా గురువారం విగ్రహావిష్కరణ జరగనుంది.  

భీమదేవరపల్లి మండలం ముల్కనూర్‌కు చెందిన పడాల లక్ష్మీనర్సయ్య-అంబమ్మ దంపతులకు 1927లో చంద్రయ్య జన్మించారు. 1942లో హనుమకొండలో 8వ తరగతి చదువుతుండగా  భూపతి కృష్ణమూర్తి, కొండపల్లి లక్ష్మీనర్సింహారావు, ఎంఎస్‌ రాజలింగంల స్ఫూర్తితో  గాంధీ పిలుపుమేరకు క్విట్‌ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు.  వరంగల్‌ సెంట్రల్‌ జైలులో నెల రోజుల పాటు జైలు శిక్షను అనుభవించారు.  హైదరాబాద్‌లో జరిగిన ఆంధ్రా మహాసభ కాంగ్రెస్‌ సభలో పాల్గొని తన స్నేహితులు అనేక మందిని స్వాతంత్య్ర పోరాటం పాల్గొనేలా చేశారు. 

 బ్రిటీషు పోలీసులు, రజాకార్ల నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా జెండా వందనాలు, ఊరేగింపులు, ప్రభాతభేరిలు, సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొన్నారు. నిజాం ప్రభుత్వ పాలన నుంచి హైదరాబాద్‌ విముక్తి కోసం పోరాడారు.  కాంగ్రెస్‌, కమ్యూనిస్టు కార్యకర్తలకు సాయుధ పోరాటంలో శిక్షణ ఇచ్చారు. చాందా బార్డర్‌ క్యాంపులో, నాగ్‌పూర్‌ మిలటరీ కంటోన్మోంట్‌లో సాయుధ శిక్షణ తీసుకున్న చంద్రయ్య పోల్సాని నర్సింగారావు, బి.వెంకటయ్యలతో కలిసి హుజూరాబాద్‌ తాలుకాలోని రాయికల్‌ పోలీ్‌సస్టేషన్‌పై దాడి చేశాడు. తుపాకులను ఎత్తుకొచ్చి పోలీసు రికార్డులను ధ్వంసం చేశారు. ఆదిలాబాద్‌ జిల్లా వీరుర్‌ (ప్రస్తుతం మహారాష్ట్రలో ఉంది) పోలీ్‌సస్టేషన్‌పై దాడి చేయగా దాడిలో ఇద్దరు పోలీసులు మృతి చెందారు. ఆ సమయంలోనే పోలీసులు జరిపిన ఎదురు కాల్పుల్లో పడాల చంద్రయ్య కాలులో బుల్లెట్‌ దిగింది.  చనిపోయే రోజు వరకు కూడా బుల్లెట్‌ ఆయన కాలులోనే ఉండిపోయింది. కాగా, 91 ఏళ్ల వయస్సులో పడాల చంద్రయ్య ముల్కనూరులో కన్నుమూశారు. ఆయన పార్థివదేహ్నాన వరంగల్‌ కాకతీయ మెడికల్‌ కాలేజీకి ఆయన కుమారులు పడాల గౌతమ్‌, పడాల ప్రభాకర్‌లు అందించారు. అంతకుముందు చంద్రయ్య భార్య వెంకటలక్ష్మి 2003లో మృతి చెందగా ఆమె పార్థివదేహాన్ని కూడా మెడికల్‌ కాలేజీకి అందించారు.


నేడు చంద్రయ్య విగ్రహావిష్కరణ

ముల్కనూర్‌లో పడాల చంద్రయ్య విగ్రహావిష్కరణ గురువారం హర్యానా గవర్నరల్‌ బండారు దత్తాత్రేయ చేతులమీదుగా జరిపేందుకు ఏర్పాట్లు పూర్తిచేశారు.  చంద్రయ్యతో ఉన్న అనుబంధానికి గుర్తుగా దత్తాత్రేయ ప్రత్యేకంగా వస్తున్నారు.  విగ్రహావిష్కరణ కార్యక్రమంలో హుస్నాబాద్‌ ఎమ్మెల్యే వొడితెల సతీ్‌షకుమార్‌, రాజ్యసభ సభ్యులు కెప్టెన్‌ లక్ష్మీకాంతారావు, బండా ప్రకాష్‌, కరీంనగర్‌ పార్లమెంట్‌ సభ్యుడు బండి సంజయ్‌, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీ్‌షరావు, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌, జడ్పీ చైర్మన్‌ సుధీర్‌కుమార్‌, ఎమ్మెల్సీలు టి.జీవన్‌రెడ్డి, సురభి వాణీదేవి, మల్లేశం, మాజీ పార్లమెంట్‌ సభ్యుడు పొన్నం ప్రభాకర్‌, మాజీ ఎమ్మెల్యేలు అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి, ఇనుగాల పెద్దిరెడ్డి, చాడ వెంకట్‌రెడ్డి, కావేరి సీడ్స్‌ ఎండీ గుండవరపు భాస్కర్‌రావు, టీజెఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు కోదండరామ్‌, ధరణి ఓఎ్‌సడీ, వేముల శ్రీనివాస్‌ తదితరులు పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు.



Updated Date - 2021-08-26T05:16:17+05:30 IST