మాజీ మంత్రి ఫరీదుద్దీన్‌ కన్నుమూత

ABN , First Publish Date - 2021-12-30T07:42:47+05:30 IST

మాజీ మంత్రి, టీఆర్‌ఎస్‌ నేత మహమ్మద్‌ ఫరీదుద్దీన్‌

మాజీ మంత్రి ఫరీదుద్దీన్‌ కన్నుమూత

  •  కొంత కాలంగా కాలేయ సంబంధిత సమస్యలు
  •  హైదరాబాద్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస 
  •  సీఎం కేసీఆర్‌, మంత్రి హరీశ్‌రావు సంతాపం

హైదరాబాద్‌ సిటీ/జహీరాబాద్‌/సంగారెడ్డి అర్బన్‌, డిసెంబరు 29: మాజీ మంత్రి, టీఆర్‌ఎస్‌ నేత మహమ్మద్‌ ఫరీదుద్దీన్‌(64) హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలోని ఏఐజీ అస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. కొన్ని రోజులుగా కాలేయ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన డిసెంబరు 15న అస్పత్రిలో చేరారు. ఆయనకు ఆస్పత్రిలో కాలేయ మార్పిడి శస్త్రచికిత్స జరిగింది. ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో బుధవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు.


సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ మండలంలోని హోతి(బి) గ్రామానికి చెందిన ఫరీదుద్దీన్‌ 1959, అక్టోబరు 14న జన్మించారు. ఆయన తండ్రి ఎండీ ఫక్రొద్దీన్‌ ఉపాధ్యాయుడు. బీకాం వరకు చదివిన ఫరీదుద్దీన్‌ 1978లో కాంగ్రె్‌సలో క్రియాశీల సభ్యత్వం తీసుకున్నారు. వృత్తి పరంగా ఫరీదుద్దీన్‌ ఏవన్‌ కాంట్రాక్టర్‌. ఆయన మొదట సర్పంచుగా, అనంతరం జహీరాబాద్‌ వైస్‌ ఎంపీపీగా 1985 నుంచి 90 వరకు పనిచేశారు. 1992-1995 వరకు పీఏసీఎస్‌ ఇప్పెపల్లి సొసైటీకి చైర్మన్‌గా సేవలందించారు. 1990-1999 వరకు కాంగ్రెస్‌ జహీరాబాద్‌ మండలాధ్యక్షుడిగా పనిచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో 1999, 2004 ఎన్నికల్లో జహీరాబాద్‌ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2004లో సీఎం రాజశేఖర్‌రెడ్డి కేబినేట్‌లో మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత జహీరాబాద్‌ నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్‌ కావడంతో హైదరాబాద్‌లోని అంబర్‌పేట్‌ నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓడిపోయారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం టీఆర్‌ఎ్‌సలో చేరారు.




2016లో ఎమ్మెల్యేల కోటలో ఫరీదుద్దీన్‌ ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఫరీదుద్దీన్‌ ఎమ్మెల్సీ పదవీకాలం 2021, జూలై 3న ముగిసింది. అనంతరం టీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కొనసాగారు. ఫరీదుద్దీన్‌ మరణం పట్ల సీఎం కేసీఆర్‌, మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్‌ సంతాపం వ్యక్తం చేశారు. ఫరీదుద్దీన్‌ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. 


Updated Date - 2021-12-30T07:42:47+05:30 IST