దళిత బంధుకు నిధులెలా తెస్తారు?

ABN , First Publish Date - 2021-08-20T09:26:32+05:30 IST

‘‘ప్రభుత్వం ఏదైనా పథకం తెస్తే రాష్ట్రమంతా అమలు చేయాలి. కానీ, హుజూరాబాద్‌ ఉప ఎన్నిక కోసమే, కుళ్లు బుద్ధితో నన్ను ఓడించేందుకు దళితబంధు తెచ్చారు. సీఎం

దళిత బంధుకు నిధులెలా తెస్తారు?

ఆదాయమెంత.. జీతాలు, అప్పులకు పోయేదెంత

నన్ను ఓడించేందుకే ఆ పథకం తెచ్చారు

దమ్ముంటే రాష్ట్రమంతా  అమలు చేయండి

ఇండియా టుడే సర్వే చూసైనా సీఎం కేసీఆర్‌ మారాలి: ఈటల


హుజూరాబాద్‌, ఆగస్టు 19: ‘‘ప్రభుత్వం ఏదైనా పథకం తెస్తే రాష్ట్రమంతా అమలు చేయాలి. కానీ, హుజూరాబాద్‌ ఉప ఎన్నిక కోసమే, కుళ్లు బుద్ధితో నన్ను ఓడించేందుకు దళితబంధు తెచ్చారు. సీఎం కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రమంతా దళితబంధు ఒకేసారి అమలు చేయాలి’’ అని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్‌ డిమాండ్‌ చేశారు. గురువారం కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘రూ.1.7 లక్షల కోట్లు దళిత బంధుకు అవసరమని మీరే చెప్పారు. కానీ రూ.2 లక్షల కోట్లు దాటుతుంది. ఇన్ని నిధులు ఖజానాలో ఉన్నాయా..? రాష్ట్ర బడ్జెట్‌లో ఏటా జీతభత్యాలు రూ.40 వేల నుంచి రూ.45 వేల కోట్లు.. తెచ్చిన అప్పులకు వడ్డీ, అసలు కలిపి రూ.56 వేల కోట్లు(ఏటేటా పెరుగుతుంది) కావాలి. ఈ రెండు కలిపే రూ.లక్ష కోట్లు దాటుతుంది. రైతుబంధు, కరెంటు సబ్సిడీ, బియ్యం సబ్సిడీ, కేసీఆర్‌ కిట్స్‌ కోసం మరో రూ.35 వేల కోట్లు కావాలి. మరి మన ఆదాయమెంత..? ఇవన్నీ పోనూ మిగిలేదెంత..? మరి దళిత బంధుకు డబ్బులు ఎక్కడి నుంచి తెస్తారు..? అన్ని ఖర్చులు పోనూ.. దళిత బంధుకు కనీసం రూ.10 కోట్లైనా కేటాయించే సత్తా మీకుందా? కేవలం దళితుల ఓట్ల మీద ప్రేమతో హైటెక్‌ సిటీ దగ్గర భూములు అమ్మి, ఆ పైసలను ఇక్కడ ఖర్చు చేస్తున్నారు.


వాసాలమర్రిలో వచ్చిన డబ్బులే వాళ్లకు ముట్టలేదు.. ఆ డబ్బులు ఇంకా కలెక్టర్‌ దగ్గరే ఉన్నాయని తెలిసింది. హుజూరాబాద్‌లో నిధుల విడుదలకు ఇచ్చే లెటర్లు కూడా ఉత్త లెటర్లుగా ఉంటాయా..? అన్న అనుమానం ఉంది. ఎనిమిదేళ్లుగా లేనిది.. దళితజాతి మీద మీకు హఠాత్తుగా ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చిందో అందరికీ తెలుసు. సీఎంవోలో ఇన్నేళ్లుగా ఒక్క ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఐఏఎస్‌ అధికారి లేరని గతంలోనే అడిగా.. ఇప్పుడు ఉప ఎన్నిక కోసం రాహుల్‌ బొజ్జాకు సీఎంవోలో స్థానం ఇచ్చారు. నా రాజీనామా వల్ల ఇన్ని ఫలితాలు వస్తున్నందుకు గర్వంగా ఉంది. ఎస్టీ, బీసీ, మైనారిటీ అధికారులకు కూడా సీఎంవోలో స్థానం ఇవ్వాలి’’ అని ఈటల డిమాండ్‌ చేశారు. సీఎం కేసీఆర్‌ ప్రతిష్ఠ అథః పాతాళానికి పడిపోయిందని ఇండియా టుడే సర్వే చెప్పిందని, దానిని చూసైనా ఆయన మారాలని అన్నారు.


సీఎం ఊరూరా తిరిగినా గెలవరు..

‘‘దమ్ముంటే ప్రజాస్వామిక పద్ధతిలో ఎన్నికలు జరపండి. మీకు ఎన్ని ఓట్లు వస్తాయో..? మాకు ఎన్ని వస్తాయో..? తెలుస్తుంది. మళ్లీ హుజూరాబాద్‌కు వస్తానని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. స్థాయిని తగ్గించుకొని మండలాల్లో తిరుగుతానని చెబుతున్నారు. ఊరూరు తిరిగినా.. ప్రజాస్వామ్య పద్ధతిలో వ్యవహరిస్తే మీకు డిపాజిట్‌ కూడా రాదు. కేసీఆర్‌ జీవితంలో ఏనాడైనా జై భీం నినాదం ఇచ్చారా..? ఇప్పుడు ఇస్తున్నారు. ఏడేళ్లలో లేనిది ఇప్పుడు అంబేద్కర్‌, జగ్జీవన్‌రాం విగ్రహానికి తొలిసారిగా ఆయన దండలు వేస్తున్నారు. ఆకునూరి మురళి, ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ లాంటి వాళ్లు ఎందుకు రాజీనామా చేశారు. ప్రవీణ్‌కుమార్‌ మూడేళ్లుగా డైట్‌ ఛార్జీలు రావడం లేదని, ఇన్‌ఫ్రాస్టక్చర్‌ కొనడం లేదని రాజీనామా చేశారు..’’ అని ఈటల పేర్కొన్నారు. 

Updated Date - 2021-08-20T09:26:32+05:30 IST