వేర్వేరు సంఘటనల్లో..ఇద్దరు విద్యార్థినుల బలవన్మరణం
ABN , First Publish Date - 2021-03-24T08:19:46+05:30 IST
వేర్వేరు సంఘటనల్లో ఇద్దరు విద్యార్థినులు బలవన్మరణానికి పాల్పడ్డ ఉదంతాలివి.

అన్వర్-ఉల్-ఉలూమ్ భవనం పైనుంచి దూకిన షిఫానాజ్..
హాస్టల్ భవనం పైనుంచి దూకిన చంద్రిక
మంగళ్‌హాట్, పేట్‌బషీరాబాద్, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): వేర్వేరు సంఘటనల్లో ఇద్దరు విద్యార్థినులు బలవన్మరణానికి పాల్పడ్డ ఉదంతాలివి. ఒకరు అన్వర్-ఉల్-ఉలూమ్ కళాశాల నాలుగో అంతస్తు పైనుంచి దూకగా.. మరో విద్యార్థిని తాను ఉంటున్న హాస్టల్ భవనం నాలుగో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఓల్డ్ మల్లేపల్లి ఫీల్‌ఖానా ప్రాంతానికి చెందిన ఎంఏ సయీద్, నుస్రత్‌ల కుమార్తె షిఫానాజ్(17) మల్లేపల్లిలోని అన్వర్-ఉల్-ఉలూం కళాశాలలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతోంది. చదువుల్లో చురుగ్గా ఉండే షిఫా.. మంగళవారం సాయంత్రం కళాశాల భవనం నాలుగో అంతస్తు పైనుంచి దూకి, ఆత్మహత్యకు యత్నించింది. తల భాగంలో తీవ్ర గాయాలైన ఆమెను నాంపల్లిలోని కేర్ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతిచెందింది.
షిఫా ఆత్మహత్యకు ఇంకా కారణాలు తెలియరాలేదని.. ప్రేమ వ్యవహారం ఏమైనా కారణమా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. మరో సంఘటనలో.. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా మైసమ్మగూడలోని మల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో చివరి సెమిస్టర్ చదువుతున్న చంద్రిక(25).. హాస్టల్ భవనం పైనుంచి దూకి, ఆత్మహత్య చేసుకుంది. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం శ్రీరాంపూర్ గ్రామానికి చెందిన చంద్రిక.. ఫిబ్రవరి 4న పరీక్షల నిమిత్తం కాలేజీకి వచ్చింది. మైసమ్మగూడలోని ఓ హాస్టల్‌లో ఉంటూ.. పరీక్షలకు హాజరయ్యేది. సోమవారం రాత్రి భోజనం చేసిన తర్వాత.. ఫోన్ రావడంతో భవనంపైకి వెళ్లిందని తోటి విద్యార్థులు తెలిపారు. మంగళవారం ఉదయం 6 గంటల సమయంలో.. చంద్రిక మృతదేహం హాస్టల్ కింద ఉండడంతో స్థానికులు, విద్యార్థులు పోలీసులకు సమాచారం అందించారు. నాలుగో అంతస్తు నుంచి చంద్రిక కిందకు దూకినట్లు సీసీటీవీ ఫుటేజీ ద్వారా పోలీసులు గుర్తించారు.