హైదరాబాద్‌లో ‘ఫ్లో కెమిస్ట్రీ’ ఇన్నొవేషన్ హబ్
ABN , First Publish Date - 2021-11-26T08:34:41+05:30 IST
ఫార్మా రంగంలో పరిశోధన, అభివృద్ధి కోసం హైదరాబాద్‌లో ‘ఫ్లో కెమిస్ట్రీ ఇన్నొవేషన్ టెక్నాలజీ హబ్’ ను ఏర్పాటు చేయనున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు.

ఫార్మా రంగంలో పరిశోధన, అభివృద్ధి కోసం: కేటీఆర్
హైదరాబాద్, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): ఫార్మా రంగంలో పరిశోధన, అభివృద్ధి కోసం హైదరాబాద్‌లో ‘ఫ్లో కెమిస్ట్రీ ఇన్నొవేషన్ టెక్నాలజీ హబ్’ ను ఏర్పాటు చేయనున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్ నగరంలో ఉన్న డాక్టర్ రెడ్డీస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లైఫ్ సైన్సెస్ (డ్రిల్స్) లో ఆ సంస్థ సంయుక్త భాగస్వామ్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ హబ్‌ను ఏర్పాటు చేస్తుందని మంత్రి పేర్కొన్నారు. దీనికి సంబంధించి డ్రిల్స్, రాష్ట్ర ప్రభుత్వం మధ్య పరస్పర అవగాహన ఒప్పందం గురువారం ప్రగతిభవన్‌లో కేటీఆర్ సమక్షంలో జరిగింది. ఈ కేంద్రం ఏర్పాటుకు నిధులను డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్, లౌరుస్ ల్యాబ్స్ సమకూర్చనున్నాయి. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ఫ్లో కెమిస్ట్రీ ఇన్నొవేషన్ టెక్నాలజీ హబ్‌కు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని, ఇందులో ఎక్కువ పరిశ్రమలు భాగస్వామ్యం అయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారు. రెడ్డీస్ ల్యాబొరేటరీస్ ఎండీ జీవీ ప్రసాద్ మాట్లాడుతూ ఫార్మా రంగాన్ని పర్యావరణ అనుకూల తయారీ పరిశ్రమగా మార్చేందుకు తమ సంస్థ కట్టుబడి ఉందన్నారు.