ఫ్లెక్సీలపై కేటీఆర్ అప్పుడు ఏం చెప్పారు?.. ఇప్పుడేం జరుగుతోంది?
ABN , First Publish Date - 2021-10-25T07:46:35+05:30 IST
‘రాజకీయ నాయకులు తమ ముఖాలను తామే చూసుకోవడానికే ఫ్లెక్సీలు పనికొస్తాయి. ఫ్లెక్సీలు పెట్టినంత మాత్రాన లీడర్స్ కారు. ప్లాస్టిక్ అనేది భూతం. అది మనల్ని వెంటాడుతుంది. దానిపై యుద్ధం చేయాలి.

- నగరంలో ఎటు చూసినా ఫ్లెక్సీలు, హోర్డింగులే
- టీఆర్‌ఎస్ ప్లీనరీ సందర్భంగా భారీగా ఏర్పాటు
- గతంలో తీవ్రంగా నిరసించిన మంత్రి కేటీఆర్
- ఇప్పుడు ఫిర్యాదుకూ చాన్స్ లేదని జనం ఆక్షేపణ
హైదరాబాద్, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): ‘‘రాజకీయ నాయకులు తమ ముఖాలను తామే చూసుకోవడానికే ఫ్లెక్సీలు పనికొస్తాయి. ఫ్లెక్సీలు పెట్టినంత మాత్రాన లీడర్స్ కారు. ప్లాస్టిక్ అనేది భూతం. అది మనల్ని వెంటాడుతుంది. దానిపై యుద్ధం చేయాలి. ఫ్లెక్సీలు పెట్టడాన్ని నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా. వాటిని టీఆర్‌ఎస్ కార్యకర్తలు పెట్టినా సరే! ఫ్లెక్సీ పెట్టినందుకు మీ (ఇల్లందు మునిసిపల్ చైర్‌పర్సన్)కు రూ.లక్ష ఫైన్ వేస్తున్నా’’.. గత ఏడాది మార్చి 2న ఇల్లందు పర్యటన సందర్భంగా పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలివి. అప్పుడు మాత్రమే కాదు.. తర్వాత కూడా పలుమార్లు ఫ్లెక్సీలపై మంత్రి కేటీఆర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఫ్లెక్సీల వాడకం చాలా పెరిగిపోయిందని, ఈ సంస్కృతిని పూర్తిగా నిర్మూలించాలని స్పష్టం చేశారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో పర్యటనకు వెళ్లిన సందర్భంలోనూ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసిన పలువురు కార్పొరేటర్లకు జరిమానా వేయాలని పలుమార్లు ఆదేశించారు. ‘‘కొత్త సంవత్సరంలో సరికొత్తగా ముందుకు వెళ్లాలని నిర్ణయించాం. జనవరి ఒకటి నుంచి నగరంలో గోడలపై రాతలు; ఫ్లెక్సీలు, కటౌట్లు, బ్యానర్లు కనిపిస్తే పబ్లిక్ డీఫే్‌సమెంట్ యాక్ట్‌ను కచ్చితంగా అమలు చేస్తాం. ఉల్లంఘనకు పాల్పడితే అధికార పక్షం వారినీ వదలం’’ అని అధికారులకు తేల్చి చెప్పారు.
అంతేనా, 2018లో కార్పొరేటర్ సుచరిత రెడ్డి ఇలా ఫ్లెక్సీ పెట్టినందుకు రూ.50 వేల జరిమానా విధించాలని అధికారులకు ఆదేశించారు. ఇటీవల కాంగ్రెస్ నేత పాడి కౌశిక్ రెడ్డి టీఆర్‌ఎ్‌సలో చేరిన సందర్భంగా తెలంగాణ భవన్ వద్ద ఫ్లెక్సీలు పెడితే ఆయనకూ జరిమానా విధించారు. అంతేనా, తన పుట్టిన రోజు సందర్భంగా ఫ్లెక్సీలు, హోర్డింగులు కట్టవద్దని కోరారు. అయితే, సోమవారం హైటెక్స్‌లో టీఆర్‌ఎస్ ప్లీనరీ సందర్భంగా నగరమంతా ఎటు చూసినా పెద్దఎత్తున ఫ్లెక్సీలు, హోర్డింగులు, బ్యానర్లు తదితరాలను ఏర్పాటు చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. అధికార పార్టీ నేతలు పోటీపడి మరీ అడుగుకో ఫ్లెక్సీని పెట్టారు. కూడళ్ల వద్ద ఉన్న ప్రముఖుల విగ్రహాలను సైతం వదల్లేదు. అవి కనిపించకుండా గులాబీ తోరణాలను కట్టేశారు. ఫ్లెక్సీలు, కటౌట్లకు వ్యతిరేకమని, వాటిని ఏర్పాటు చేస్తే కేసులు, జరిమానాలు తప్పవని తేల్చి చెప్పిన వారే ఇప్పుడు ఉల్లంఘించడం ఏంటని గ్రేటర్ వాసులు ప్రశ్నిస్తున్నారు. దీనిపై ఫిర్యాదు చేసే అవకాశం కూడా లేకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

