ఫీజుల్లేక క్లోజ్!
ABN , First Publish Date - 2021-01-20T08:17:16+05:30 IST
బోధన బకారులను (ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షి్‌పలు) ప్రభుత్వం చెల్లించకపోవడంతో ప్రైవేటు కాలేజీల మనుగడ, అందులో పనిచేస్తున్న అధ్యాపకుల ఉపాధి

పేరుకుపోయిన రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలు
అధ్యాపకులకు జీతాల్లేవ్.. వీధిన పడుతున్న కుటుంబాలు
కాలేజీల మనుగడ ప్రశ్నార్థకం..
ఇప్పటికే 123 జూనియర్, 78డిగ్రీ కాలేజీల మూత
హైదరాబాద్, జనవరి 19 (ఆంధ్రజ్యోతి): బోధన బకారులను (ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షి్‌పలు) ప్రభుత్వం చెల్లించకపోవడంతో ప్రైవేటు కాలేజీల మనుగడ, అందులో పనిచేస్తున్న అధ్యాపకుల ఉపాధి ప్రశ్నార్థకంగా మారింది. కరోనా, లాక్‌డౌన్ పరిస్థితుల కారణంగా అటు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఫీజులు కట్టే పరిస్థితులు లేకపోవడంతో నిర్వహించే స్థోమత లేక కాలేజీ నిర్వాహకులు చేతులెత్తేస్తున్నారు. జూనియర్, డిగ్రీ కాలేజీల్లో కొన్ని ఇప్పటికే మూతపడ్డాయి. మరికొన్ని బాటలో ఉన్నాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షి్‌పలకు సంబంధించి నిధులు విడుదల కాకపోవడంతో సిబ్బందికి యాజమాన్యాలు జీతాలివ్వడం లేదు. దీంతో అధ్యాపకులు, వారి మీదే ఆధారపడి బతుకున్న కుటుంబాల పరిస్థితి దుర్భరంగా మారింది. రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షి్‌షల బకాయిలు రూ.3వేల కోట్లు దాటాయి. నిరుటి బకాయిలు రూ.870 కోట్లు ఉంటాయని అధికారులు చెబుతున్నారు. పాతవి, ఈ విద్యాసంవత్సరానివి కలిపి 2,400 కోట్ల దాకా ఉంటాయి. మొత్తం బకాయిలు రూ.3,270 కోట్లు ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా స్కాలర్‌షి్‌పలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు అర్హులైనవారు 14 లక్షల మంది విద్యార్ధులున్నారు. వీరంతా ఇంటర్, డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్, ఎంసీఏ, ఎంబీఏ కోర్సులు చదువుతున్నారు.
2008లో బలహీన వర్గాల విద్యార్ధుల కోసం ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టారు. రాష్ట్రం ఏర్పడ్డాక కేసీఆర్ ప్రభుత్వం కూడా దీన్ని కొనసాగిస్తోంది. ఇంజనీరింగ్ విద్యార్ధులకు రూ.35 వేలు; ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ చదువుతున్నవారికి రూ.27 వేల చొప్పున ఫీజు రీయింబర్స్‌మెంట్ చేస్తోంది. అయితే బకాయిలను సకాలంలో చెల్లించకపోవడంతో విద్యార్థులకు, కాలేజీ యాజమాన్యాలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గత ఏడాది మార్చి నుంచి కరోనా వ్యాప్తితో విద్యా వ్యవస్థ కుంటుపడింది. సెప్టెంబరు నుంచి ఆన్‌లైన్ క్లాసులు ప్రారంభమయ్యాయి. సకాలంలో సర్కారు ఫీజు రీయింబర్స్‌మెంట్ చేయకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా 123 ప్రైవేటు జూనియర్, 78 ప్రైవేటు డిగ్రీ కళాశాలలు మూతపడ్డాయి. ప్రభుత్వం వెంటనే స్పందించి ఫీజు బకాయిలను విడుదల చేయాలని యాజమాన్యాలు కోరుతున్నాయి.
బీసీల్లో అందరికీ ఇవ్వడం లేదు
విద్యార్థులకు ఉపకారవేతనాలివ్వక సర్కారు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. గొర్రెలు, బర్రెల కొనుగోలుకు సర్కారు వేల కోట్లు ఖర్చు చేస్తోంది. చదువుకు మాత్రం డబ్బుల్లేవంటోంది. బీసీ విద్యార్ధుల ఫీజురీయింబర్స్‌మెంట్‌లో సర్కారు పూర్తి వివక్ష చూపుతోంది. బీసీలలో కూడా మైనార్టీలు, క్ట్రిస్టియన్లకే ఇస్తోంది. బీసీల్లోని హిందువులకివ్వడం లేదు. దీనిపై త్వరలోనే న్యాయస్థానంలో సవాల్ చేస్తాం
ఆర్. కృష్ణయ్య- అధ్యక్షుడు, బీసీ సంక్షేమ సంఘం
కాలేజీలు నడపలేకపోతున్నాం
ఫీజురీయింబర్స్‌మెంట్ సకాలంలో రావడం లేదు. పెండింగ్ బకాయిలు రూ.3 వేల కోట్ల వరకు ఉన్నాయి. దాంతో కాలేజీల నిర్వహణ భారంగా మారింది. దయచేసి ప్రభుత్వం వెంటనే ఫీజురీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం.
సతీష్, ప్రైవేటు ఇంటర్ కాలేజీ
యాజమాన్యాల సంఘం అధ్యక్షుడు