అకడమిక్‌ ‘ఫియర్‌‘

ABN , First Publish Date - 2021-06-23T05:25:40+05:30 IST

లాక్‌డౌన్‌ ఎత్తివేతతో పాఠశాలలను కూడా తెరవనున్నట్టు ప్రభుత్వం ప్రకటించడం విద్యార్థుల తల్లిదండ్రులు డైలమాలో పడ్డారు. పిల్లలను బడికి పంపాలా.. వద్దా? అనే సందిగ్ధంలో పడ్డారు. కరోనా కారణంగా గత ఏడాది చదువులన్నీ ఆన్‌లైన్‌లోనే కొనసాగాయి. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి దశల వారీగా పాఠశాలలను ప్రారంభించేందుకు ప్రభుత్వం సమాయత్తం కాగా విద్యార్థుల తల్లిదండ్రులు ఎటూ తేల్చలేకపోతున్నారు. వైరస్‌ ఉధృతి ఇంకా పూర్తిగా తగ్గలేదు. పైగా సెప్టెంబరులో థర్డ్‌ వేవ్‌ ఉంటుందని, పిల్లలపై అది ప్రభావం చూపొచ్చని జరుగుతున్న ప్రచారం భయాం దోళన కలిగిస్తోంది. పిల్లలకు ఈ విద్యా సంవత్సరంపై ఎలా గడుస్తుందనని పేరెంట్స్‌ కలవరపడుతున్నారు. ఈ అకడమిక్‌ ఇయర్‌పై వారిలో ‘ఫియర్‌’ వ్యక్తమవుతోంది.

అకడమిక్‌ ‘ఫియర్‌‘

పాఠశాలలు ప్రారంభించనున్న  ప్రభుత్వం

విద్యార్థుల తల్లిదండ్రుల్లో టెన్షన్‌

పిల్లలను బడికి పంపించేందుకు  మల్లగుల్లాలు

కరోనా విజృంభణపై భయాందోళన

‘థర్డ్‌వేవ్‌’ ప్రచారంపై  కలవరం

స్కూల్స్‌లో కొవిడ్‌ నిబంధనలపై  ప్రభుత్వ స్పష్టత కరువు


(ఆంధ్రజ్యోతి, భూపాలపల్లి)

కరోనా వైర్‌సతో చదువులు ఆగమాగమవుతున్నాయి. 2020 మార్చిలో మొదలైన వైరస్‌ విజృంభణతో 2020-21 విద్యా సంవత్సరం ఆన్‌లైన్‌ తరగతులకే పరిమితమైంది. సెకండ్‌ వేవ్‌ కూడా ఏప్రిల్‌, మే నెలల్లో భారీ ప్రాణ నష్టాన్ని మిగిల్చింది. ఇప్పుడిప్పుడే పరిస్థితులు కుదుటపడుతున్నాయి. ఈ క్రమంలో గత ఏడాది తరహాలోనే విద్యార్థులకు ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహిస్తారని తల్లిదండ్రులు మానసికంగా సిద్ధమయ్యారు. ఈనెల 14 నుంచి భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో కొన్ని ప్రైవేటు పాఠశాలలు ఆన్‌లైన్‌ తరగతులను కూడా ప్రారంభించాయి. 21వ తేదీ నుంచి ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభించి, తరగతులను ఆన్‌లైన్‌ బోధనకే పరిమితం చేస్తారనే ప్రచారం జోరుగా సాగింది. అయితే..  అనుహ్యంగా ప్రభుత్వం పాఠశాలలను తెరిచేందుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. అన్ని తరగతులూ ఒకేసారి కాకుండా దశల వారీగా ప్రారంభించాలని నిర్ణయించింది. ఉద యం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు క్లాసులు నిర్వహించాలని తెలిపింది. మొదటగా జూలై  1 నుంచి ఎనిమిది, తొమ్మిది, పదో తరగతులకు ప్రత్యక్ష బోధనను ప్రారంభించనున్నారు. జూలై 20 నుంచి ఆరు, ఏడు  తరగతులను మొదలెట్టనున్నారు. ఆగస్టు 16 నుంచి మూడు, నాలుగు, ఐదో తరగతులను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మూడు విడతల్లో మూడో తరగతి నుంచి పదో తరగతి వరకు పాఠశాలలను ప్రారంభించి,  ప్రత్యక్ష విద్యా బోధన చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 

ముమ్మరంగా ఏర్పాట్లు 

ప్రభుత్వం పాఠశాలలను తెరుస్తుండటం తో విద్యార్థులు బడి బాట పట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఒకవైపు కరోనా టెన్షన్‌ వారిని వెంటాడుతుండగా మరోవైపు భవిష్యత్తుపై ఆశతో పుస్తకాల సంచిని భు జాన వేసుకోబోతున్నారు. భూ పాలపల్లి, ములుగు జిల్లాల్లో మూడు నుంచి పదో తరగతుల వరకు అన్ని యా జమాన్యాల పాఠశాలల్లో సుమారు 37వేల మంది విద్యార్థులు ఉన్నారు. భూపాలపల్లి జిల్లాలో మొత్తం 538 పాఠశాలలు ఉన్నాయి. వీటిలో మూడు నుంచి ఐదో తరగతి వరకు 7,449 మంది విద్యార్థులు ఉన్నారు. ఆరు నుంచి పదో తరగతి వరకు 13,772 మంది విద్యార్థులు ఉన్నారు. మూడు నుంచి పదో తరగతి వరకు  21,221 మంది ఉన్నారు. ములుగు జిల్లాలో 557 పాఠశాలలు ఉన్నాయి. వీటిలో మూడు నుంచి ఐదో తరగతి వరకు 6,897 మంది విద్యార్థులు ఉన్నారు. ఆరు నుంచి పదో తరగతి వరకు 8,450 మంది విద్యార్థులున్నారు. ఇలా మూడు నుంచి పదో తరగతి వరకు మొత్తం 15,347 మంది విద్యార్థులు ఉన్నారు. పాఠశాలలు తెరుచుకోనున్న నేపథ్యంలో ప్రభుత్వ ఉపాధ్యాయులు తరగతులు నిర్వహిం చేందు కు సిద్ధమవుతున్నారు. పాఠశాలలకు చేరుకొని ఎనిమది నుంచి పదో తరగతులను నిర్వహించేందుకు కావాల్సిన ఏర్పాట్లు చేయనున్నారు. ఇప్పటికే చాలా వరకు ప్రైవేటు పాఠశాలల్లో ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రత్యక్ష బోధన జరిగే వరకు మూడు నుంచి ఏడో తరగతి విద్యార్థులకు ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించనున్నారు.

తల్లిదండ్రులకు భయాందోళ

ప్రభుత్వం ప్రత్యక్ష బోధనకు సిద్ధమవుతుండటంతో తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. కరోనా పూ ర్తిగా తగ్గకపోవటంతో పాటు సెప్టెంబరులో థర్డ్‌వేవ్‌ ఉంటుందని, అది పిల్లలపై ప్రభావం చూపిస్తుందని ప్రచారం జరుగుతుండటం కలవరపెడుతోంది. ఇంట్లో ఉంటే చదువులు లేక పిల్లల భవిష్యత్తు దెబ్బతింటుందని, ఇన్నాళ్లు చదివిన చదువు కూడా మరిచి ోయి ఇంటర్నెట్‌కు బానిసలుగా మారుతున్నారనే బాధ ఒకవైపు... కరోనా మహమ్మారి కాటేస్తే పిల్లల పరిస్థితి ఏమిటనే సందిగ్ధం మరోవైపు తల్లిదండ్రులను వేధిస్తోంది. పిల్లలకు ఇంకా వ్యాక్సినేషన్‌ కూడా చేయకపోవడంతో కరోనా నుంచి ఎలా రక్షణ అనే చర్చ జరుగుతోంది. ప్రభుత్వం కూడా కరోనా నిబంధనలు ఏవీ ప్రకటించలేదు. కనీసం విద్యార్థులకు కరోనా నుంచి రక్షించేందుకు తీసుకుంటున్న జాగ్రత్తలపై ఎలాంటి స్పష్టత లేదు. దీంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. పాఠశాలల్లో నాలుగు ఫీట్ల బల్లాపై ముగ్గురు పిల్లలు కూర్చోవాల్సి ఉంటుంది.  భౌతికదూరం కూడా పాటించే పరిస్థితి లేదు. మధ్యాహ్న భోజనం అమలు చేస్తే అంత ఒకేచోట గుమిగూడే అవకాశం ఉంటుంది. స్కూల్‌ వ్యాన్‌లో సామర్థ్యానికి మించి పిల్లలను ఎక్కిస్తారు. కనీసం పాఠశాల్లో కరోనా రక్షణకు శానిటైజర్స్‌, మాస్కు లు, భౌతికదూరం లాంటి నిబంధనలు పాటిస్తారా.. లేదా? ఇలా అనేక అనుమానాలు తల్లిదండ్రుల్లో వ్యక్తమవుతున్నాయి. మరో వైపు రెండు జిల్లాల్లో మొత్తం 232 స్కూల్‌ బస్సులు ఉండగా, కేవలం మూడింటికే  ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ ఉంది. మిగతా 229 బస్సులకు ఫిట్‌నెస్‌ సర్టిఫికేట్‌ లేదు. అయితే సెప్టెంబరు 30 వరకు ఫిట్‌నెస్‌ చేయించుకునే అవకాశం ప్రభుత్వం ఇచ్చింది. కానీ, చాలా రోజుల నుంచి బస్సులు బయటకు తీయకపోవటంతో అనేక సమస్యలు ఉత్పన్నం కానున్నాయి.

Updated Date - 2021-06-23T05:25:40+05:30 IST