తనయుడి చేతిలో తండ్రి హతం.. సహకరించిన కూతురు
ABN , First Publish Date - 2021-08-24T01:15:26+05:30 IST
సింగరేణి కార్మికుడు హత్యకు గురయ్యాడు. కన్న కొడుకే తండ్రిని పొట్టనబెట్టుకున్నాడు. ఇందుకు కూతురు కూడా సహరించింది.

భూపాలపల్లి: సింగరేణి కార్మికుడు హత్యకు గురయ్యాడు. కన్న కొడుకే తండ్రిని పొట్టనబెట్టుకున్నాడు. ఇందుకు కూతురు కూడా సహరించింది. ఈ ఘటన భూపాలపల్లి జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. సింగరేణి టీ2 క్వార్టర్స్‌కు చెందిన దొడ్డి నాగభూషణం (45) సింగరేణి ఒకటో గనిలో ట్రామర్‌గా పని చేస్తున్నాడు. 2019లో ఆయన భార్య అనారోగ్యంతో మృతి చెందింది. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఒక కుమార్తెకు వివాహం జరిగింది. ఆరు నెలల క్రితం నాగభూషణం రెండో పెళ్లి చేసుకున్నాడు.
అప్పటి నుంచి కూతురు, కుమారుడితో ఆయన సరిగా ఉండటం లేదు. ఈ క్రమంలో కుమారుడు, కుమార్తెతో నిత్యం గొడవలు జరిగేవి. ఈనెల 19న భార్యతో కలిసి నాగభూషణం కొత్తగూడెంలోని ఓ వివాహానికి వెళ్లాడు. 21న తిరిగి భూపాలపల్లికి ఒక్కడే వచ్చాడు. మరుసటి రోజు ఆదివారం రాత్రి ఇంట్లో ఒంటరిగా ఉన్న నాగభూషణంపై కుమారుడు జగదీశ్ కత్తితో దాడి చేసి హత్య చేశాడు. ఇందుకు సోదరి సహకరించింది. తన భర్తను అతడి కుమారుడు, కూతురు హత్య చేశారని నాగభూషణం రెండో భార్య శారద పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు.