పిడుగుపాటుకు రైతు మృతి
ABN , First Publish Date - 2021-10-31T02:31:26+05:30 IST
పిడుగుపడి ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం శ్రీరాంగిరి గ్రామానికి చెందిన ఓ రైతు మృతిచెందాడు.

నేలకొండపల్లి: పిడుగుపడి ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం శ్రీరాంగిరి గ్రామానికి చెందిన ఓ రైతు మృతిచెందాడు. గ్రామానికి చెందిన దుంపల ప్రసాద్(45)అనే రైతు తన భార్య, కుమారుడితో కలిసి రోజూ లాగే శనివారం కూడా మిర్చి పొలంలో పనులు చేసేందుకు వెళ్లారు. సాయంత్రం ఉరుములు, మెరుపులతో వర్షం కురుస్తుండటంతో ఆ ముగ్గురు ఓ చెట్టుకిందకు వెళ్లారు. అదే సమయంలో చెట్టుపై పిడుగు పడటంతో ప్రసాద్ అక్కడికక్కడే మృతిచెందాడు. భార్య నాగమణి, కుమారుడు పవన్ స్పృహతప్పి పడిపోయారు. ఆతర్వాత కొద్దిసేపటికి వారు తేరుకొని చూసేలోపు ప్రసాద్ మృతిచెంది ఉండటంతో భార్య, కుమారుడు గుండెలవిసేలా రోదించారు. ప్రసాద్ మృతితో శ్రీరాంగిరి గ్రామంలో విషాదం అలుముకుంది. ఇక నేలకొండపల్లి భైరవునిపల్లి గ్రామ సమీపంలోని తెలగొర్ల స్వరాజరావుకు చెందిన పొలంలో పిడుగు పడింది. ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. కానీ పిడుగుపాటుకు సమీప పొలాల్లో పని చేసుకుంటున్న తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.