పురుగుల మందు తాగిన రైతు మృతి

ABN , First Publish Date - 2021-12-30T18:17:01+05:30 IST

చికిత్స పొందుతూ రైతు మృతి చెందిన సంఘటన మహబూబాబాద్‌ మండలం పర్వతగిరి గ్రామంలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది.

పురుగుల మందు తాగిన రైతు మృతి

మహబూబాబాద్‌ రూరల్‌, డిసెంబరు 29 : చికిత్స పొందుతూ రైతు మృతి చెందిన సంఘటన మహబూబాబాద్‌ మండలం పర్వతగిరి గ్రామంలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం... పర్వతగిరి గ్రామానికి చెందిన నారామళ్ల సంపత్‌(29)కు రెండున్నర ఎకరాల వ్యవసాయ భూమి ఉండగా అందులో రెండెకరాల్లో మిర్చి, ఆరెకరంలో పత్తి సాగు చేశాడు. మిర్చి తోటకు తామర పురుగు, వైరస్‌ ఆశించి పంట దెబ్బతినడంతో పెట్టుబడి కోసం తెచ్చిన రూ.2లక్షలు, గతంలో అప్పులు రూ.4 లక్షలు వెరసి రూ.6 లక్షలు అప్పులు కావడంతో వాటిని ఎలా తీర్చాలని మనస్తాపానికి గురై మంగళవారం మధ్యాహ్నం తన వ్యవసాయ బావి వద్ద పురుగుమందు తాగాడు. పక్క వ్యవసాయక్షేత్రంలో ఉన్న రైతులు గమనించి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. హుటాహుటిన సంపత్‌ను జిల్లా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం ఖమ్మం ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతి చెందారు. మృతుడికి భార్య వెన్నల, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

Updated Date - 2021-12-30T18:17:01+05:30 IST