అప్పులబాధతో ఇద్దరు రైతుల ఆత్మహత్య

ABN , First Publish Date - 2021-10-31T09:08:59+05:30 IST

రాష్ట్రంలో రైతన్నల ఆత్మహత్యల పరంపర కొనసాగుతూనే ఉంది. శనివారం మరో ఇద్దరు రైతులు బలవన్మరణం చెందగా అందులో ఒకరు మహిళా రైతు. ....

అప్పులబాధతో ఇద్దరు రైతుల ఆత్మహత్య

 పిడుగు పడి మరో రైతు మృతి

వనపర్తి/కాటారం/ఏన్కూరు, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో రైతన్నల ఆత్మహత్యల పరంపర కొనసాగుతూనే ఉంది. శనివారం మరో ఇద్దరు రైతులు బలవన్మరణం చెందగా అందులో ఒకరు మహిళా రైతు. వనపర్తి జిల్లా గోపాల్‌పేట మండలం ఏదుట్లలో జుట్టు నర్సింహ (45) రెండెకరాల రైతు. పంటలు పండకపోవటం, కుమార్తెలకు పెళ్లిళ్లు చేయటంతో అప్పు రూ. 5 లక్షలకు చేరింది. అవి తీరే మార్గం కానరాకపోవటంతో ఉరేసుకున్నాడు. భూపాలపల్లి జిల్లా కాటారం మండలం గుమ్మళ్లపల్లిలో కుడిమేత సమ్మయ్య, నీల(38)దంపతులు తమకున్న ఎకరం భూమిలో పత్తి పంట సాగు చేస్తున్నారు. గత ఏడాది పంట దిగుబడులు సరిగా రాక పెట్టుబడుల కోసం చేసిన రూ.70వేల అప్పు తీర్చలేకపోయారు. ఈ ఏడాది మరో రూ. 90 వేలు అప్పు చేసి పత్తి పంట వేస్తే భారీ వర్షాలకు అది కూడా దెబ్బతిన్నది. దీంతో నీల పురుగుల మందు తాగింది. కాగా, ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం శ్రీరాంగిరిలో రైతు దుంపల ప్రసాద్‌(45) పిడుగుపాటుతో మృతి చెందాడు. పొలంలో పని చేస్తున్న సమయంలో ఉరుములు, మెరుపులతో వర్షం రావటంతో ప్రసాద్‌ చెట్టుకిందకు వెళ్లాడు. చెట్టుపై పిడుగుపటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. 

Updated Date - 2021-10-31T09:08:59+05:30 IST