వెండితెర బతుకులు వెల వెల

ABN , First Publish Date - 2021-05-24T09:34:35+05:30 IST

సినిమా తల్లినే నమ్ముకుని కృష్ణానగర్‌ చేరిన జూనియర్‌ ఆర్టిస్టులు, సినీ కార్మికులపై కరోనా తీవ్ర ప్రభావం చూపుతోంది.

వెండితెర బతుకులు వెల వెల

  • కొవిడ్‌ దెబ్బకు షూటింగ్‌లు బంద్‌.. 
  • జూనియర్‌ ఆర్టిస్టులు, కార్మికులకు కష్టాలు
  • కరోనాతో రోడ్డున పడ్డ కుటుంబాలు
  • అద్దె కట్టలేక, చేతిలో చిల్లి గవ్వలేక అవస్థలు

బంజారాహిల్స్‌, మే 23 (ఆంధ్రజ్యోతి): సినిమా తల్లినే నమ్ముకుని కృష్ణానగర్‌ చేరిన జూనియర్‌ ఆర్టిస్టులు, సినీ కార్మికులపై కరోనా తీవ్ర ప్రభావం చూపుతోంది. షూటింగ్‌ జరిగితేనే నాలుగు మెతుకులు తినే వారు.. ఇప్పుడు కరోనా దెబ్బతో షూటింగ్‌లు లేక, వేరే పనులు తెలియక, ఓ పూట తిని మరో పూట పస్తులుంటున్నారు. నోట్ల రద్దు సమయంలో సంక్షోభం ఎదుర్కొన్న సినీ కార్మికులు, కరోనా వల్ల పూర్తిగా కుదేలైపోయారు. ఇంటి అద్దె, ఇతర ఖర్చులకు డబ్బుల్లేక నానా అవస్థలు పడుతున్నారు. షూటింగ్‌లతో సందడిగా ఉండే కృష్ణానగర్‌ కొవిడ్‌ దెబ్బకు వెలవెలబోతుంది.  


పరిశ్రమనే నమ్ముకున్నా..

డైరెక్టర్లు ఎలా చెబితే అలా హావభావాలు పండించడంలో వారు దిట్ట. ఏ వేషం ఇచ్చినా ప్రేక్షకులను కట్టి పడేస్తారు. ఈ ప్రతిభ అంతా కెమెరా ముందే.. బయటకు వస్తే వీరు మరో పని ఎరుగరు. వేషాలు లేకపోతే పస్తులైనా ఉంటారు కానీ మరో పని గురించి ఆలోచించరు. అంతలా సినీ పరిశ్రమను నమ్ముకున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆర్టిస్టులంతా రోడ్డున పడ్డారు. నగరంలో షూటింగ్‌లకు కొదవ ఉండదు. చిన్న సినిమాల నుంచి భారీ సినిమాల వరకు రోజూ పది నుంచి పన్నెండు షూటింగ్‌లు జరుగుతుంటాయి. నెలలో కనీసం 20 రోజుల పాటు పని దొరుకుతుంది. ఇప్పుడు కరోనాతో షూటింగ్‌లు బంద్‌ అయ్యాయి. నాలుగు నెలలుగా పని లేదు. దీంతో ఆర్టిస్టులు, ఇతర సినీ కార్మికులు తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. ఇంటి అద్దెలు, పిల్లల స్కూల్‌ ఫీజులు ఇతర ఖర్చులకు చేతిలో చిల్లి గవ్వ లేక నానా అవస్థలు పడుతున్నారు. చాలా మంది ఆర్థికంగా నెట్టుకురాలేక సామాన్లను ఇక్కడే వదిలేసి స్వగ్రామం బాట పడుతున్నారు.


24 క్రాఫ్ట్‌లలో ఇదే పరిస్థితి...

షూటింగ్‌ అంటే 24 క్రాఫ్ట్‌లు. అందరూ పనిచేస్తేనే సినిమా పూర్తవుతుంది. ఆర్టిస్టులు, ఏజెంట్లు, డ్రైవ ర్లు, మేకప్‌ ఆర్టి్‌స్టలు, ఇలా అనేక రకా ల యూనియన్లను నమ్ముకొని కృష్ణానగర్‌లో దాదాపు 50 వేల మందికి పైగా జీవిస్తున్నారు. కరోనా నేపథ్యంలో షూటింగ్‌లు నిలిచిపోవడంతో వీరంతా ఖాళీగా ఉంటున్నారు. కార్మికులు, జూనియర్‌ ఆర్టి్‌స్టలను ఆదుకునేందుకు కొంత మంది ముందుకు వస్తున్నారు. కానీ ఆ సాయం అందరికీ చేరడం లేదు. గతేడాది లాక్‌డౌన్‌ సమయంలో సీసీసీ చారిటబుల్‌ ట్రస్టు ద్వారా నిత్యావసర సరుకుల పంపి ణీ జరిగింది. ఈసారి ఎవరి నుంచి సాయం అందకపోవడంతో సినీ కార్మికులు విలవిలలాడిపోతున్నారు. 


అద్దె కట్టడం ఇబ్బందిగా మారింది 

జూనియర్‌ ఆర్టిస్టుగా 30 ఏళ్ల నుంచి పనిచేస్తున్నాను. ప్రతి నెల కనీసం ఇరవై రోజులైనా పని దొరికేది. నాలుగు నెలలుగా షూటింగ్‌లు లేక కుటుంబమంతా ఇబ్బంది పడుతున్నాం. ఈ పని తప్పితే మరో పని రాదు. ఇంటి అద్దె కట్టడం చాలా ఇబ్బందిగా మారింది. 

- సరసపల్లి లక్ష్మి.. జూనియర్‌ ఆర్టిస్టు


చాలా అవస్థలు పడుతున్నాం 

పుట్టిన ఊరు కాదనుకొని ఇరవై ఏళ్ల క్రితం కృష్ణానగర్‌ వచ్చాను. పనిదొరికితే భోజనం, లేకపోతే పస్తులు ఉండటం అలవాటుగా మారింది. స్వచ్ఛంద సంస్థల వల్ల ఇప్పుడు తిండికి లోటు లేకపోయినా, ఇతర ఖర్చులకు చాలా ఇబ్బంది పడుతున్నాం. ప్రభుత్వం మాకు సాయం చేయాలి.

- ఎన్‌ సునీల్‌ కుమార్‌.. సినీ ప్రొడక్షన్‌ అసిస్టెంట్‌


సినీ పెద్దలు ఆదుకోవాలి 

గతేడాది లాక్‌డౌన్‌ నుంచి ఇప్పటి వరకు ఇబ్బందులు పడుతూనే ఉన్నాం. ప్రస్తుతం లాక్‌డౌన్‌తో పనిలేదు. ఇదే పరిస్థితి కొనసాగితే ఇంటిల్లిపాది పస్తులు ఉండాల్సిన దుస్థితి. సినీ పెద్దలు కలుగచేసుకొని మా లాంటి చిన్న కుటుంబాలను ఆదుకుంటే బాగుంటుంది. మిగతా ఖర్చులు ఎలా ఉన్నా మూడు పూటలా భోజనం దొరికితే చాలు అన్నట్టు ఉంది పరిస్థితి.

- వాంకినేని సురేష్‌.. సినీ టెక్నీషియన్‌

Updated Date - 2021-05-24T09:34:35+05:30 IST