ప్రైవేటు మెడికల్‌ కాలేజీల సేవల వినియోగంలో విఫలం

ABN , First Publish Date - 2021-05-30T09:21:57+05:30 IST

కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రైవేటు మెడికల్‌ కాలేజీలు పెట్టిన షరతును ప్రభుత్వం ఒప్పుకోనందునే..

ప్రైవేటు మెడికల్‌ కాలేజీల సేవల వినియోగంలో విఫలం

  • వారి షరతును ప్రభుత్వం ఒప్పుకోలేదు
  • ఫలితంగా ప్రజలు ఇబ్బంది పడాల్సి వచ్చింది
  • వెబినార్‌లో మాజీ మంత్రి ఈటల రాజేందర్‌

హైదరాబాద్‌, మే 29(ఆంధ్రజ్యోతి): కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రైవేటు మెడికల్‌ కాలేజీలు పెట్టిన షరతును ప్రభుత్వం ఒప్పుకోనందునే.. వాటి సేవలను ఉపయోగించుకోలేకపోయామని మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. దీంతో కరోనా బాధితులు ప్రైవేట్‌ ఆస్పత్రులకు వెళ్లి ఇబ్బందులు పడాల్సి వచ్చిందన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఎన్ని పడకలు, సిబ్బంది అందుబాటులో ఉన్నారో.. ప్రైవేటు మెడికల్‌ కాలేజీల్లోనూ అన్ని పడకలున్నాయని, డాక్టర్లు అందుబాటులో ఉన్నారని చెప్పారు. జయశంకర్‌ మానవవనరుల అభివృద్ధి కేంద్రం ఆధ్వర్యంలో శనివారం ‘‘కొవిడ్‌ కల్లోలంలో రాష్ట్రం- పట్టించుకోని ప్రభుత్వం’’ అంశంపై వెబినార్‌ జరిగింది. ఇందులో ఈటల రాజేందర్‌, టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాం, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ కరోనా కారణంగా లక్షలాది పేద కుటుంబాలు రోడ్డున పడ్డాయని, వేలాది మంది ఆప్తులను కోల్పోయారని ఆవేదన వ్యక్తంచేశారు.


రూ.లక్షలు ఖర్చు చేస్తేగానీ బతికి బట్టగట్టలేని పరిస్థితి చూస్తున్నామన్నారు. కరోనాతోపాటుగా బ్లాక్‌, వైట్‌ ఫంగ్‌సకూ ఆరోగ్యశ్రీలో వైద్యం అందించాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో అందరికీ వ్యాక్సినేషన్‌ ఉచితంగా జరగాలని అభిప్రాయపడ్డారు. కరోనాతో ఉపాధి కోల్పోయిన వారికి స్వచ్ఛంద సంస్థలతో సమన్వయం చేసుకుని సాయం చేస్తే బాగుంటుందని అన్నారు. కరోనా నియంత్రణలో ప్రభుత్వం చేతులెత్తేసిందని కోదండరాం ధ్వజమెత్తారు. ప్రభుత్వ ఆస్పత్రులను బలోపేతం చేయాలని, గ్రామస్థాయిలో ఐసోలేషన్‌ కేంద్రాలు ఏర్పాటు చేయాలని, ప్రైవేటు ఆసుపత్రుల దోపిడీని అరికట్టాలని కోరారు. ఈ డిమాండ్ల సాధన కోసం ఆదివారం ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు మౌన దీక్ష చేయాలని టీజేఎస్‌  శ్రేణులు, ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఆరోగ్య పరిస్థితి ఇంత దారుణంగా ఉండడానికి ప్రభుత్వ ఆర్థిక విధానాలే కారణమని కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఆరోపించారు.

Updated Date - 2021-05-30T09:21:57+05:30 IST