ఒక కాలేజీలో చేరి.. మరో కాలేజీలో పాఠాలు వినొచ్చు!
ABN , First Publish Date - 2021-07-16T08:43:57+05:30 IST
ఊళ్లోనే పేరున్న కాలేజీలో సీటు కోసం కష్టపడతాం! అక్కడి లెక్చరర్ల నుంచి పాఠాలు వినాలని ఆశపడతాం!! దురదృష్టవశాత్తూ అక్కడ సీటు రాకపోతే.. సర్దుకుపోయి
ఒక కళాశాలలో బాగా పాఠాలు చెప్పే ఫ్యాకల్టీ సేవలు
ఇతర కళాశాలల్లోనూ ఉపయోగించుకునే చాన్స్
విద్యార్థుల నైపుణ్యాల పెంపు కోసం వెసులుబాటు
ఈ ఏడాది ప్రయోగాత్మకంగా కొన్ని కాలేజీల్లో అమలు
ఆ దిశగా ఉన్నత విద్యా మండలి అధికారుల కసరత్తు
హైదరాబాద్, జూలై 15 (ఆంధ్రజ్యోతి): ఊళ్లోనే పేరున్న కాలేజీలో సీటు కోసం కష్టపడతాం! అక్కడి లెక్చరర్ల నుంచి పాఠాలు వినాలని ఆశపడతాం!! దురదృష్టవశాత్తూ అక్కడ సీటు రాకపోతే.. సర్దుకుపోయి సీటు దొరికిన కాలేజీలో చేరిపోతాం. కానీ, అలా చేరాక కూడా, మనకు నచ్చిన కాలేజీకి వెళ్లి పాఠాలు వినే అవకాశం ఉంటే? ఆ ఊహే అద్భుతంగా ఉంది కదూ. డిగ్రీ విద్యార్థుల నైపుణ్యాలను పెంపొందించడంలో భాగంగా రాష్ట్ర ఉన్నత విద్యా మండలి అధికారులు ఈ ఏడాది నుంచి వినూత్న పద్దతిని అమలు చేయాలని నిర్ణయించారు. అలాగే.. నిపుణులైన అధ్యాపకుల సేవలను ఇతర కాలేజీల్లో ఉపయోగించుకునే విధంగా కూడా ఈ నూతన విధానాన్ని అమలు చేయనున్నారు. రాష్ట్రంలో పలు ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలున్నప్పటికీ.. వాటిలో కొన్నింటికే మంచి పేరుంటుంది. అక్కడ మెరుగైన విద్యాబోధన ఉండడమే ఇందుకు కారణం.
చిన్నచిన్న కారణాలతో చాలా మంది విద్యార్థులు ఆయా కాలేజీల్లో చదువుకునే అవకాశాన్ని కొల్పొతున్నారు. మరో పక్క కొన్ని కాలేజీల్లో మ్యాథ్స్‌ను బోధించే ఫ్యాకల్టీ బాగుండగా, మరికొన్ని చోట్ల సైన్స్ బోధన బాగుంటుంది. అలాగే...ల్యాబ్‌ల విషయంలో కూడా కాలేజీల మధ్య కొంత తేడా ఉంటుంది. ఇలాంటి వాటి విషయంలో విద్యార్థులు నష్టపోకుండా తమ కాలేజీ కంటే మెరుగైన కాలేజీకి వెళ్లి పాఠాలను వినే సౌకర్యాన్ని కల్పించాలని ఉన్నత విద్యా మండలి నిర్ణయించింది. ఇందు కోసం తీసుకోవాల్సిన చర్యలు, అవసరమైన మార్గదర్శకాలను రూపొందించడానికి వీలుగా ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్లు లింబాద్రి, వెంకటరమణ, కొంత మంది వీసీలతో క్లస్టర్ కమిటీని వేశారు. ఈ కమిటీ ఇప్పటికే సమావేశమై చర్చించింది.
6 కాలేజీలతో ఒక క్లస్టర్
కొత్త విధానం అమలులో భాగంగా ఆరు చొప్పున కళాశాలలతో ఒక క్లస్టర్‌ను ఏర్పాటు చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఆ ఆరింటిలో.. రెండు ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు, మరో రెండు యూనివర్సిటీల అనుబంధ కాలేజీలు, మరో రెండు యూనివర్సిటీల గుర్తింపు పొందిన ప్రైవేట్ కాలేజీలు ఉంటాయి. విద్యార్థులు సులువుగా చేరుకునే విధంగా ఈ కాలేజీలను ఎంపిక చేయనున్నారు. ఈ క్లస్టర్‌లో గుర్తించిన కాలేజీల పరిధిలో మానవ వనరులను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసే విధంగా చర్యల్ని తీసుకోనున్నారు. ముఖ్యంగా లోటు పాట్లు ఉన్న కాలేజీలో.. వాటిని అధిగమించడానికి మరో కాలేజీ సహాయపడుతుంది. అవసరమైతే.. ట్రిపుల్ ఐటీ, సెంట్రల్ యూనివర్సిటీ, టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ వంటి వాటి సహాయాన్ని కూడా తీసుకోవాలని భావిస్తున్నారు. భవిష్యత్తులో జాతీయ, అంతర్జాతీయ సంస్థలను కూడా క్లస్టర్‌లోకి తీసుకువచ్చే యోచన చేస్తున్నారు.
ప్రతి క్లస్టర్‌లోని కాలేజీల పరిధిలో.. బోధన సిబ్బంది, అధ్యాపకుల అనుభవాలను కాలేజీలు మార్పిడి చేసుకుంటాయి. అంటే.. ఒక నిపుణుడైన అధ్యాపకుడి సేవలను ఇతర కాలేజీల్లో కూడా ఉపయోగించుకునే విధంగా ఈ విధానాన్ని రూపొందిస్తున్నారు. అలాగే.. క్లస్టర్‌లోని కాలేజీల్లో తాము మెరుగైనదిగా భావించే కాలేజీలోకి వెళ్లి పాఠాలు వినే సౌకర్యాన్ని విద్యార్థులకు కల్పించనున్నారు. కొన్ని సబ్జెక్టుల్లో కొన్ని కాలేజీలు మెరుగ్గా ఉంటాయనుకుంటే.. ఆ సబ్జెక్టు వరకూ ఇతర కాలేజీల విద్యార్థులు వచ్చి, పాఠాలను వినడానికి ఏర్పాట్లు చేయాలని భావిస్తున్నారు. అలాగే ల్యాబ్‌లు, ఇతర పరికరాలను కూడా ఇతర కాలేజీల విద్యార్థులు ఉపయోగించుకోవడానికి అవకాశాన్ని కల్పించనున్నారు. ఈ విధానాన్ని ఈ ఏడాదే పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయాలని, విజయవంతమైతే రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలని యోచిస్తున్నారు.