మిల్లర్ల దోపిడీ నివారించాలి

ABN , First Publish Date - 2021-11-28T08:22:41+05:30 IST

రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు కోసం రైతన్న ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. శనివారం రాష్ట్రంలో పలుచోట్ల రైతులు వివిధ అంశాలపై ఆందోళనలు చేశారు.

మిల్లర్ల దోపిడీ నివారించాలి

  • రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల రైతుల ఆందోళనలు
  • నకిలీ విత్తనాలు అంటగట్టారని వరంగల్‌లో..
  • పత్తి ధర తగ్గిందని ఆదిలాబాద్‌లో నిరసనలు


(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌) : రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు కోసం రైతన్న ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. శనివారం రాష్ట్రంలో పలుచోట్ల రైతులు వివిధ అంశాలపై ఆందోళనలు చేశారు. రైస్‌మిల్లర్ల దోపిడీకి అడ్డుకట్ట వేయాలని డిమాండ్‌ చేస్తూ కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. తరుగు, నూకల పేరిట బస్తాకు రెండు కిలోల తరుగు కింద తీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే సమస్యపై రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో రాస్తారోకో చేసిన రైతులు ధాన్యానికి నిప్పు పెట్టి ఆందోళన చేశారు. వెంటనే ధాన్యం కొనుగోళ్లు జరపాలని జగిత్యాల జిల్లా రాయికల్‌లో రైతులు ఆందోళన చేశారు. కాగా, అధిక దిగుబడి వస్తుందని ఆశ చూపి నకిలీ విత్తనాలు అంటగట్టారని వరంగల్‌ జిల్లా నర్సంపేటలో రైతులు ఆందోళన చేపట్టారు. దుకాణం యజమాని మాట్లాడుతూ తాను ఇతర రైతులకు అమ్మిన చోట్ల రైతులకు మంచి దిగుబడే వచ్చిందని తెలిపారు. అయినా ఈ రైతుల విషయం కంపెనీకి తెలియచేసి పరిహారం ఇప్పించటానికి యత్నిస్తానని తెలిపారు. 


ఇదిలా ఉండగా పత్తి ధర తగ్గింపుపై అన్నదాతలు ఆందోళనకు దిగారు. ఆదిలాబాద్‌ మార్కెట్‌యార్డులో శుక్రవారం వరకు క్వింటాలు పత్తి ధర రూ.8,130 ఉండగా, శనివారం ఒక్కరోజులోనే రూ.170 ధర తగ్గి 7,960 ధర పలికింది. దీంతో రైతులు ఆగ్రహానికి గురై మార్కెట్‌ యార్డు గేటుకు తాళం వేసి ఆందోళనకు దిగారు. ఒక పక్క పండిన పంట రైతులు అమ్ముకోవటానికి నానా అవస్థలు పడుతుంటే అప్పుల బాధ భరించలేక మరో పక్క అన్నదాతలు బలవన్మరణం చెందుతున్నారు.  వనపర్తి జిల్లా పెద్దమందడిలో మన్యంకొండ (50) ఐదెకరాల పొలంలో కొంత వరి, మరికొంత వేరుశనగ పంటలు సాగు చేశాడు. పెట్టుబడికి, బోరుబావుల తవ్వకానికి రూ. 5 లక్షలు అప్పులు అయ్యాయి.  ఆశించిన స్థాయిలో పంటలు రాకపోవడంతో అప్పులు చెల్లించలేక ఇటీవల పురుగుల మందు తాగాడు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌ మండలం చందునాయక్‌తండాలో మహిళా రైతు రాథోడ్‌ నీలాబాయి (73) తనకున్న ఒకటిన్నర ఎకరాల భూమిలో పత్తి, పసుపు, కూరగాయలు పండిస్తోంది. పంటను నీరు పెట్టేందుకు బోరు మోటారు స్విచ్‌ వేసే ప్రయత్నంలో విద్యుదాఘాతానికి గురై మృతి చెందింది. 

Updated Date - 2021-11-28T08:22:41+05:30 IST