858 కోట్లతో నాలాల విస్తరణ!

ABN , First Publish Date - 2021-12-31T08:12:15+05:30 IST

హైదరాబాద్‌కు ముంపు చికాకు శాశ్వతంగా పోవాలంటే రహదారుల తరహాలో వ్యూహాత్మక అభివృద్ధి చేయాలన్న ఆలోచన నుంచే స్ర్టాటజిక్‌ నాలా డెవల్‌పమెంట్‌ ప్రోగ్రాం (ఎస్‌ఎన్‌డీపీ) ప్రారంభమైందని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు.

858 కోట్లతో నాలాల విస్తరణ!

వేలాది మందికి ఉపశమనం: కేటీఆర్‌ 

హైదరాబాద్‌ సిటీ/ హైదరాబాద్‌/బర్కత్‌పుర, నల్లకుంట, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌కు ముంపు చికాకు శాశ్వతంగా పోవాలంటే  రహదారుల తరహాలో వ్యూహాత్మక అభివృద్ధి చేయాలన్న ఆలోచన నుంచే స్ర్టాటజిక్‌ నాలా డెవల్‌పమెంట్‌ ప్రోగ్రాం (ఎస్‌ఎన్‌డీపీ) ప్రారంభమైందని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఈ మేరకు తొలి దశలో అత్యంత ముంపు తీవ్రత ఉన్న ప్రాంతాల్లో సమస్య పరిష్కారానికి రూ.858 కోట్లతో ప్రతిపాదించిన పనులకు పాలనాపరమైన అనుమతులు ఇచ్చామని చెప్పారు. రెండో విడతలోనూ ఇతర ప్రాంతాల్లో వరద ముంపునకు చెక్‌ పెట్టే ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారన్నారు. ఈ మేరకు జీహెచ్‌ఎంసీ పరిధిలో రూ.633 కోట్లు, గ్రేటర్‌ పక్కన ఉన్న మునిసిపాల్టీలు, కార్పొరేషన్లలో రూ. 225.32 కోట్లతో నాలాల విస్తరణ కార్యక్రమం తీసుకున్నామన్నారు. కవాడిగూడ వంతెన నుంచి మూసీలో కలిసే వరకు సాగర్‌ సర్‌ప్లస్‌ నాలాకు ఇరువైపులా రూ .68.40 కోట్లతో చేపడుతున్న రిటైనింగ్‌ వాల్‌ నిర్మాణ పనులకు గురువారం ఫీవర్‌ ఆస్పత్రి వంతెన వద్ద  కేటీఆర్‌ శంకుస్థాపన చేశారు. అనంతరం అధికారుల తో ఎంఏయూడీ కార్యాలయం నుంచి విడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ రెండు కార్యాక్రమాల్లోనూ కేటీఆర్‌  మాట్లాడారు.


హుస్సేన్‌సాగర్‌ దిగువ నుంచి మూసీ వరకు 6 కిలోమీటర్లకు పైగా సర్‌ప్లస్‌ నాలా ఉందని, ఇరువైపులా 12 కి.మీ.లకుగాను 70 ఏళ్లలో గత ప్రభుత్వాలు మూడు కి.మీ మేర కూడా రిటైనింగ్‌ వాల్‌ నిర్మించలేదని విమర్శించారు. టీఆర్‌ఎస్‌  ప్రభుత్వ హ యాంలో శాశ్వత పరిష్కారం చూపాలని అంబర్‌పేట, ముషీరాబాద్‌ నియోజకవర్గాల ప్రజల చేసిన విజ్ఞప్తి మేరకు రిటైనింగ్‌ వాల్‌ నిర్మిస్తున్నట్టు చెప్పారు. వచ్చే జూన్‌కల్లా వీలైనంత మేర పనులు పూర్తి చేయాలని జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి తలసాని శ్రీనివా్‌సయాదవ్‌కు సూచించారు. సాగర్‌ సర్‌ప్లస్‌ నాలా విస్తరణ చేపడితే 400 దాకా ఆస్తులు సేకరించాల్సి వస్తుందని, స్థానిక ఎమ్మెల్యే విజ్ఞప్తి మేరకు 20 ఆస్తు లు మాత్రమే సేకరించేలా ప్రణాళిక మార్చి రిటైనింగ్‌ వాల్‌ నిర్మిస్తున్నట్టు చెప్పారు. రిటైనింగ్‌ వాల్‌ నిర్మాణం తో వేలాది మందికి ఉపశమనం కలుగుతుందన్నారు. 


ఎందుకు బహిష్కంచినట్లు? 

శంకుస్థాపన కార్యక్రమాన్ని బీజేపీ కార్పొరేటర్లు బహిష్కరించారు. స్థానిక ఎంపీ, కేంద్ర మంత్రి జీ కిషన్‌రెడ్డికి ఆలస్యంగా సమాచారమివ్వడమే ఇందుకు కారణమని పేర్కొన్నారు. సర్‌ప్లస్‌ నాలా ఉన్న అంబర్‌పేట, ముషీరాబాద్‌, ఖైరతాబాద్‌ నియోజకవర్గాల పరిధిలోని ఆరుగురు కార్పొరేటర్లకు ప్రొటోకాల్‌ ప్రకారం ఆహ్వానం పంపినట్టు జీహెచ్‌ఎంసీ వర్గాలు తెలిపాయి. అధికార పార్టీ కార్పొరేటర్‌ దూసరి లావణ్య మాత్రమే కార్యక్రమంలో పాల్గొనగా.. బీజేపీ కార్పొరేటర్లు ఐదుగురు గైర్హాజరయ్యారు. కిషన్‌రెడ్డికి బుధవారం మధ్యాహ్నం 2.30 గంటలకు శంకుస్థాపన ఉందని చెప్పారని, కేంద్రమంత్రి విషయంలో అధికారులు వ్యవహరించిన తీరును నిరసిస్తూ కార్యక్రమానికి వెళ్లలేదని బీజేపీ కార్పొరేటర్లు తెలిపారు. కేంద్రమంత్రికి ఒక రోజు ముందు సమాచారమిస్తే ఎలా? అని ప్రశ్నించారు. మే యర్‌ గద్వాల విజయలక్ష్మి కూడా కార్యక్రమానికి హాజ రు కాలేదు. ఆమె తండ్రి, రాజ్యసభ సభ్యుడు కే కేశవరావుకు కరోనా  నిర్ధారణైన నేపథ్యంలోనే విజయలక్ష్మి రాలేదని అధికారులు చెప్పారు. కాగా అంబర్‌పేట ని యోజకవర్గ బీజేపీ నేతలు పలువురిని కాచిగూడ పోలీసులు ముందస్తుగా అరెస్ట్‌ చేశారు. 


ప్రతి పట్టణానికీ జాతీయస్థాయి గుర్తింపు 

తమ ప్రభుత్వం చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమం లక్ష్యాలు పూర్తిచేయగలిగితే రాష్ట్రంలోని ప్రతి పట్టణానికీ  జాతీయ స్థాయి గుర్తింపు వస్తుందని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. ఆ దిశగా ప్రతి పట్టణాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి జరగాలన్నారు.  పట్టణాల పురోగతి కోసం ప్రత్యేకంగా టీ యూఎ్‌ఫఐడీసీ అనే సంస్థను ఏర్పాటుచేసి పట్టణ ప్రగతికి అదనంగా నిధులను కేటాయిస్తున్న విషయాన్ని గుర్తించాలన్నారు. ఈ నిధులతో పట్టణాల్లో పారిశుధ్యం తాగునీటి సరఫరా, విద్యుత్తు దీపాల నిర్వహణ, పచ్చదనం నిర్వహణ వంటి కార్యక్రమాలనుపై దృష్టి పెట్టాల్సిన బాధ్యతను పురపాలక సంఘాల ప్రజాప్రతినిధులతో పాటు అధికారులూ తీసుకోవాలని ఆదేశించారు. ఆర్నెల్లలోపు  సమీకృత శాకాహార, మాంసాహార మార్కెట్లను పూర్తి చేయాలని చెప్పారు. కాగా స్థానిక సంస్థల కోసం కలెక్టర్‌ స్థాయి అధికారిని ప్రత్యేకంగా నియమించిన వ్యవస్థ దేశంలో ఎక్కడా లేదని, తెలంగాణలో మాత్రమే ఉందని, స్థానిక సంస్థల అభివృద్ధికి చిత్తశుద్థితో అధికారులు పనిచేయాలన్నారు.  

Updated Date - 2021-12-31T08:12:15+05:30 IST