ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లు.. ప్రభుత్వం ఉత్తర్వులు

ABN , First Publish Date - 2021-02-08T21:41:51+05:30 IST

ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లు అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. విద్య, ఉద్యోగాల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు

ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లు.. ప్రభుత్వం ఉత్తర్వులు

హైదరాబాద్: ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లు అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. విద్య, ఉద్యోగాల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ నిర్ణయంతో అగ్రవర్ణాల్లో జన్మించి పేదరికంలో మగ్గుతున్నవారికి ఇకపై 10 శాతం రిజర్వేషన్లు అమలు కానున్నాయి. విద్య, ఉద్యోగావకాశాల్లో రిజర్వేషన్‌ ఫలాలు అందనున్నాయి. ఇవి అమల్లోకి రాగానే రాష్ట్రంలో మొత్తం రిజర్వేషన్ల శాతం 60కి చేరనుంది. రిజర్వేషన్ల అమలు తీరుపై ప్రభుత్వం మరింత స్పష్టతనివ్వాల్సి ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం బడుగు బలహీన వర్గాలకు రాష్ట్రంలో 50 శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయి. ఎస్సీలకు 15, ఎస్టీలకు 6, బీసీలకు 29.. మొత్తం 50 శాతం రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయి. టీఎస్‌పీఎస్సీ చేపట్టే వివిధ రకాల ఉద్యోగ ఖాళీల భర్తీలో ఈ 50% రిజర్వేషన్లను పాటిస్తోంది. ఇంజనీరింగ్‌, వైద్య, ఇతర విద్యా సంబంధిత సీట్ల భర్తీలోనూ ఇదే పద్ధతి అనుసరిస్తున్నారు. ఈడబ్ల్యూఎస్‌ కోసం విద్యా కోర్సుల్లో 10 శాతం సీట్లను పెంచాల్సిందే. అంటే 110 సీట్లలో 50 ఎస్సీ, ఎస్టీ, బీసీలతో మిగతా 50 సీట్లను ఓపెన్‌ కాంపిటీషన్‌తో, 10 సీట్లను ఈడబ్ల్యూఎస్‌తో భర్తీ చేస్తారు.

Updated Date - 2021-02-08T21:41:51+05:30 IST