వాల్మీకిబోయ భవన నిర్మాణానికి కృషి
ABN , First Publish Date - 2021-10-21T05:10:59+05:30 IST
వాల్మీకిబోయ భవన నిర్మాణానికి కృషి

మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు
ఘనంగా వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు
వరంగల్ కలెక్టరేట్, అక్టోబరు 20 : రామాయణ కావ్యాన్ని రచించిన మహానుభావుడు ఆది కవి వాల్మీకి మహర్షి అని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. బుధవారం వాల్మీకి మహర్షి జయంతి వేడుకలను జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా మంత్రి దయాకర్రావు మాట్లాడుతూ.. మడికొండలో వాల్మీకి బోయ భవన నిర్మాణానికి స్థలం కేటాయించినట్లు తెలిపారు. త్వరలో వరంగల్లోనూ స్థలం కేటాయిస్తామని హామీ ఇచ్చారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో పండుగలను గుర్తించి కవులు, కళాకారులు, మహనీయుల జయంతి, వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహిస్తోందని తెలిపారు. ఈ సంస్కృతి ఒక తెలంగాణ రాష్ట్రంలో తప్ప దేశంలో మరెక్కడా లేదన్నారు. అతి సామాన్యమైన బోయవాడు ఒక గొప్ప కవి కావడం మనదేశ సంస్కృతి గొప్పతనమని కొనియాడారు. వేట మానేసిన వాల్మీకి సాదుజీవిగా దేశమంతా తిరుగుతూ రామాయణాన్ని రాశారని చరిత్ర చెబుతోందని పేర్కొన్నారు. వాల్మీకి తపస్సు చేసిన పాలకుర్తి నియోజకవర్గంలోని వాల్మీకిపురం వల్మిడి గుట్టను ప్రభుత్వం రూ.10కోట్లతో అభివృద్ధి చేస్తుందన్నారు. కలెక్టర్ బి.గోపి మాట్లాడుతూ.. దసరా పండుగ తర్వాత పౌర్ణమి రోజున వాల్మీకి జయంతి ఉత్సవాలు నిర్వహించుకుంటున్నామని అన్నారు. ఈ సందర్భంగా వాల్మీకి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బి.హరిసింగ్, ఆర్డీవో మహేందర్జీ, బీసీ వెల్ఫేర్ అధికారి నర్సింహస్వామి, వాల్మీకి బోయ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జి.కృష్ణమూర్తి, జిల్లా అధ్యక్షుడు రమేష్ పాల్గొన్నారు.