సరైన టీచర్లుంటేనే ఇంగ్లీషు మీడియం!

ABN , First Publish Date - 2021-11-09T07:38:50+05:30 IST

ఇంగ్లీషు మీడియం పాఠశాలల నిర్వహణలో మార్పులు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.

సరైన టీచర్లుంటేనే ఇంగ్లీషు మీడియం!

స్కూళ్ల అప్‌గ్రేడేషన్‌పై ప్రభుత్వం కసరత్తు

హైదరాబాద్‌, నవంబరు 8 (ఆంధ్రజ్యోతి): ఇంగ్లీషు మీడియం పాఠశాలల నిర్వహణలో మార్పులు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీని కోసం కొత్తగా కొన్ని గైడ్‌లైన్స్‌ను రూపొందించాలని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటివరకు అనుసరిస్తున్న విధానంలో పలు లోపాలు ఉన్నాయని, వాటి వల్ల విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన అందడం లేదన్న అభిప్రాయం ప్రభుత్వ వర్గాల్లో ఉంది. ఈ లోపాలను సరిదిద్దడానికి  కొన్ని మార్పులు చేర్పులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ దిశగా అధికారులు కసరత్తును మొదలు పెట్టారు. ముఖ్యంగా ఇంగ్లీషు మీడియంలో బోధించే ఉపాధ్యాయులు, అదనపు తరగతి గదులు ఉన్న స్కూళ్లకే అనుమతిని ఇవ్వాలని యోచిస్తున్నారు. కేవలం స్కూళ్లు ఇచ్చే ప్రతిపాదనల ఆధారంగానే నిర్ణయం తీసుకోకుండా, క్షేత్ర స్థాయిలో పరిస్థితిని అంచనా వేసిన తర్వాతే ఇంగ్లీషు మీడియంలో బోధనకు అనుమతిని జారీ చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు త్వరలోనే కొత్తగా మార్గదర్శకాలను జారీ చేయాలని యోచిస్తోంది. 


రాష్ట్రంలో 2008-09 విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం విధానాన్ని అమలుచేస్తున్న విషయం తెలిసిందే. ఏటా కొన్ని స్కూళ్లు ఇంగ్లీషు మీడియం జాబితాలోకి వచ్చి చేరుతున్నాయి. ఇలా రాష్ట్రంలో ప్రస్తుతం సుమారు 8వేల స్కూళ్లలో ఇంగ్లీషు మీడియం బోధన అమల్లో ఉంది. ఇందులో 2,800 వరకు హైస్కూళ్లు కాగా, మిగిలినవి ప్రాథమిక పాఠశాలలు. ఇంగ్లీషు మీడియం ప్రారంభించిన సమయంలో టీచర్లకు సుమారు 13రోజులపాటు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. తర్వాత ఆయా పాఠశాలల పరిధిలో పనిచేసే ఉపాధ్యాయులే అవసరం మేరకు ఇంగ్లీషు మీడియం తరగతులను బోధిస్తున్నారు. 


పెండింగ్‌లోనే అప్‌గ్రేడేషన్‌ ప్రతిపాదనలు

ఇప్పటికే ప్రైమరీ స్థాయిలో ఉన్న ఇంగ్లీషు మీడియం స్కూళ్లను తర్వాతి దశలో ఉన్నత పాఠశాలగా అప్‌గ్రేడ్‌ చేస్తూ వస్తున్నారు. ఇలా ఈ ఏడాది రాష్ట్రంలో సుమారు 50 స్కూళ్లు అప్‌గ్రేడేషన్‌ కోసం ప్రతిపాదనలు పంపాయి. ముఖ్యంగా ఇంగ్లీషు మీడియంలో బోధించడానికి సరైన టీచర్లు లేనప్పటికీ... హెచ్‌ఎంల ప్రతిపాదనల ఆధారంగా అనుమతి ఇస్తున్నారు. తర్వాత టీచర్ల కొరత అంటూ విద్యా వాలంటీర్లను నియమించుకుంటున్నారు. కొన్ని చోట్ల విద్యార్థుల నుంచి ప్రత్యేక ఫీజులు వసూలు చేసి, ప్రైవేట్‌ టీచర్లతో పాఠాలు చెప్పిస్తున్నారు. వీటిని పరిశీలించిన ప్రభుత్వం ఈ విధానంలో మార్పులు తీసుకురావాలని నిర్ణయించినట్టు తెలిసింది. అందులో భాగంగానే ఈ ఏడాది అప్‌గ్రేడ్‌ చేయాల్సిన స్కూళ్ల ప్రతిపాదనలను ఇంకా పెండింగ్‌లోనే పెట్టారు. కేవలం 10వ తరగతి అప్‌గ్రేడేషన్‌ను పూర్తి చేసి, మిగిలిన వాటిపై తర్వాత నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు. 

Updated Date - 2021-11-09T07:38:50+05:30 IST