తెలంగాణలో స్టార్టప్‌లకు ప్రోత్సాహం
ABN , First Publish Date - 2021-10-28T08:30:20+05:30 IST
అంతర్జాతీయ సదస్సులో పాల్గొనేందుకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి కె.తారకరామారావు బుధవారం ఫ్రాన్స్...

- ఫ్రాన్స్ పర్యటనలో తొలిరోజు డిజిటల్ అఫైర్స్ అంబాసిడర్‌తో భేటీలో కేటీఆర్
హైదరాబాద్, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): అంతర్జాతీయ సదస్సులో పాల్గొనేందుకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి కె.తారకరామారావు బుధవారం ఫ్రాన్స్ పర్యటనకు వెళ్లారు. రాత్రి ఆయన ఫ్రాన్స్‌లో అడుగుపెట్టారు. పర్యటనలో భాగంగా తొలిరోజు కేటీఆర్.. ఫ్రాన్స్ ప్రభుత్వ డిజిటల్ అఫైర్స్ అంబాసిడర్ హెన్రీ వర్డియర్‌తో సమావేశం అయ్యారు.
ఇన్నొవేషన్, డిజిటలైజేషన్, ఓపెన్ డేటా వంటి రంగాల్లో ఫ్రాన్స్, తెలంగాణ మధ్య పరస్పర సహకారం అందించుకునే అవకాశంపై ఈ సమావేశంలో చర్చించారు. తెలంగాణ రాష్ట్రంలో ఇన్నొవేషన్, అంకుర సంస్థల(స్టార్టప్)ను ప్రోత్సహించడానికి జరుగుతున్న వివిధ కార్యక్రమాల గురించి, ఓపెన్ డేటాపాలసీ గురించి, రాష్ట్రంలో నిర్మాణం అవుతున్న డిజిటల్ మౌలిక సదుపాయాల గురించి వర్దియర్‌కు కేటీఆర్ వివరించారు. అటు తెలంగాణలోని అంకుర సంస్థలకు ఫ్రాన్స్‌లో, ఇటు ఫ్రాన్స్‌లోని అంకుర సంస్థలకు తెలంగాణలో వ్యాపార, వాణిజ్య అవకాశాలు కల్పించడం గురించి కూడా చర్చించామని కేటీఆర్ బుధవారం రాత్రి ఓ పత్రికా ప్రకటనను విడుదల చేశారు.
ఈ సమావేశంలో ఫ్రాన్స్‌లో భారత డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ కేఎం. ప్రపుల్లచంద్ర శర్మ, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్, డిజిటల్ మీడియా, ఏవియేషన్ డైరెక్టర్లు కొణతం దిలీప్, ప్రవీణ్ పాల్గొన్నారు. ఈనెల 29న అక్కడి సెనేట్‌లో జరగనున్న ‘యాంబిషన్ ఇండియా-2021’ సదస్సులో మంత్రి కేటీఆర్ మాట్లాడనున్నారు. అలాగే అక్కడి పారిశ్రామికవేత్తలతో సమావేశం కానున్నారు. తన బృందంతో మంత్రి నవంబరు-1న స్వదేశానికి తిరిగి రానున్నారు.