దళితులకు సాధికారత

ABN , First Publish Date - 2021-06-21T08:59:37+05:30 IST

దేశంలో కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి దాకా దళితుల పరిస్థితి ఏమీ బాగోలేదని సీఎం కేసీఆర్‌ అన్నారు.

దళితులకు సాధికారత

  • ఎంపవర్‌మెంట్‌ పేరిట కొత్త పథకం..
  • తెలంగాణ ముమ్మాటికీ ధనిక రాష్ట్రమే
  • లేకపోతే పథకాలన్నీ ఎలా అమలవుతాయి?
  • ఎవరొచ్చినా బంద్‌ చేయని విధంగా రూపకల్పన
  • ఎన్టీఆర్‌ రూ.2 కిలో బియ్యం స్ఫూర్తితో 1కి కిలో 
  • తెలంగాణ రాకముందే ‘మిషన్‌ కాకతీయ’ పేరు
  • విడతల వారీగా అన్ని జిల్లాల్లో మెడికల్‌ కాలేజీలు
  • రాజకీయాల్లో చిల్లరగాళ్లు మోపయ్యారు
  • వారిని పట్టించుకోను.. పని చేసుకుంటూ పోతా
  • బతికి ఉన్నంతకాలం చిత్తశుద్ధితో పనిచేస్తా
  • సిద్దిపేట, కామారెడ్డి పర్యటనలో సీఎం కేసీఆర్‌
  • కలెక్టరేట్‌, పోలీసు భవనాలను ప్రారంభించిన సీఎం

కామారెడ్డి/సిద్దిపేట, జూన్‌ 20 (ఆంధ్రజ్యోతి): దేశంలో కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి దాకా దళితుల పరిస్థితి ఏమీ బాగోలేదని సీఎం కేసీఆర్‌ అన్నారు. ఇప్పటికీ వారిని చులకనగానే చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దళితుల అభివృద్ధికి దేశంలోని అన్ని వర్గాలు సహకరించాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో త్వరలోనే ముఖ్యమంత్రి దళిత ఎంపవర్‌మెంట్‌  (సీఎండీఈ)ను అమలు చేస్తామని ప్రకటించారు. వీలైనంత త్వరలో ఈ పథకాన్ని అమలు చేసి వారి అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. దళితుల కోసం ఇప్పటికే రూ.1000 కోట్లను కేటాయించామన్నారు. రాష్ట్రంలోని ప్రజాప్రతినిధులందరూ దళిత జాతి సేవకు ముందుండాలని పిలుపునిచ్చారు. ఆదివారం సిద్దిపేట, కామారెడ్డి జిల్లా కేంద్రాల్లో నిర్మించిన నూతన సమీకృత కలెక్టరేట్‌, పోలీసు భవనాలను సీఎం ప్రారంభించారు. అనంతరం ప్రజాప్రతినిధులు, అధికారుల సమావేశాల్లో మాట్లాడారు. 


కామారెడ్డిలో సీఎం మాట్లాడుతూ.. కాళేశ్వరం సాగునీటితో రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులు, చెరువులకు నీటి కళ సంతరించుకునేలా చేశామన్నారు. ఇప్పుడు ఏ గ్రామం చూసినా.. పచ్చని పంట పొలాలతో కనిపిస్తోందన్నారు. ఽధాన్యం దిగుబడిలో దేశంలోనే తెలంగాణ నంబర్‌వన్‌గా నిలిచిందని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు నాలుగు నెలల ముందే చెరువులు బాగు చేయాలన్న ప్రొఫెసర్‌ జయశంకర్‌, విద్యాసాగర్‌రావు సూచనలతో మిషన్‌ కాకతీయను ప్రారంభించామని పేర్కొన్నారు. దానివల్లే చెరువులన్నీ ఎండకాలంలోనూ నిండుగా కనిపిస్తున్నాయని అన్నారు. ఎవరూ కోరకపోయినా.. పలు పథకాలు ప్రవేశపెట్టామని తెలిపారు. బీడీ కార్మికులకు దేశంలో ఎక్కడా లేనివిధంగా ప్రతి నెలా రూ.2016 చొప్పున పింఛన్‌ ఇస్తున్నామని అన్నారు. తాను బతికి ఉన్నంతకాలం ఈ పథకాలన్నీ అమలవుతూనే ఉంటాయని సీఎం స్పష్టం చేశారు.


కరోనా విజృంభణను అడ్డుకోగలిగాం..

కరోనా వైరస్‌ విజృంభణను రెండు దశల్లోనూ అడ్డుకోగలిగామని సీఎం కేసీఆర్‌ తెలిపారు. రాష్ట్రంలోని అన్ని జిల్లా ఆస్పత్రుల్లోనూ కరోనా రోగులకు మెరుగైన వైద్యం అందించినట్టు చెప్పారు. రానున్న రోజుల్లో ప్రతి జిల్లా కేంద్రంలో మెడికల్‌ కాలేజీ ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామన్నారు. కామారెడ్డి జిల్లాకు వచ్చే ఏడాదే మెడికల్‌ కాలేజీని మంజూరు చేసే బాధ్యత తనదేనన్నారు. కామారెడ్డి మునిసిపాలిటికి రూ.50 కోట్లు, బాన్సువాడ, ఎల్లారెడ్డి మునిసిపాలిటీలకు రూ.25 కోట్ల చొప్పున నిధులు మంజూరు చేస్తున్నట్లు, జిల్లాలోని 526 గ్రామ పంచాయతీలకు రూ.10లక్షల చొప్పున మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. కాగా, మహారాష్ట్రలోని నాందేడ్‌ జిల్లాలో ఉన్న 40గ్రామాలు తెలంగాణలో కలిసేందుకు తీర్మానం చేశాయని, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధికి ఇదే నిదర్శనమని ముఖ్యమంత్రి అన్నారు. రాష్ట్రంలో కరెంటు కోతలు లేకుండా పోవడంతోపాటు ఇతర రాష్ట్రాలకు విద్యుత్తును సరఫరా చేసే స్థాయికి ఎదిగామన్నారు. 


పిచ్చికూతలు పట్టించుకోను.. 

రాజకీయాల్లో కొందరు చిల్లర వ్యక్తులు చేరి.. పిచ్చికూతలు కూస్తున్నారని సీఎం కేసీఆర్‌ అన్నారు. కానీ, తాను వాటిని పట్టించుకోనని, తన పని మాత్రమే చేసుకుంటూ పోతానని తెలిపారు. సిద్దిపేటలో ప్రజాప్రతినిధులు, అధికారులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ‘‘నేను తెలంగాణ కోసం బయల్దేరిననాడు బక్కపాణమోడని నవ్విండ్రు. తెలంగాణ తెచ్చి చూపెట్టిన. ఇప్పుడు కూడా కుక్కలు మొరిగాయి.. ఇంకా మొరుగుతున్నాయి. ఈ పిచ్చికూతలు నేను పట్టించుకోను. రాజకీయాల్లో చిల్లరగాళ్లు మోపయ్యారు. థర్డ్‌క్లాస్‌ పాలిటిక్స్‌ చేస్తున్నారు. ప్రజలే న్యాయనిర్ణేతలు. వారి మనసెరిగి పనిచేయాలి. ప్రతి గడపకూ ప్రగతి ఫలాలు తాకాలి. నేను బతికి ఉన్నంతవరకు చిత్తశుద్ధితో పనిచేస్తా’’ అని అన్నారు. 


సిద్దిపేట అంటే రాష్ట్రానికి నడిగడ్డ అని, ఇక్కడి ప్రజల చేతుల్లో పెరిగిన బిడ్డగా ఇది జిల్లా కావాలని, ఈ ప్రాంతం బాగుపడాలని ఎంతో తపన పడ్డానని తెలిపారు. ఇప్పుడు ప్రత్యేక రాష్ట్రంతో దానిని సాధించుకున్నామన్నారు. ‘‘నేను ఎమ్మెల్యేగా ఉన్నపుడు ఊళ్లలో చీటికిమాటికి ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోయేవి. దీనికి ఇంటింటా ఉన్న కరెంటు హీటర్లే కారణమని తేలింది. దాంతో నేను స్వయంగా 46 గ్రామాలు తిరిగి అవగాహన కల్పించాను. చివరకు ఒకేరోజు 6,400 కరెంటు హీటర్లను గ్రామాల నడిబొడ్డున పగలగొట్టాం. సిద్దిపేట ప్రజల చైతన్యమంటే ఇలా ఉంటుందని ఆనాడే రుజువు చేశాం. ఎన్టీ రామారావు చేపట్టిన రెండు రూపాయలకు కిలో బియ్యం స్కీమ్‌ నాకు చాలా ఇష్టం. అప్పటిదాకా ఆకలికి గోస పడే పరిస్థితులు ఉండేవి. ఆ తర్వాత ఎంతో మార్పు వచ్చింది. అందుకే నేను కూడా ఒక్క రూపాయికే కిలో బియ్యాన్ని ప్రతి వ్యక్తికి 6 కిలోల చొప్పున ఇవ్వాలని నిర్ణయించాను. నేడు తెలంగాణలో ఎవరూ ఉపవాసం ఉంటలేరు. ఆకలిచావులు కూడా లేవు.


ధనిక రాష్ట్రం కాకపోతే ఈ పథకాలెక్కడివి!

తెలంగాణ ధనిక రాష్ట్రం కాకుంటే ఈ సంక్షేమ పథకాలన్నీ ఎలా నడుస్తాయని సీఎం కేసీఆర్‌ ప్రశ్నించారు. రాష్ట్రంలో అమలవుతున్న వివిధ సంక్షేమ పథకాలను వివరించారు. తెలంగాణ ముమ్మాటికీ ధనిక రాష్ట్రమేని, ఒకవేళ సంక్షేమ పథకాలకు ఇబ్బందులు తలెత్తితే మంత్రులు, ఎమ్మెల్యేల జీతాలైనా బంద్‌ చేస్తాం తప్ప.. సంక్షేమాన్ని మాత్రం ఆపేదిలేదని స్పష్టం చేశారు. భవిష్యత్తులోనూ ఎవరొచ్చినా ఈ పథకాలను నిలిపి వేయకుండా చేశామన్నారు. ఈ పథకాల వెనుక ఎంతో మథనం, ఏళ్ల తరబడి కఠోర శ్రమ దాగి ఉన్నాయన్నారు. ప్రజాప్రతినిధులపై చాలా బాధ్యత ఉందని, ప్రభుత్వం చేపట్టే అన్ని పనులను ప్రజలకు చేరువ చేసేలా ప్రవర్తించాలని ముఖ్యమంత్రి సూచించారు. నేల విడిచి సాము చేయొద్దన్నారు. ఇక రాష్ట్రంలోని నాలుగు దిక్కుల్లో నాలుగు వెటర్నరీ కాలేజీలను మంజూరు చేస్తున్నామని సీఎం ప్రకటించారు. సిద్దిపేట, నల్లగొండ, నిజామాబాద్‌, వరంగల్‌లో వీటిని ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. అన్ని గురుకులాల్లో జూనియర్‌ కళాశాల విద్యను ప్రారంభిస్తామన్నారు. ఈ సందర్భంగా సిద్దిపేటలో రెవెన్యూ ఉద్యోగుల అసోసియేషన్‌ భవన నిర్మాణానికి సీఎం కేసీఆర్‌ భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమాల్లో శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివా్‌సరెడ్డి, మంత్రులు హరీశ్‌రావు, మహమూద్‌ అలీ, ప్రశాంత్‌రెడ్డి, సీఎస్‌ సోమేష్‌ కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, రాష్ట్ర పోలీసు హౌజింగ్‌ బోర్డు చైర్మన్‌ దామోదర్‌ గుప్తా తదితరులు పాల్గొన్నారు. కాగా, సిద్దిపేట నుంచి కామారెడ్డికి ముఖ్యమంత్రి రెండు గంటలు ఆలస్యంగా చేరుకున్నారు. దీంతో కార్యక్రమాలు ఆలస్యం కావడంతో రాత్రి 8:30 గంటలకు రోడ్డు మార్గంలో హైదరాబాద్‌కు తిరిగి వెళ్లారు. 


సెటైర్లు, సామెతలతో నవ్వించిన సీఎం 

సిద్దిపేటలో సీఎం కేసీఆర్‌ ప్రసంగం ఆసాంతం ఫుల్‌ జోష్‌తో సాగింది. పిట్టకథలు, సెటైర్లు, సామెతలతో అక్కడికి వచ్చిన వారిని కడుపుబ్బా నవ్వించింది. ఒక్కోసారి ఆలోచింపజేసింది. పాతికేళ్ల క్రితం నాటి సిద్దిపేట నియోజకవర్గ సమస్యలు, అప్పటి నేతలతో జరిగిన సంఘటనలను కేసీఆర్‌ వివరిస్తూ. ఓసారి మందపల్లిలో కోడిగుడ్డు అట్టు తిన్న విషయాన్ని చెప్పారు. దీనినే ఇప్పుడు ఆమ్లెట్‌ అంటున్నారని అనడంతో అంతా నవ్వారు. ఇక ఆక్సిజన్‌ కొనుక్కోవడం సిగ్గుపడాల్సిన విషయమని, అందుకే మూతికో బట్ట, వెనకో బట్ట కట్టుకు తిరగాల్సి వచ్చిందని చమత్కరించారు. గోకేటోడు, గీకేటోడు అని, కుక్కలు మొరుగుతున్నాయని పలుమార్లు వ్యాఖ్యానించారు. రైతుబంధు సాయాన్ని కూడా ఒకరిద్దరు తాగడం కోసం వినియోగిస్తున్నారంటూ తనదైన శైలిలో సెటైర్‌ వేశారు. ‘‘ఈ మధ్య ఓ పెళ్లికి వెళితే మాస్కు తీసి ఫొటో దిగాలని, మళ్లీ మీరు దొరకరని పెళ్లికొడుకు అనడంతో.. మాస్కు తీస్తే కరోనాకు నేను దొరుకుతానని చెప్పాను. అలా.. వాడు గుంజి, వీడు గుంజి చివరకు నాకు కూడా కరోనా వచ్చింది’’ అని కేసీఆర్‌ నవ్వించారు. అంతకుముందు సీఎం సిద్దిపేటలో హెలికాప్టర్‌ దిగగానే అక్కడే ఉన్న తన బాబాయి బాలకిషన్‌రావు ఆశీర్వాదం తీసుకున్నారు. కాగా, నాలుగు దశాబ్దాల క్రితం సిద్దిపేట జిల్లా కోసం అప్పటి ముఖ్యమంత్రి ఎన్‌టీ రామారావుకు కేసీఆర్‌ అర్జీ పెట్టారని, ఇప్పుడు అదే చేతితో సిద్దిపేట జిల్లాకు ఆమోదం తెలిపి, ఆయన స్వప్నాన్ని స్వయంగా సాకారం చేశారని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు చెప్పారు.



Updated Date - 2021-06-21T08:59:37+05:30 IST