ఆన్‌లైన్‌లో భవిష్యత్‌ టెక్నాలజీ కోర్సులు

ABN , First Publish Date - 2021-02-06T09:19:33+05:30 IST

భవిష్యత్తులో పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు లభించే కోర్సులను డిగ్రీ, ఇంజనీరింగ్‌ విద్యార్థులు ఆన్‌లైన్‌లో ఉచితంగా అభ్యసించే అవకాశం లభించనుంది. తెలంగాణ ఉన్నత విద్యా మండలితో..

ఆన్‌లైన్‌లో భవిష్యత్‌ టెక్నాలజీ కోర్సులు

డిగ్రీ, ఇంజనీరింగ్‌ విద్యార్థులకు ఉచితం..

ఉన్నత విద్యా మండలితో ‘టాస్క్‌’ ఒప్పందం


 భవిష్యత్తులో పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు లభించే కోర్సులను డిగ్రీ, ఇంజనీరింగ్‌ విద్యార్థులు ఆన్‌లైన్‌లో ఉచితంగా అభ్యసించే అవకాశం లభించనుంది. తెలంగాణ ఉన్నత విద్యా మండలితో.. తెలంగాణ అకాడమీ ఫర్‌ స్కిల్‌ అండ్‌ నాలెడ్జ్‌ (టాస్క్‌), నేషనల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ సాఫ్ట్‌వేర్‌ సర్వీస్‌ కంపెనీస్‌ (నాస్కామ్‌) ఈ మేరకు ఒప్పందం కుదుర్చుకున్నాయి. అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) సూచనల నేపథ్యంలో ఈ ఒప్పందం చేసుకున్నాయి. శుక్రవారం జరిగిన వర్చువల్‌ సమావేశంలో ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్‌ రంజన్‌, ఉన్నత విద్యా మండలి ఛైర్మన్‌ పాపిరెడ్డి, ఉపాధ్యక్షులు ఆచార్య లింబాద్రి, ఆచార్య వెంకటరమణ, టాస్క్‌ సీఈవో శ్రీకాంత్‌ సిన్హా, నాస్కామ్‌ ఉపాధ్యక్షురాలు సంధ్య చింతల తదితరులు పాల్గొన్నారు.


జయేష్‌ రంజన్‌ మాట్లాడుతూ.. విద్యార్థులకు ఉపాధి అవకాశాలు పెరగాలంటే.. భవిష్యత్‌ టెక్నాలజీలో నైపుణ్యం అందించాల్సి ఉందన్నారు. తాజా ఒప్పందంతో విద్యార్థులు ఏఐ, ఐవోటీ, బిగ్‌ డేటా అనలిటిక్స్‌, రోబోటిక్‌ ప్రాసెస్‌ ఆటోమేషన్‌, అడిటివ్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌-3డి ప్రింటింగ్‌, క్లౌడ్‌ కంప్యూటింగ్‌, సోషల్‌ అండ్‌ మొబైల్‌ సైబర్‌ సెక్యూరిటీ, ఏఆర్‌-వీఆర్‌, బ్లాక్‌ చైన్‌లలో ఏదైనా ఒక కోర్సును ఉచితంగా అభ్యసించి సర్టిఫికెట్‌ పొందవచ్చని జయేష్‌ రంజన్‌ తెలిపారు. పాపిరెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థులకు ఉపాధి అవకాశాలు పెంచే ఈ కోర్సులకు ఉన్నత విద్యామండలి సహకారం అందిస్తుందన్నారు. 

Updated Date - 2021-02-06T09:19:33+05:30 IST