రహదారిపై ‘ఈ’ కన్ను
ABN , First Publish Date - 2021-08-20T09:39:03+05:30 IST
ట్రాఫిక్ రద్దీ, ప్రమాదాలు ఎక్కువగా నమోదయ్యే జాతీయ, రాష్ట్ర రహదారులు, నగరాల్లోని కీలక కూడళ్లలో భద్రతా చర్యలను పటిష్ఠం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇలాంటి కూడళ్లు, రహదారులు ఇకపై ఎలకా్ట్రనిక్ వ్యవస్థ(ఎలకా్ట్రనిక్ ఎన్ఫోర్స్మెంట్..
వాహనదారులపై నిఘా కఠినతరం..
రూల్స్ బ్రేక్ చేస్తే ప్రాంతం, సమయం నమోదుచేసే వ్యవస్థ
15 రోజుల్లోపే ఈ-చలాన్ జారీ
రోడ్డు భద్రతా చర్యల్లో భాగంగా దేశంలోని 132 నగరాల్లో ఏర్పాటు
వీటిలో ఏపీనుంచి 13 నగరాలు తెలంగాణ నుంచి 4 ఎంపిక
కేంద్రం గెజిట్ నోటిఫికేషన్
న్యూఢిల్లీ, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): ట్రాఫిక్ రద్దీ, ప్రమాదాలు ఎక్కువగా నమోదయ్యే జాతీయ, రాష్ట్ర రహదారులు, నగరాల్లోని కీలక కూడళ్లలో భద్రతా చర్యలను పటిష్ఠం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇలాంటి కూడళ్లు, రహదారులు ఇకపై ఎలకా్ట్రనిక్ వ్యవస్థ(ఎలకా్ట్రనిక్ ఎన్ఫోర్స్మెంట్ డివైస్) పర్యవేక్షణలోకి రానున్నాయి. ఇందులోభాగంగా దేశవ్యాప్తంగా 132 నగరాలను, 10 లక్షల జనాభా దాటిన ప్రాంతాలను ఈ వ్యవస్థ పరిధిలోకి తెచ్చింది. వీటిలో తెలంగాణ నుంచి హైదరాబాద్, నల్లగొండ, పటాన్చెరు, సంగారెడ్డి ఉన్నాయి. ఏపీలో 13 నగరాలు-- గుంటూరు, కర్నూలు, నెల్లూరు, విజయవాడ, విశాఖపట్నం, అనంతపురం, చిత్తూరు, ఏలూరు, కడప, ఒంగోలు, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, విజయనగరాలను గుర్తించారు. ఈ మేరకు కేంద్ర రహదారులు, రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ గురువారం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. డ్రైవింగ్ సమయంలో ట్రాఫిక్ నియమావళి ఉల్లంఘించడం, వేగ నియంత్రణ, పార్కింగ్ నియమాలు పాటించకపోవడం వంటి అలసత్వ చర్యలకు పాల్పడే వాహనదారులను పకడ్బందీగా కట్టడి చేయడానికి ఎలకా్ట్రనిక్ వ్యవస్థ దోహదపడుతుందని తెలిపింది. ఈ వ్యవస్థలో స్పీడ్ కెమెరా, సీసీ కెమెరా, స్పీడ్ గన్, బాడీ వేరేబుల్ కెమెరా, డ్యాష్‌బోర్డు కెమెరా, ఆటోమెటిక్ నంబర్ ప్లేట్ రికగ్నైజేషన్(ఏఎన్పీఆర్), వెయిట్-ఇన్-మెషీన్ మొదలైన అత్యాధునిక సాంకేతిక ఎలకా్ట్రనిక్ పరికరాలు ఉంటాయి. వీటిని రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది.
ఎలా పనిచేస్తుంది?
ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా, రహదారులపై వాహనదారుల దృష్టికి ఆటంకం కలగనివిధంగా ఎలకా్ట్రనిక్ పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. ఒకవేళ నియమాలను ఉల్లంఘించి, అదుపుతప్పి వాహనాలు నడిపితే.. ప్రాంతం, తేదీ, సమయం వంటి సమాచారం నమోదవుతుంది. ఈ సమాచారం ఆధారంగా డ్రైౖవింగ్లో అలసత్వం ప్రదర్శించిన వాహనదారులకు కేంద్ర మోటారు వాహన చట్టం, కేంద్ర మోటారు వాహన నిబంధనలు, రోడ్ సేఫ్టీ చట్టం మేరకు జరిమానాలు విధిస్తారు. నిర్దేశించిన వేగపరిమితిలో డ్రైవింగ్ చేయకపోతే సెక్షన్ 112, 183 కింద చర్యలు తీసుకుంటారు. అనధికార ప్రదేశంలో వాహనాలను పార్కింగ్ చేస్తే సెక్షన్ 122కింద దండిస్తారు. వాహనం నడుపుతున్న వారితోపాటు వెనుక కూర్చునేవారు కూడా భద్రత చర్యలు పాటించాలి. లేదంటే సెక్షన్ 128 కింద చర్యలు తప్పవు. సిగ్నల్ జంపింగ్, స్టాప్‌లైన్ జంపింగ్, సెల్‌ఫోన్ డ్రైవింగ్, రాంగ్‌సైడ్ ఓవర్‌టేకింగ్, రాంగ్‌సైడ్ డ్రైవింగ్, ర్యాష్/డేంజర్స(ప్రమాదకర) డ్రైవింగ్ వంటి ఉల్లంఘనలకు జరిమానాలు వేస్తారు. అదే సమయంలో ట్రాఫిక్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులకూ ఈ గెజిట్ కొన్ని విధులను నిర్దేశిస్తుంది.
జరిమానా విధించిన 15 రోజుల్లోగా వాహనదారుడికి ఈ-చలానాను అందజేయాలి. ఉల్లంఘనకు సంబంధించిన ఆధారాలను ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం సేకరించాలి. ఉల్లంఘనకు సంబంధించిన ఫొటోపై.. లొకేషన్, టైమ్, డేట్ స్టాంప్ ఉండాలి. వాహనదారుడు చేసిన ఉల్లంఘన, చలానాను ఏ సెక్షన్/రూల్ కింద విధిస్తున్నారు? వంటి అంశాలను నోటీసులో స్పష్టంగా పేర్కొనాల్సి ఉంటుంది.