జోరుగా హుషారుగా..

ABN , First Publish Date - 2021-02-04T08:07:31+05:30 IST

‘తెలంగాణ ఎలక్ట్రిక్‌ అండ్‌ ఎనర్జీ స్టోరేజీ పాలసీ 2020-30’ పేరిట.. పర్యావరణహిత ఎలక్ట్రిక్‌ వాహనాలను కొనుగోలు చేసేవారికి రాష్ట్రప్రభుత్వం ప్రత్యేక తాయిలాలు

జోరుగా హుషారుగా..

ఎలక్ట్రిక్‌ వాహనాలకు పెరుగుతున్న ఆదరణ

దేశంలో 147 రకాల ఈ-బైక్స్‌ అందుబాటులో

ఆరు ఈ-కార్లు.. ఈ ఏడాది మరిన్ని కార్ల రాక!

రాష్ట్ర ప్రభుత్వ తాయిలాలతో అమ్మకాల జోరు

చార్జింగ్‌ సమస్యను అధిగమిస్తే ఎదురే ఉండదు

భారీగా తగ్గనున్న సగటు ప్రయాణ ఖర్చులు


హైదరాబాద్‌ సిటీ, ఫిబ్రవరి 3(ఆంధ్రజ్యోతి): ‘తెలంగాణ ఎలక్ట్రిక్‌ అండ్‌ ఎనర్జీ స్టోరేజీ పాలసీ 2020-30’ పేరిట.. పర్యావరణహిత ఎలక్ట్రిక్‌ వాహనాలను కొనుగోలు చేసేవారికి రాష్ట్రప్రభుత్వం ప్రత్యేక తాయిలాలు ప్రకటించిన నేపథ్యంలో చాలా మంది దృష్టి వాటిపై పడింది! ఈ-వాహనాలతో తాయిలాలు అంతటితో అయిపోవు. తగ్గిన ఇంధన, నిర్వహణ ఖర్చు రూపంలో వాటిని వాడినంతకాలం అందుతూనే ఉంటాయి!! మామూలు వాహనాలతో పోలిస్తే ఎలక్ట్రిక్‌ వాహనాల ధరలు కొద్దిగా ఎక్కువే అయినా.. నిర్వహణ, ఇంధన ఖర్చులు తక్కువ. అందుకే మార్కెట్‌లో ఈ వాహనాలకు ప్రజాదరణ క్రమంగా పెరుగుతోంది. కంపెనీలూ ఈ దిశగా దృష్టి సారిస్తున్నాయి. దీంతో ప్రస్తుతం 147 రకాల ఎలక్ట్రిక్‌ వాహనాలు మనదేశంలో అందుబాటులో ఉన్నాయి. వాటి ధరలు రూ.25 వేల నుంచి రూ.1.46 లక్షల దాకా (ఎక్స్‌ షోరూమ్‌ ధర) ఉన్నాయి.


బజాజ్‌ కంపెనీ ఎప్పుడో ఆపేసిన ‘చేతక్‌’ను.. మళ్లీ ఎలక్ట్రిక్‌ వాహనం రూపంలో అందుబాటులోకి తెచ్చింది! హీరో సంస్థ సైతం ఎలక్ట్రిక్‌ విభాగంలో పలు మోడళ్లను రంగంలోకి దించింది. బెంగళూరుకు చెందిన ఒక స్టార్టప్‌ కంపెనీ కొత్తగా ప్రవేశపట్టిన అథెర్‌ మోడల్‌ వాహనాలు ఈ-బైక్‌ల విపణిలో సంచలనం సృష్టిస్తున్నాయి. ఇక.. ఎలక్ట్రిక్‌ కారు అనగానే ఒకప్పుడైతే రేవా పేరు వినిపించేది. ఇప్పుడు ఆరేడు మోడళ్లు అందుబాటులో ఉన్నాయి. మెర్సిడెస్‌ బెంజ్‌, ఎంజీ, టాటా, హ్యూండాయ్‌, మహీంద్ర తదితర ప్రముఖ కార్ల తయారీ సంస్థలన్నీ ఈ-కార్ల ఉత్పత్తిపై దృష్టిసారించాయి. మరికొన్ని ఇప్పుడిప్పుడే ఆ దిశగా అడుగులు వేస్తున్నాయి. ఇంధనాల ధరలు పెరిగిపోవడం.. వాటి వల్ల విడుదలయ్యే కర్బన ఉద్గారాలతో వాయుకాలుష్యం పెరిగపోవడం, వాయుకాలుష్యం వల్ల భూతాపం ఆందోళనకరస్థాయికి చేరుతుండడం.. ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఈ-వాహనాలకు ఆదరణ పెరుగుతుండడంతో కార్ల కంపెనీలూ ఆ దిశగా మార్పుచేర్పులు చేసుకుంటున్నాయి. మనదేశంలో కూడా ఈ ఒరవడి ఇలాగే కొనసాగి 2030 నాటికి ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ మార్కెట్‌ విస్తృతంగా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. 


అలా అయితేనే..

మనదేశంలో ఎలక్ట్రిక్‌ వాహనాల జోరుకు అడ్డుకట్ట వేస్తున్న ప్రధాన అడ్డంకి.. చార్జింగ్‌ సమస్య. మామూలు వాహనాల్లో ఇంధనం అయిపోతే ఎక్కడికక్కడే పెట్రోల్‌ బంకులున్నాయి కాబట్టి ఎలాంటి భయం లేకుండా దూరప్రయాణాలు చేయగలం. కానీ, ఎలక్ట్రిక్‌ వాహనాలతో అలా కుదరదు. ఒక ఎలక్ట్రిక్‌ బైక్‌ను మోడల్‌ను బట్టి నాలుగున్నర గంటల నుంచి ఎనిమిది గంటలపాటు చార్జింగ్‌ చేస్తే అది 50 నుంచి 150 కిలోమీటర్ల దాకా ప్రయాణిస్తుంది. అదే కారైతే.. అత్యంత అధునాతనమైన టెస్లా కారు లేటెస్ట్‌ మోడల్‌లో సైతం ఒక చార్జింగ్‌కు గరిష్ఠంగా 550 కిలోమీటర్ల దాకా వెళ్లొచ్చు. అదీ ఆ కంపెనీ నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం ప్రయాణిస్తేనే. అంతకన్నా ఎక్కువ దూరం వెళ్లాలంటే ఇబ్బందే. ఒకవేళ పెట్రోల్‌ బంకుల్లా విస్తృతంగా చార్జింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేస్తారనుకున్నా.. చార్జింగ్‌ సమయం పెద్ద సమస్యే. ఒక్కో కారు లేదా బైక్‌ ఆయా చార్జింగ్‌ స్టేషన్లలో నాలుగున్నర గంటల నుంచి ఎనిమిది గంటలపాటు ఉండడం ఆచరణలో కుదిరే పని కాదు.


అందుకే మనదేశంలో ఇంకా ఎలక్ట్రిక్‌ వాహనాల మార్కెట్‌ ఊపందుకోవట్లేదు. దీంతో పలు కార్ల కంపెనీలు హైబ్రీడ్‌ వెహికల్స్‌ను అందుబాటులోకి తెస్తున్నాయి. నిజానికి, గతంతో పోలిస్తే ఈవాహనాలు కొనుగోలు చేస్తున్నవారి సంఖ్య ఎక్కువగానే ఉందిగానీ.. మామూలు వాహనాల మార్కెట్‌ స్థాయిలో మాత్రం జోరు లేదు. ఆ స్థాయికి చేరుకోవడానికి ఇంకా చాలాకాలమే పడుతుందని అంచనా. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఈ-వాహనాలను తయారుచేస్తున్న కంపెనీలే చర్యలు చేపడుతున్నాయి.


20 నుంచి 40 పైసలు

ఎలక్ట్రిక్‌ వాహనాలతో సగటు ప్రయాణ ఖర్చు భారీగా తగ్గిపోతుంది. ఉదాహరణకు.. సాధారణ బైక్‌లు మోడల్‌ను బట్టి సగటున లీటర్‌ పెట్రోలుకు 30-60 కిలోమీటర్ల దాకా మైలేజీని ఇస్తాయి. అంటే.. కిలోమీటరుకు సగటున రూ.1.50-2.25 దాకా ఖర్చవుతుంది. అదే ఈ-బైక్‌లతో అయితే కిలోమీటరు ప్రయాణానికి సగటున 20 పైసల నుంచి 40 పైసల దాకా ఖర్చవుతుంది. కార్లకు కూడా ఇలాగే  సగటు ప్రయాణ ఖర్చు తగ్గుతుంది. వాయుకాలుష్యం సమస్యకు తెరపడుతుంది. అంతేనా.. సర్వీసింగ్‌ ఖర్చు కూడా మామూలు వాహనాలతో పోలిస్తే ఈ-వాహనాలకు చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే.. ఈ-వాహనాల్లో విడిభాగాలు చాలా తక్కువ ఉంటాయి. కాబట్టి నిర్వహణ ఖర్చు కూడా తక్కువే ఉంటుంది. 


డ్రైవింగ్‌ లైసెన్స్‌ అక్కర్లేని బైక్‌ అని రెండేళ్ల క్రితం మా అమ్మ ఈ ఎలక్ట్రిక్‌ బైక్‌ కొనిచ్చారు. ధర రూ.52 వేలు. ప్రస్తుతానికి మా కాలనీలో తిరగడానికే వాడుతున్నా. వేగం 35 కిలోమీటర్లకు మించదు. దీంతో ఏదైనా అప్‌ ఎక్కేటప్పుడు కాస్త విసుగ్గా ఉంటుందిగానీ.. సేఫ్‌. ఒకసారి చార్జింగ్‌ చేస్తే వారం రోజుల వరకూ సరిపోతోంది. వేగం తక్కువ కాబట్టి హైవేల మీద వెనుక వచ్చే వాహనాలతో ప్రమాదం జరుగుతుందేమోనన్న భయం ఉంటుంది. 

 శ్రీకృతి, విద్యార్థిని, మణికొండ


తెలంగాణ ప్రభుత్వం కూడా హైవేలలో ప్రతి 50 కిలోమీటర్లకు ఒక ఈవీ చార్జింగ్‌ను ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. కీలక ప్రాంతాల్లో 178కి పైగా ఈవీ చార్జింగ్‌ స్టేషన్‌లను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇక.. దేశంలోని 69 వేలకుపైగా పెట్రోలు బంకుల్లో బంకుకు కనీసం ఒకటి చొప్పున చార్జింగ్‌ స్టేషన్లు పెట్టేందుకు కృషి చేస్తామని కేంద్రం ఇప్పటికే ప్రకటించింది. వినియోగదారుల ఇళ్లల్లో కూడా చార్జింగ్‌ పాయింట్లు ఇన్‌స్టాల్‌ చేసేందుకు ఒరిజినల్‌ ఎక్వి్‌పమెంట్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ సంస్థలు కసరత్తు చేస్తున్నాయి. కానీ.. 2026 నాటికి దేశంలో ఈవీ చార్జింగ్‌ స్టేషన్లు వేలల్లో సరిపోవని, లక్షల్లో  కావాల్సి వస్తాయని అంచనా. 2026 నాటికి దేశంలో 20 లక్షల ఎలక్ట్రిక్‌ కార్లు ఉంటాయని.. 4 లక్షల చార్జింగ్‌ స్టేషన్లు అవసరమవుతాయని భావిస్తున్నారు. అయితే.. మామూలు వాహనాల సంఖ్య పెరిగిన కొద్దీ పెట్రోల్‌ బంకుల సంఖ్య పెరిగినట్టు, ఎలక్ట్రిక్‌ కార్ల వినియోగం పెరిగే కొద్దీ చార్జింగ్‌ స్టేషన్ల సంఖ్య కూడా పెరుగుతందని మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. కానీ, చార్జింగ్‌ వేగాన్ని గంటల నుంచి నిమిషాలకు తగ్గిస్తేగానీ మనదేశంలో ఈ-వాహనాల కొనుగోళ్లు ఊపందుకోవని వినియోగదారులు అంటున్నారు. బోలెడు డబ్బు పోసి కొన్న వాహనంలో ఎక్కువ దూరం వెళ్లలేకపోతే ఇంకెందుకన్నది వారి ప్రశ్న!!

Updated Date - 2021-02-04T08:07:31+05:30 IST