ఎల్బీనగర్ టు దండు మల్కాపూర్..ఆరు వరుసల రహదారి
ABN , First Publish Date - 2021-04-07T08:40:26+05:30 IST
రాజధాని హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లేటప్పుడు.. టోల్ రోడ్డు ఎప్పుడొస్తుందా అని అంతా ఎదురుచూస్తారు! ముఖ్యంగా..
- హైదరాబాద్ టు వెంకటాపురం రోడ్డుకు మహర్దశ
- రహదారుల విస్తరణ, అభివృద్ధికి కేంద్రం ఆమోదం
హైదరాబాద్ , ఏప్రిల్ 6 (ఆంధ్రజ్యోతి): రాజధాని హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లేటప్పుడు.. టోల్ రోడ్డు ఎప్పుడొస్తుందా అని అంతా ఎదురుచూస్తారు! ముఖ్యంగా.. ఎల్‌బీనగర్ చౌరస్తా నుంచి టోల్ రోడ్డు మొదలయ్యే దండు మల్కాపూర్ దాకా రోడ్డంతా గతుకులు, ట్రాఫిక్ రద్దీతో విసుగొస్తుంది! ఆ కష్టాలు ఇక తీరనున్నాయి. మొత్తం 26 కిలోమీటర్ల మేర ఉన్న ఈ నాలుగు వరుసల రహదారి విస్తరణ కోసం ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మంత్రి కేటీఆర్.. పలు మార్లు చేసిన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ మేరకు.. జాతీయ రహదారి 65ని దండుమల్కాపురం నుంచి ఎల్‌బీ నగర్ కూడలి వరకూ విస్తరించనున్నారు. ప్రస్తుతం మరమ్మతులు అవసరమైన దశలో ఉన్న ఈ రహదారి విస్తరణ పనులకు రూ.550 కోట్లు ఖర్చు అవుతుందని రాష్ట్రం చేసిన ప్రతిపాదనలకు కేంద్రం ఆమోదం తెలిపింది.విస్తరణ పనుల్లో భాగంగా ఎనిమిది క్రాస్ రోడ్‌ల వద్ద ఫ్లై ఓవర్లను నిర్మిస్తారు. మూడు సర్వీస్ రోడ్లనూ అభివృద్ధి చేస్తారు. ఫ్లై ఓవర్లు నిర్మించే చోట సర్వీసు రోడ్లను ప్రతిపాదించారు. 334 కి.మీ. పొడవైన జాతీయ రహదారి 163లోనూ(హైదరాబాద్-భువనగిరి-ఆలేరు-జనగాం-వరంగల్-ఏటూరు నాగారం-వెంకటాపురం) విస్తరణ పనులు చేపట్టనున్నారు. ఇందుకోసం 317.19 కోట్లను కేటాయిస్తున్నట్లు కేంద్రమంత్రి గడ్కరీ తెలిపారు.