మళ్లీ ‘లాక్’
ABN , First Publish Date - 2021-03-24T05:30:00+05:30 IST
మళ్లీ ‘లాక్’

మూతపడ్డ విద్యా సంస్థలు
ఇంటికి పరిమితమైన విద్యార్థులు
ఖాళీ అయిన హాస్టళ్లు
నేటి నుంచి ఆన్‌లైన్ క్లాసులు
భూపాలపల్లిటౌన్, మార్చి 24 : విద్యా సంస్థలు మళ్లీ మూతపడ్డాయి. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం మేరకు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలకు తాళం పడింది. మంగళవారం ప్రకటన వెలువడగానే హాస్టల్స్ విద్యార్థులు ఇంటి బాటపట్టడం మొదలెట్టారు. గత ఏడాది మార్చి 22న దేశవ్యాప్తంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్ విధించాయి. అప్పటి నుంచి విద్యా సంస్థలు మూతపడగా గత ఏడాది సెప్టెంబరు నుంచి ఆన్‌లైన్ క్లాసులు ప్రారంభించారు. కరోనా తగ్గుముఖం పట్టడంతో ఈఏడాది ఫిబ్రవరి 2న తొమ్మిది, పదో తరగతి, ఇంటర్, డిగ్రీ విద్యార్థులకు నేరుగా తరగతులు మొదలెట్టారు. ఫిబ్రవరి 23 నుంచి కొ ద్ది రోజులకే ఆరో తరగతి నుంచి క్లాసులు ప్రారంభమయ్యాయి. దేశవ్యాప్తంగా కరోనా విజృంభించడం, రాష్ట్రంలో పలుచోట్ల పాజిటివ్ కేసులు పెరగడంతో విద్యా సంస్థలను మూసేందుకు సర్కారు నిర్ణయించింది.
బోసిబోయిన విద్యా సంస్థలు
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు బుధవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు హాస్టళ్లు ఖాళీ అయ్యాయి. విద్యార్థులను ఉపాధ్యాయులు తమ తల్లిదండ్రులను పిలిపించి ఇంటికి పంపారు. జిల్లాలో 38 హాస్టళ్లు ఉండగా అందులో 11 కేజీబీవీలు, ఆరు మోడల్ స్కూల్స్, 15 ప్రీ మెట్రిక్ హాస్ట ళ్లు, నాలుగు పోస్ట్‌మెట్రిక్ హాస్టళ్లు, ఒకటి అర్బన్ రెసిడెన్షియల్, ఒకటి మైనారిటీ హాస్టల్ ఉన్నాయి. వీటిలో 7,975 మంది విద్యార్థులు ఉన్నా రు. లాక్‌డౌన్ తర్వాత విద్యా సంస్థలు పునఃప్రారంభం కావడంతో ఆయా హాస్టళ్లలో విద్యార్థులు 4,306 మంది హాజరయ్యారు. అలాగే జిల్లాలో జూనియర్ కళాశాలలు ఏడు ఉండగా, కేజీబీవీ, మోడల్ స్కూల్ కళాశాలలు 12 ఉన్నాయి. వీ టిలో 4, 100 మంది విద్యార్థులు ఉన్నారు. డిగ్రీ కళాశాలలు ఏడు ఉండగా 2,100 మంది, పీజీ కళాశాలలు రెండు ఉండగా 450 మంది విద్యార్థులు ఉన్నారు. ఒక పాలిటెక్నిక్ కళాశాల ఉండగా 320 మంది విద్యార్థులు ఉన్నారు. కొత్తగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు వీరందరూ ఇళ్లకే పరిమితం కానున్నారు.
ఇక ఆన్‌లైన్ క్లాసులే..
విద్యా సంస్థలు మూసివేత నేపథ్యంలో గురువారం నుంచి మళ్లీ ఆన్‌లైన్ తరగతులు నిర్వహించనున్నారు. ఇది వరకు మాదిరిగానే ఉపాధ్యాయులు పాఠశాలలకు చేరుకొని పాఠ్యాంశాలు ఆన్‌లైన్‌లో బోధించడంతోపాటు విద్యార్థుల తీరును పర్యవేక్షించాలని, వారు ఆన్‌లైన్ తరగతులు వింటున్నారా.. లేదా..? అనే విషయాన్ని పరిశీలించాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు జారీ అయ్యా యి. విద్యార్థులకు ఉన్న సందేహాలను నివృత్తి చేయాలని అందులో పేర్కొన్నారు.
ఇంటి దారి పట్టిన విద్యార్థులు
ములుగు : కరోనా మళ్లీ విజృంభిస్తుండటంతో రాష్ర ్టప్రభుత్వం విద్యాసంస్థలను మూసివేయాలని నిర్ణయించిన నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలు మళ్లీ మూతపడ్డాయి. జిల్లా వ్యాప్తంగా 557 విద్యాసంస్థల్లో బుధవారం నుంచి ప్రత్యక్ష తరగతులు నిలిచిపోయాయి. దీంతో విద్యార్థులంతా ఇంటి దారిపట్టారు. వైరస్ కొంత అదుపులో ఉన్న సమయంలో ఫిబ్రవరిలో ప్రత్యక్ష తరగతులు నిర్వహించేందుకు అనుమతిచ్చిన ప్రభు త్వం నెలన్నర వ్యవధిలోనే వెనక్కి తీసుకోవడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఒక్కసారిగా ఖంగుతిన్నారు. ముఖ్యంగా ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలు ఇబ్బందుల్లో పడ్డాయి. కొన్ని పాఠశాలల్లో హాస్టళ్లు కూడా నిర్వహిస్తుండగా ఫీజులు వసూ లు కాకముందే బంద్ ఆదేశాలు రావడంతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు. మరికొన్ని విద్యా సంస్థలు ముం దస్తుగానే ఫీజులు వసూలు చేయడంతో విద్యార్థుల తల్లిదండ్రులు కలవరపడుతున్నారు. ఇక ప్రభుత్వం నిర్వహిస్తున్న సంక్షేమ హాస్టళ్లు, గురుకులాల విద్యార్థులు బుధవారం ఉదయం నుంచి ఇళ్లకు పయనమయ్యారు. దీంతో విద్యార్థులతో కళకళలాడిన ప్రాంగణాలు ఇప్పుడు బోసిపోతున్నాయి.
పకడ్బందీగా ఆన్‌లైన్ క్లాసులు : వాసంతి, ఇన్‌చార్జి డీఈవో
పాఠశాలలు మూసివేయడంతో ఇక నుంచి ఆన్‌లైన్ క్లాసులపై దృష్టిపెడుతాం. లాక్‌డౌన్ తర్వాత 2021-22 విద్యా సంవత్సరం ప్రారంభంలో అవలంబించిన విధంగానే టీవీ చానెళ్లు, ఇతర మార్గాల ద్వారా ఉచితంగా విద్యాబోధన జరిగేలా చర్యలు చేపడతాం. విద్యార్థులంతా ఆన్‌లైన్ బోధనను వీక్షించేలా నిరంతరం పర్యవేక్షణ జరుపుతాం. ఉపాధ్యాయులు నిత్యం విద్యార్థులతో ఫోన్, వాట్సా్‌పలో సమీక్షించుకునేలా చొరవ తీసుకుంటున్నాం. అన్ని విద్యా సంస్థలు కచ్చితంగా మూసివేసి ప్రత్యక్ష తరగతులు నిర్వహించకుండా చూస్తాం.